‘వేసవి’లో చర్మ సంరక్షణకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. సన్‌స్క్రీన్ లోషన్స్, మాయిశ్చరైజర్స్ అంటూ ఎన్నెన్నో టిప్స్ ఫాలో అవుతుంటారు. కురుల విషయంలో మాత్రం కేర్లెస్గా ఉంటారు. అయితే.. వేసవి వేడి వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెమట వల్ల కుదుళ్లలో సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇక ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం వాడే కూలర్లు, ఏసీలు జుట్టును నిర్జీవం చేస్తాయని అంటున్నారు. అందుకే.. వేసవిలోనూ జుట్టు సంరక్షణ చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
ఉసిరి : ఎండకు జుట్టు పొడి బారుతుంది. చివర్లు చిట్లడంతోపాటు జుట్టు కూడా ఎక్కువగా రాలుతుంది. ఈ సమస్యకు ఉసిరి సమర్థంగా చెక్ పెడుతుంది. గుప్పెడు ఉసిరికాయలను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దను కుదుళ్లకు పట్టించి.. మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ప్రతి తలస్నానానికి ముందు ఇలా చేస్తే.. జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది.
తేనె : పావు కప్పు తేనెను ఒక గిన్నెలో తీసుకొని.. సన్నని మంటపై గోరువెచ్చగా వేడిచేయాలి. అందులో పావు కప్పు ఆలివ్ లేదా కొబ్బరినూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టేలా బాగా అప్లయి చేయాలి. తర్వాత వేడినీటిలో ముంచిన టవల్‌ను నెత్తికి చుట్టుకోవాలి. అరగంట తర్వాత తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్.. పొడిబారిన జుట్టుకు తిరిగి జీవం పోస్తుంది.
మినపపప్పు : అర కప్పు మినపపప్పులో ఒక టీస్పూన్ మెంతులు కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీనికి అర కప్పు పెరుగు కలిపి.. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. అరగంట అలాగే వదిలేసి.. తక్కువ గాఢత ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. వెంట్రుకల చివర్లు చిట్లడాన్ని తగ్గించడంలో మెంతులు సాయపడతాయి. ఇక మినపపప్పు.. కుదుళ్లను బలంగా మార్చడంతోపాటు జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది.
కోడిగుడ్డు : ఒక గిన్నెలో కోడిగుడ్లలోని ఒక తెల్లసొన, రెండు పచ్చసొనలు తీసుకోవాలి. దీనికి ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె జోడించి.. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకొని.. పావుగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కోడిగుడ్డు జుట్టుకు పోషణనిస్తే.. కురులు కోల్పోయిన తేమను తేనె తిరిగి అందిస్తుంది.