ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొండకోనల్లో జీవించే గిరిజనులకు వనమంటే ప్రాణం. వారి జీవనవిధానంలో సహజ సౌందర్యం ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఈ అడవి బిడ్డలు ధరించే ఆభరణాలు.. ప్రకృతి సోయ‘గాలాలు’ వేస్తాయి! ఈ ఆభరణాల్లో ఒక్కో తెగవి ఒక్కో శైలిలో ఉంటాయి. వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఆధునిక అతివలను తెగ ఆకట్టుకుంటున్న ఢోక్రా ఆదివాసీ ఆభరణాల ముచ్చట్లు ఇవి..
ఢోక్రా నగలు భారతదేశంలోని ప్రాచీన కళారూపాలలో ఒకటి. వీటిది శతాబ్దాల చరిత్ర. ఈ నగలు సింధు నాగరికతలోనూ మనగడలో ఉన్నాయని చెబుతారు. తరతరాలుగా గిరిజనులు ఈ కళారూపాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రకృతి అందాలు, జంతువులు, పక్షులు, ఆదివాసీ దేవతల ఆకృతులు ఈ నగల్లో నిగనిగలాడుతూ ఉంటాయి. చేతులతో తీర్చిదిద్దిన ఈ ఆభరణాల్లో అణువణువూ అద్భుతం అనిపిస్తుంది. వీటిని సాధారణంగా కంచు, ఇత్తడితో తయారుచేస్తారు.
లాస్ట్ వాక్స్ టెక్నిక్‌ను ఉపయోగించి కళాకారులు వీటిని తయారుచేస్తారు. ఈ పద్ధతిలో మొదట మైనంతో అచ్చు (మోల్డ్) తయారుచేసి దాని చుట్టూ మట్టి పూత పూస్తారు. తర్వాత మైనాన్ని కరిగిస్తారు. దాని స్థానంలో కంచు లేదా ఇత్తడిని కరిగించి పోసి నగకు ఓ రూపం తెస్తారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, తెలంగాణ తదితర రాష్ర్టాల్లోని గిరిజన కళాకారులు వీటిని రూపొందిస్తున్నారు. ఇదే పద్ధతిలో ఇప్పుడు స్వచ్ఛమైన బంగారం, వెండి, ప్లాటినం లాంటి ఖరీదైన లోహాలతో తయారైన నగలు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.
ఢోక్రా ఆభరణాలు ప్రకృతి అందాలను, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సూర్యచంద్రులు, రాధాకృష్ణులు, చెట్లు, జంతువుల ఆకారాలు పొదిగిన హారాలు, వంకీలు, కంకణాలు, కమ్మలు, పట్టీలు.. ఇలా రకరకాల నగలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. పర్యావరణ అనుకూలమైన ఢోక్రా నగలు ఆధునిక ఫ్యాషన్‌కు ఏమాత్రం తీసిపోవు. సంప్రదాయ దుస్తులతోపాటు ట్రెండీవేర్ పైకీ ఇట్టే నప్పుతాయి. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనుకునేవారికి ఈ ఆభరణాలు సరైన ఎంపిక. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయండి!