కదలక మెదలక కూర్చుంటే, బెల్లంకొట్టిన రాయిలా… అంటూ పోలుస్తారు. కఠినమైన మనసును కూడా అది హృదయమా, పాషాణమా.. అని నిష్ఠురమాడతారు. రాయంటే కదలనిదనీ, మారనిదనే మనకు తెలుసు. కానీ రొమేనియా దేశంలోని ‘ట్రోవెంట్స్’గా పిలిచే ఈ బండలు కదులుతాయి, పెరుగుతాయి కూడా!ఆ వింత ఏంటో మనమూ తెలుసుకుందాం!
వాననీటిలో ఉండే ఖనిజాలు, ఈ రాళ్లలోని రసాయనాలతో చర్య జరపడం వల్ల ఇవి పెరుగుతున్నాయట. సగటున వెయ్యేళ్ల కాలంలో రెండు అంగుళాలు ఇవి పెరుగుతాయట. ఇక, పెద్ద వానలు పడినప్పుడు వీటి నుంచి మైక్రో ట్రోవెంట్స్గా పిలిచే చిన్న చిన్న రాళ్లు బయటికి వస్తాయట. కాలక్రమంలో అవి విడివడి మరో ట్రోవెంట్గా పెరుగుతూ ఉంటాయి. ఈ రాళ్ల విషయంలో ఇదో విచిత్రం.
ప్రపంచం వింతల మయం. వెతకాలే కానీ, ప్రకృతిలో ఏడు వింతలు కాదు ఏడు వందల వింతలు కనిపిస్తాయి. అలాంటివే ఈ రాళ్లు! ఐరోపాలోని రొమేనియా దేశ రాజధాని బుఖరెస్ట్కు 50 కిలోమీటర్ల దూరంలోని కాస్టెస్టి గ్రామంలో వీటిని మనం చూడవచ్చు. ఈ రాళ్లని ‘ట్రోవెంట్స్’గా పిలుస్తారు. ప్రకృతి ఒడిలో ఏర్పాటు చేసిన అక్కడి మ్యూజియంలో మనకు ఈ మార్పు చెందే రాళ్లు దర్శనమిస్తాయి. ఒక చోటు నుంచి మరో చోటుకి కదలడం, పరిమాణం పెరగడం, అలాగే వానాకాలంలో ఈ రాళ్ల నుంచి వాటిని పోలిన మరో చిన్న చిన్న రాళ్లు బయటికి రావడం వీటి ప్రత్యేకత. అందుకే వీటిని ‘లివింగ్ స్టోన్స్’ (జీవమున్న రాళ్లు) అని కూడా పిలుస్తారు!
ట్రోవెంట్స్ సాధారణ బండలలాగే గుండ్రంగా, వివిధ ఆకృతుల్లో ఉంటాయి. వీటిలో కొన్ని… గ్రాముల బరువుండే గులకరాళ్లయితే, కొన్ని… టన్నుల బరువుండే బండలు. అయితే వీటి వింతైన స్వభావం వల్ల రాక్షసబల్లి గుడ్లని కొందరంటే, శిలాజాలు అని కొందరు, ఏలియన్లకు సంబంధించిన వస్తువులని కొందరు అంటుంటారు. 5.3 మిలియన్ల సంవత్సరాల ముందు ఇంకా చెప్పాలంటే మనిషికన్నా ముందు ఇవి ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ రాళ్ల లోపలివైపు గట్టి రాయి ఉండి, బయటివైపు ఇసుక పొరలతో నిర్మితమై ఉంటాయి. అయితే ఇవి కదలడానికి, పెరగడానికి కల ప్రత్యేక కారణాలేంటి అన్నది ఇప్పటిదాకా సైంటిస్టులు కనిపెట్టలేకపోయారు. ఇవి ఉన్న ప్రదేశం, వర్షంలాంటివి వీటిని ప్రభావితం చేస్తున్నాయని మాత్రం పసిగట్టారు. ఇక ఈ రాళ్లున్న ప్రాంతం ఒకప్పుడు సముద్రం ఉండేదిగా చెబుతున్నారు.
ఈ రాళ్ల లోపల ఆల్చిప్పలు, గవ్వల్లాంటి వాటి శిలాజాలు ఉన్నాయని కూడా గుర్తించారు. ఇక చెట్ల వయసును తెలిపేలా వాటి కాండంలో వలయాలు ఏర్పడినట్టే వీటిలో మధ్యలోనూ ఏర్పడతాయట. వివిధ విశ్వవిద్యాలయాలు వీటి గురించి మరిన్ని పరిశోధనలు చేస్తుండగా, ఈ వింతైన రాళ్లను అందరూ చూసేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, ఇప్పటికైతే ఇవి ఒక ప్రకృతి వింత!