ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్టరాల్, గుండె సంబంధ వ్యాధుల వంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండేందుకు నిపుణులు ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే పైన పేర్కొన్నవేగాక కిడ్నీలను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. కిడ్నీలు శరీరంలోని ద్రవాల సమతుల్యతను నిర్వహిస్తాయి. అంతేగాక శరీరంలోని విషపదార్థాలను, వ్యర్థాలను క్రమం తప్పకుండా విసర్జించడంలో తోడ్పడుతాయి.
కిడ్నీలు తమ విధులు సక్రమంగా నిర్వహించడంలో మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పోషకాహార నిపుణుడు రూపాలీ దత్త ప్రకారం.. గాయాలను నయం చేయడంలో, ఇన్ఫెక్షన్లను నివారించడంలో, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడంలో మంచి పోషకాహారం అవసరం. అలాంటి పోషకాహారం మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఈ కింది ఏడు రకాల ఆహార పదార్థాలను మీ మెనూలో భాగం చేసుకుంటే కిడ్నీలకు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు..
1. పప్పు
Dal | దేశంలోని ప్రతి ఇంటిలో పప్పును ప్రధానమైన వంటకంగా చెప్పవచ్చు. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పప్పు వంటకాలను చేసుకుంటారు. పప్పుల్లో కూడా పలు రకాలుంటాయి. కానీ, పప్పు ఏ రకమైనదైనా, దాన్ని ఏ రకంగా వండుకున్నా రకాన్ని బట్టి ఆ పప్పులోని పోషక విలువల్లో మాత్రం తేడాలు ఉండవు. పప్పు గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేగాక, పప్పు సులభంగా జీర్ణమవుతుంది. కాబట్టి కిడ్నీ ఆరోగ్యానికి ఇది మంచి ఆహారం.
2. ఖిచ్డీ
Khichdi | ఈ ఖిచ్డీని తయారు చేయడం చాలా తేలిక. ఖిచ్డీ తినడంవల్ల కడుపుపై పెద్దగా భారం పడినట్లు అనిపించదు. అంతేగాక ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచి ఆహారం. ఖిచ్డీలో సాధారణంగా పప్పు, బియ్యం ఉంటాయి. ఈ రెండింటిలోనూ పొటాషియం, పాస్ఫరస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖిచ్డీ కిడ్నీలకు సరైన ఆహారంగా పరిగణించబడుతుంది.
3. పరోటా
Paratha | పరోటాలను అల్పాహారంగా లేదంటే మధ్యాహ్న భోజనంగా తీసుకోవడం కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, ఈ పరోటాలను తయారు చేయడానికి నూనె, నెయ్యిలను మితంగా వాడాలి. పరోటాల్లో నూనె, నెయ్యిలను తక్కువ మోతాదులో వాడటంవల్ల శరీరంలో యూరియా స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చు. ఫలితంగా భవిష్యత్తులో కిడ్నీలు చెడిపోయే ప్రమాదం తప్పుతుంది.
4. దోసె
Dosa | దోసెలను సాధారణంగా వివిధ రకాల పప్పులతో, రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలతో చేసుకుంటారు. ఇలా దోసెల తయారీకి వాడే పదార్థాలన్నీ కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే పైన పేర్కొన్న అన్ని పదార్థాల్లో సోడియం, పోటాషియం, పాస్ఫరస్ మోతాదులు చాలా తక్కువగా ఉంటాయి. అంతేగాక దోసెలు తినడంవల్ల జీర్ణాశయంలో కిణ్వ ప్రక్రియ (ఆహార పదార్థం పులియడం) జరిగి సులభంగా జీర్ణమవుతుంది.
5. ఇడ్లీ
Idli | దోసెల మాదిరిగానే ఇడ్లీలు కూడా కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం. ఆరోగ్యకరమైన సాంబార్ దాల్ లేదంటే కొబ్బరి చట్నీతో కలిపి ఈ ఇడ్లీలను ఆహారంగా తీసుకోవచ్చు. ఇడ్లీలు సులభంగా జీర్ణమై మూత్రపిండాలపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది.
6. ఉప్మా
Upma | ఉప్మాను సాధారణంగా రవ్వతో తయారు చేస్తారు. దీనిలో పొటాషియం, కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యానికి మంచిది. తక్కువ నూనెతో తయారు చేసిన ఉప్మాను ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆహారంగా ఇవ్వవచ్చు.
7. బెండకాయ కూర
Bhindi ki sabzi | ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటి అయిన బెండకాయల్లో పెద్ద మొత్తంలో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అంతేగాక కిడ్నీలపై ప్రభావం చూపించే పొటాషియం, ఫాస్పరస్, సోడియం, కొలెస్టరాల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం బెండకాయ కూరను మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.