నిత్య జీవితంలో మనం ఉపయోగించే వస్తువులపై చాలావరకు మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ సౌత్ కొరియా ముద్రలే చూస్తుంటాం. ఆ మాటకొస్తే.. మన దగ్గర కూడా కొన్ని వస్తువులు తయారవుతున్నాయి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాల ఇందుకు చిరునామాగా నిలిచింది. ప్రొఫెసర్ల మార్గదర్శకత్వంలో.. ఇక్కడి విద్యార్థులు వివిధ ఔషధాలు తయారు చేస్తున్నారు.
కాలేజీ.. సృజనకు ద్వారం. జిజ్ఞాసకు ఊతం. ఆవిష్కరణలకు మూలకేంద్రం. మార్పునకు సంకేతం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాల అక్షరాలా ఆ మార్గంలోనే నడుస్తున్నది. ఇక్కడ టీ బ్యాగ్స్, మల్టీపర్పస్ జెల్, షాంపూ, మునగతో మొరింగా మాత్రలు, కొబ్బరినూనె, కోల్డ్ క్రీమ్, మల్బరీ వైన్ లాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వీటిలో ఔషధ గుణాలు అపారం.
రోగ నిరోధకత పెంచడంలో, ఇన్ఫెక్షన్ల నివారణలో, చర్మ సమస్యలను అడ్డుకోవడంలో, కేశ సంపదను పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. పోషక లోపాలను సరిచేయడానికి ప్రత్యేక గుళికలనూ తయారు చేస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, పాలకూర, ఆనప, చిక్కుడు, డ్రాగన్ ఫ్రూట్.. చాలా ఉత్పత్తులకు ముడి సరుకు. కారు ప్రయాణంలో ఆహ్లాదకర అనుభూతిని అందించడానికి ఎయిర్ ఫ్రెషెనర్స్ కూడా అందిస్తున్నారు. సువాసనల అరోమా థెరపీ అలసటను దూరం చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్
మోజర్ల ఉద్యాన కళాశాల ఉత్పత్తులకు అధికారులు రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్‌నూ పొందారు. ఆరు నెలలకోసారి జాతీయ రహదారిపై ప్రత్యేకంగా స్టాల్‌ను ఏర్పాటుచేసి మేడ్ ఇన్ వనపర్తి మందులను విక్రయిస్తున్నారు. అలాగే ఆన్లైన్ సౌకర్యమూ ఉంది. ‘హార్టికోజెన్’ పేరుతో మొబైల్ గ్రూపు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో రెండువేల మంది సభ్యులు ఉన్నారు. అన్ని రాష్ర్టాల వారికీ తగిన ప్రాతినిధ్యం ఉంది. జూన్ నాటికి మరిన్ని ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి.
కళాశాల మైదానంలో ఔషధ, పండ్ల మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. అలొవేరా, లోరిమోస, నేల ఉసిరి, కుందేటి కొమ్ము, తులసి.. ఇందులో కొన్ని. ఎర్రమందారం, మైదాకు, బార్బడోస్ చెర్రీ, శంఖపుష్ప, శతావరి, సిట్రానెల్లా, వట్టివేళ్లు, లెమన్‌గ్రాస్, వాటర్ స్పినాచ్ తదితర మొక్కలూ పెంచుతున్నారు. ఆరంభం నుంచే రసాయన మందులను దూరం పెడుతున్నారు. స్కిల్
ఓరియెంటేషన్ ప్రోగ్రాం ద్వారా ఎంపికైన విద్యార్థులకే తయారీలో పాలుపంచుకునే అవకాశం ఇస్తారు.
ఏటా పదిమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. కళాశాల వేళలు ముగిసిన తర్వాతే .. ఈ పనులన్నీ చేసుకోవాలి. ‘మా కళాశాలలో ఉత్పత్తి చేసే మందులు చాలా శక్తిమంతమైనవి. ఒకే గోళి రెండు, మూడు రకాల జబ్బులకు పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన మందు వాడితే చర్మ సమస్యతోపాటు చుండ్రు, నెత్తిలో పేలు కూడా పోతాయి’ అని సగర్వంగా చెబుతారు శ్రావణి అనే విద్యార్థిని.
‘ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడాలి అనుకునేవారికి హార్టికల్చర్ మంచి అవకాశం. అందులోనూ ఇక్కడ చదివితే భవిష్యత్తు బంగారమే’ అని వివరిస్తారు డీన్ పిడిగెం సైదయ్య. నిజానికి ఈ విజయం సమష్టి కృషి ఫలితం. డీన్ నుంచి సాధారణ ఉద్యోగి వరకు .. అంతా చేతులు కలిపారు. విద్యార్థులలో స్ఫూర్తి నింపారు. పట్టా చేతబట్టుకుని ఆవరణ దాటే సమయానికే ప్రతి విద్యార్థీ నూటికి నూరుశాతం ప్రొఫెషనల్ అవుతారు. ‘మేడ్ ఇన్ వనపర్తి’ ముద్రతో కెరీర్ ప్రయాణం ఆరంభిస్తారు.
ఉపద్రవాలొచ్చినా తట్టుకోవాలి..
కరోనా వంటి ఉపద్రవాలు వచ్చినా సమాజం తట్టుకోగలగాలి. ఆ సత్తువ రావాలంటే రసాయన, క్రిమిసంహారక మందులకు మనం దూరంగా ఉండాలి. ఈ దిశగా పండ్లు, కూరగాయలతో తయారైన ఔషధాలతో అద్భుతాలు సాధిస్తున్నాం. కళాశాల ఆవరణతోపాటు, కొండకోనల నుంచి మూలికలు సేకరిస్తున్నాం. హిమాలయాల నుంచీ కొన్ని తీసుకొచ్చాం.
– డాక్టర్ జె.శంకరస్వామి అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, మోజర్ల, వనపర్తి జిల్లా
…? వంగూరు నర్సింహారెడ్డి