ప్రేమ పండాలంటే రెండు మనసులు చాలు. కానీ, పెండ్లి కుదరాలంటే ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు మనస్ఫూర్తిగా కలవాలి. ఉద్యోగం, ఆస్తిపాస్తులు, రూపలావణ్యాల ఒరవడిలో కొట్టుకుపోతున్న ఈ తరం.. పెండ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నది. కాస్త స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే.. మీ పెండ్లిపుస్తకం ఓ అందమైన కావ్యంగా మారుతుంది. పెండ్లి ప్రయత్నాల్లో ఉన్న యువతీ యువకులు దృష్టి సారించాల్సిన అంశాలు ఇవి..
వయసు మీద పడుతుందనో, పెద్దల ఒత్తిడికి తలొగ్గో, బంధువులు సిఫారసు చేశారనో పెండ్లి విషయంలో నిర్ణయానికి రావొద్దు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా? అని మీ మనసును అడగండి. సమాధానం ‘సిద్ధం’ అని వచ్చినప్పుడే… ఏడడుగులకు రెడీ అని ఇంట్లోవాళ్లకు చెప్పండి.
ఈ రోజుల్లో పెండ్లిచూపుల తంతు చిత్రవిచిత్రంగా సాగిపోతున్నది. అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకునే వెసులుబాటు అన్ని ఇండ్లలో ఉంటున్నది. అయితే, గంటల తరబడి మాట్లాడుకుంటున్నా… ఇరువురికీ స్పష్టత రావడం లేదు. దీనికి కారణం.. ఎవరి అంచనాలు వాళ్లకు ఉండటమే! మీకేం కావాలో స్పష్టత కలిగి ఉంటే.. ఈ పరిస్థితి తలెత్తదు. మనిషితోపాటు కుటుంబానికీ ప్రాధాన్యం ఇవ్వాలన్న సంగతి మర్చిపోకండి.
‘నూరు అబద్ధాలు ఆడైనా ఒక పెండ్లి చేయాలి’ అంటారు పెద్దలు. పెండ్లి పెటాకులు కావడానికి.. నూరు దాకా ఎందుకు ఒక్క అబద్ధం చాలు! అందుకే, పెండ్లిచూపుల వేళ.. అన్నీ నిజాలే చెప్పండి. అవతలి వ్యక్తినీ నిజాలే చెప్పమని కోరండి. ఆ నిజాల్లో నిజాయతీ ఉందనిపిస్తే.. ఆ సంబంధం గురించి పాజిటివ్‌గా ఆలోచించొచ్చు. అదెలా తెలుస్తుంది అంటారా! మాటల్లో నిజాయతీ కరువైనప్పుడు అవి చెప్తున్న వ్యక్తి కండ్లల్లో అపరాధ భావన తొంగిచూస్తుంది.
పెండ్లికి ముందు ఎన్ని చెప్పుకొన్నా.. వివాహం తర్వాత సర్దుకుపోయే మనస్తత్వం తప్పనిసరి. పెండ్లి బాజాలు మోగడానికి ముందు రోజుల తరబడి చాటింగ్‌లో ఊసులు పంచుకున్నా, ఎన్నిసార్లు కలుసుకున్నా.. పెండ్లయ్యాక ఒకరిపై ఒకరికి అనుకోకుండానే ఆధిపత్యం వస్తుంది. మన వివాహ వ్యవస్థలో ఇది సర్వసాధారణం. దాన్ని అంగీకరించకుండా.. ఈ పెత్తనాలేంటి? అనుకున్నారో, పేచీలు ఖాయం. అలా కావొద్దంటే.. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలి.
ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకోవాలి. పెండ్లయ్యాక కనీసం ఆరు మాసాలు ఒకరినొకరు స్టడీ చేయాలి. ఎదుటి వ్యక్తిలోని లోపాలను గుర్తించడమే పనిగా పెట్టుకోవద్దు. వారిలోని మంచి గుణాలనూ అంచనా వేయాలి. వాటికి అనుగుణంగా మీ వ్యవహార శైలిని మార్చుకోవాలి. అప్పుడు ఆల్ హ్యాపీస్!