బిజీబిజీ జీవితం! అంతా.. గజిబిజి గందరగోళం! తీరికలేని పని.. మానసిక ఒత్తిడిని పెంచేస్తున్నది. అనారోగ్యానికి ఆహ్వానం పలుకుతున్నది. తగినంత విశ్రాంతి దొరక్క.. మనశ్శాంతి దూరమైపోతున్నది. మొత్తంగా.. కంటినిండా నిద్రే కరువైపోతున్నది. ఇలాంటి వాళ్లందరికీ ఓ ప్రత్యేకమైన గమ్యస్థానం ఉన్నది. అదే.. స్లీప్ టూరిజం! అంటే.. కేవలం నిద్రపోవడానికే టూర్‌కు వెళ్లడం.
టూర్‌కు వెళ్లడమంటే.. నచ్చిన ప్రదేశాలను సందర్శించడం. చరిత్రాత్మక ప్రాంతాలను చుట్టిరావడం. గుళ్లుగోపురాలను దర్శించడం. గుట్టలు ఎక్కీదిగడం. బీచ్‌లలో ఎంజాయ్ చేసి రావడం. ఇంతే! కానీ, ఈ స్లీప్ టూరిజం అందుకు పూర్తిగా భిన్నం! కేవలం విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యమిస్తూ.. వివిధ ప్రాంతాలను సందర్శించడమే ఈ ‘స్లీప్ టూరిజం’. దీన్నే ‘డ్రీమ్ టూరిజం’ అని కూడా పిలుస్తున్నారు.
పని ఒత్తిడితో మానసికంగా చిత్తయిపోతున్న వాళ్లంతా.. ఇప్పుడు ‘స్లీప్ టూరిజం’ బాట పడుతున్నారు. ఆనందంతోపాటు ఆరోగ్యాన్నీ వెతుక్కుంటూ ప్రకృతి ఒడిలోకి ప్రయాణాలు కడుతున్నారు. అలా వందలో వేలలో కాదు.. కమ్మటి నిద్ర కోసం ఏటా లక్షలాది మంది లక్షలు ఖర్చుపెడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితానికి కొన్నిరోజులు కామా పెట్టేసి.. కామ్‌గా పడుకుండి పోతున్నారు.
తమకు తామే ఫుల్రీచార్జ్ అవుతూ.. ఒత్తిడిని చిత్తు చేసుకుంటున్నారు. స్లీప్ టూరిజం చేసేవాళ్లు ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ.. మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. ఇలాంటి టూర్లలో ఎక్కువగా యోగా సెషన్లు, స్విమింగ్, స్పా చికిత్సలు, ఆరోగ్యకరమైన భోజనంతోపాటు నిద్రకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని హోటల్స్ నిర్వాహకులు కూడా వీరికి తగిన సౌకర్యాలను కల్పిస్తున్నారు. అతిథులకు నిద్రాభంగం కలగకుండా.. గదులను సౌండ్ఫ్రూఫ్గా మార్చేస్తున్నారు. తాజాగా, ఈ ట్రెండ్‌పై స్కై స్కానర్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా 70 శాతం మంది భారతీయులు స్లీప్ టూరిజానికి ఆసక్తి చూపుతున్నారని తేల్చింది. వీరిలో 57 శాతం మంది సెలవు దినాల్లో ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించింది.