ఫ్యాషన్ ప్రపంచంలో భారతదేశానికి చెందిన సంప్రదాయ దుస్తులు, నగలు ఎప్పుడూ ప్రత్యేకమే! మగువల మేనిపై మెరిసిపోయే ఆభరణాలకు మనదేశమే పుట్టినిల్లు. సంక్లిష్టమైన కళానైపుణ్యంతో రూపొందిన జడావు ఆభరణాలకు పూర్వం ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. రాచరికపు శోభను ఇనుమడింపజేసేలా రాళ్లను పొదిగే ప్రత్యేక నైపుణ్యాన్ని జడావు కళగా పిలిచేవారు. అలా రూపుదిద్దుకున్న ఆభరణాలు జడావు నగలుగా ప్రసిద్ధి. నేటికీ పెండ్లిళ్లు, పండుగలు లాంటి సంప్రదాయ వేడుకల్లో ఈ భారీ నగలను ధరిస్తున్నారు. పట్టుచీర మీదికైనా, లంగావోణీ, గాగ్రా పైకి కూడా ఇవి అందంగా నప్పుతాయి.
ఇందులో భారీ కంఠాభరణాలు, చోకర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కెంపులు, వజ్రాలు, పచ్చలు, వైడూర్యాలు ఇలా విలువైన రత్నాలను ఎలాంటి జిగురు లేకుండా నగల ఆకృతుల్లో పొదగడమే కాకుండా, ఎలాంటి ఎనామిల్ ఫినిషింగ్ లేకుండా రూపొందించడమే జడావు నగల ప్రత్యేకత.
తరాల కిందటి నగలను ఈ తరం మెచ్చే విధంగా రూపొందిస్తున్నారు డిజైనర్లు. రాళ్ల కాంబినేషన్లోనూ వైవిధ్యాన్ని చూపుతూ అతివల మనసు దోచేస్తున్నారు. ఈ తరహా నగలు బంగారంలోనే కాకుండా ఇమిటేషన్ జువెలరీగానూ అందుబాటులోకి వచ్చాయి. వన్‌గ్రామ్ గోల్డ్, ఆక్సిడైజ్డ్ సిల్వర్లోనూ ఇవి దొరుకుతున్నాయి. ఎందుకు ఆలస్యం.. మీరూ ఒకసారి ట్రై చేయండి.