ఉదయం ఉప్మా తింటూ.. టీవీ చూస్తున్నది కోమలి. తనకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. ఓ పిజ్జా సెంటర్లో పనిచేస్తూ చిన్న గదిలో ఒంటరిగా అద్దెకు ఉంటున్నది. పిజ్జా సెంటర్‌కు వచ్చే కొందరిని చూసినప్పుడల్లా.. వారిలా పోష్ లైఫ్ గడపాలని ఆమెకు ఎంతో కోరికగా ఉండేది. అయితే, తనకు వచ్చే అత్తెసరు జీతానికి అది సాధ్యం కాదని ఆమెకు తెలుసు. ఈ ఆలోచనతోనే ఉప్మా తింటుండగా డోర్ బెల్ మోగింది.
కోమలి వెళ్లి తలుపు తెరిచింది. డోర్ తీయగానే ఎదురుగా ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్. ‘ఎవరు మీరు?’ అని ప్రశ్నించింది కోమలి. ‘లోపలికి రావొచ్చా?’ అని అడిగిన రుద్రతో రమ్మనంటూ సైగ చేస్తూ పక్కకు జరిగింది. పేరేంటని రుద్ర అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆమె.. అక్కడ తాను ఒక్కదాన్నే ఉంటున్నట్టు, పనిచేసే చోటు ఇలా అన్నీ చెప్పింది. హెడ్ కానిస్టేబుల్ రామస్వామి వివరాలు నోట్ చేసుకొంటున్నాడు. కాసేపయ్యాక.. ‘సార్.. మీరు అడిగిన వివరాలు అన్నీ చెప్పాను. ఇంతకూ మీరు ఎందుకు వచ్చినట్టు? ఇప్పటికైనా చెప్తారా?’ ప్రశ్నార్థకంగా అడిగింది కోమలి.
‘చెప్తాం.. కోమలి గారూ’ అంటూ ఓసారి గదిని నిశితంగా పరిశీలించిన రుద్ర చెప్పడం మొదలుపెట్టాడు. ‘కోమలి గారూ.. నిన్న సాయంత్రం మాదాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ఎంఎంటీఎస్ రైలులో ఓ దొంగతనం జరిగింది. ఓ డబ్బు ఏండ్ల ముసలావిడ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఎవరో అపహరించారు. జేమ్స్ స్ట్రీట్ స్టేషన్ ప్రాంతంలో ఇది జరిగినట్టు మా దర్యాప్తులో ప్రాథమికంగా తెలిసింది’ అంటూ చెప్తున్న రుద్ర మాటలకు అడ్డుపడ్డ కోమలి.. ‘ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారు?’ అంటూ ఎదురు ప్రశ్నించింది.
‘మేడమ్.. సారు అదే చెప్పబోతున్నారు. కాస్త ఓపిగ్గా వినండి’ అంటూ కసురుకొంటున్న రామస్వామిని వారించాడు రుద్ర. మళ్లీ మాట్లాడుతూ ‘దొంగతనం జరిగినట్టు భావిస్తున్న జేమ్స్ స్ట్రీట్ స్టేషన్లో అదే సమయంలో రైలు నుంచి మీరు దిగారు. దీంతో దొంగతనం గురించి..’ అంటూ రుద్ర పూర్తిచేసే లోపే.. ‘ఓహో.. ఆ దొంగతనం నేనే చేశాననా? మీకు అనుమానం? అంతేలేండి. పేద వాళ్లంటే అందరికీ చులకనే. ఏ తప్పు జరిగినా ముందుగా బలయ్యేది మాలాంటి వాళ్లమే కదా’ అంటూ ఉక్రోశంతో ఉడికిపోయింది.
ఆమె మాటలకు రుద్ర అడ్డుపడుతూ.. ‘కోమలి గారూ.. ఆ పెద్దావిడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. ఆ కంపార్ట్మెంట్లో మీరు, మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ, మీరు ఏ తప్పూ చేయకుంటే, ఆ మరో వ్యక్తి ఈ పని చేసి ఉండొచ్చు కదా’ అని సర్దిచెప్పబోయాడు. ‘మరైతే, ఆ మరో వ్యక్తినే విచారించండి’ అంటూ కరుగ్గా అంది కోమలి. ‘ముఖానికి మొత్తం మఫ్లర్ కట్టుకోవడంతో ఆ వ్యక్తిని ఆ ముసలావిడ చూడలేదట. కేవలం మిమ్మల్నే చూసిందట. ఆ తర్వాత తాను సృహ కోల్పోయినట్టు చెప్పింది’ అంటూ రుద్ర చెప్పాడు. ‘అవును సార్. మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తున్నది. ఓ వ్యక్తి నాతోపాటే నెక్లెస్ రోడ్డు స్టేషన్లో రైలు ఎక్కాడు. కాసేపటికి ఓ ముసలావిడతో మాట కలిపాడు. ఆ తర్వాత ఆమె నిద్రలోకి జారుకొంది’ అంటూ కోమలి చెప్పింది. ‘ఆ తర్వాత?’ అంటూ ఆత్రుతగా ప్రశ్నించాడు రుద్ర.
