వేసవిలో ఏదో ఓ చోటుకు ఎన్నో కొన్ని రోజులు వెళ్లొస్తే కానీ మనసుకు తృప్తిగా ఉండదు. అకాల వర్షాలు, అనూహ్యమైన ఎండలు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే. కాకపోతే, ఆ ట్రిప్ సాఫీగా సాగేందుకు ఈ టిప్స్ సాయపడతాయి.
సూట్కేస్ నిండా బట్టలతో ప్రయాణమంటే ఇబ్బందే. సాధ్యమైనన్ని తక్కువ డ్రెస్లు తీసుకెళ్లండి. అందులోనూ.. తెలుపు, బూడిదరంగులాంటి న్యూట్రల్ కలర్స్వే ఎంచుకోండి. ఎందుకంటే, వీటికి మ్యాచింగ్ వెతుక్కోవాల్సిన పన్లేదు. ఏ రంగుకైనా అతికినట్టు సరిపోతాయి.
విమాన ప్రయాణంలో లగేజీ బరువుకు పరిమితులు ఉంటాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకూ తేలికపాటి వస్ర్తాలనే తీసుకెళ్లండి. ఇక్కడో వెసులుబాటు ఉంది. ఇవి వేగంగా ఆరిపోతాయి. రింకిల్ ఫ్రీ అయితే ఇంకా మేలు. ఇస్త్రీ అవసరం ఉండదు. అంతదూరం ఐరన్బాక్స్ మోసుకెళ్లాల్సిన బాధ తప్పుతుంది.
ఒకే వస్ర్తాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఆలోచించండి. ఉదాహరణకు.. షాల్ను అవసరమైతే స్కార్ఫ్లా మొహానికి చుట్టుకోవచ్చు. ఆపత్కాలంలో తలగడలానూ పనికొస్తుంది.
ఓ పెద్ద బ్యాగులో అన్నీ తురిమేసుకోవడం కంటే.. చిన్న చిన్న బ్యాగులలో సర్దుకోవడమే ఉత్తమం. ఒక బ్యాగులో ఫార్మల్స్, ఒక బ్యాగులో నైట్వేర్.. ఇలా అన్నమాట.
మీరు వెళ్తున్న ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను బట్టి తీసుకెళ్లాల్సిన బట్టల్ని ఎంచుకోవడం ఉత్తమం. అక్కడ చలి ఎక్కువ ఉంటే.. స్వెటర్ తప్పదు. తరచూ వర్షాలు కురుస్తుంటే.. చిన్న గొడుగు ఉండాల్సిందే.
మొత్తంగా.. లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అనే సూత్రాన్ని మరిచిపోకూడదు. హ్యాపీ జర్నీ!