‘అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. మాట్లాడి అటువైపు చూసేలోపు ఆ వ్యక్తి రైలులో టాయ్‌లెట్‌కు అని వెళ్లాడు. హా.. వెళ్తూ వెళ్తూ ఓ బ్యాగ్‌ను, ఓ కర్చీఫ్లో ఏదో సామానులాంటివి కూడా తీసుకెళ్లాడు. బహూశా అతనే ఆ దొంగతనం చేసి ఉండొచ్చు’ అని కోమలి అంది. ‘ఆ తర్వాత?’ అన్నాడు రామస్వామి. ‘ఏంటండీ? నాకు తెలిసిన విషయం చెప్పాను. నన్ను దొంగగా చూడటం మానండి. ఆ వ్యక్తి టాయ్‌లెట్‌కు వెళ్లగానే.. కాసేపటికే జేమ్స్ స్ట్రీట్ స్టేషన్ వచ్చింది. నేను రైలు దిగేసి వచ్చేశా. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చూడండి’ అంటూ కటువుగా బదులిచ్చింది కోమలి. ‘రైలు దిగేటప్పుడు.. మీరు ఓ పెద్ద బ్యాగ్ తీసుకెళ్తున్నట్టున్నారు. అందులో ఏమున్నాయ్?’ అంటూ రామస్వామి అడిగిన ప్రశ్నకు.. అంతెత్తున లేచిన కోమలి.. ‘లేడీస్‌కి అవసరమైన పర్సనల్ థింగ్స్, దుస్తులు ఇలా ఎన్నో ఉంటాయ్. బ్యాగ్ తీసుకెళ్లినంత మాత్రాన.. దొంగతనం నేనే చేసినట్టా?’ అంటూ కోపం తెచ్చుకొంది కోమలి.
‘ఓకే కోమలి గారూ.. దొంగతనం విషయం అటుంచండి. అసలే బయట ఎండలు దంచికొడుతున్నాయ్. కాస్త ఆ టేబుల్ ఫ్యాన్ ఆన్ చేయండి’ అంటూ రుద్ర అడిగాడు. దానికి కోమలి ఏదో చెప్పబోతుండగా.. ‘సార్.. సార్.. నిన్న అదే కంపార్ట్మెంట్లో ఓ చిన్న సీలింగ్ ఫ్యాన్ కూడా పోయింది’ అంటూ రామస్వామి గుర్తుచేశాడు. ‘భలే బాగుంది. ఇప్పుడు రైలులో పోయిన ఆ సీలింగ్ ఫ్యాన్.. ఈ టేబుల్ ఫ్యాన్ ఒకటే అనా మీ ఉద్దేశం. అసలు ఏం జరుగుతున్నది? ఎవడో బంగారం ఎత్తుకెళ్తే, మా ఇంటికి రావడమేంటి? గోల్డ్ కోసం వచ్చి సీలింగ్ ఫ్యాన్ పోయిందని ఇన్వెస్టిగేట్ చేయడమేంటి? నేను హ్యూమన్ రైట్ కమిషన్‌లో మీపై ఫిర్యాదు చేస్తా?’ అంటూ కోమలి ఊగిపోయింది.
ఆ మాటలేం పట్టించుకోకుండా రుద్ర తాపీగా మాట్లాడుతూ.. ‘కోమలి గారూ.. మీరు పోకిరి సినిమా చూశారా?’ అని అడిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కోమలి.. ‘ఇన్స్పెక్టర్ గారూ.. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు?’ అంటూండగానే.. యూట్యూబ్‌లో పోకిరీ సినిమాలోని ఓ సీన్‌ను కోమలికి చూపించాడు రుద్ర. అలాగే, అక్కడే ఉన్న ఫ్యాన్‌ను ఆన్ చేశాడు. అది ఆన్ కాలేదు. ఒక్కసారిగా కోమలి వైపునకు చూడగానే.. ‘సార్.. ఏదో సరదా లైఫ్‌కు ఆశపడి ఆ ముసలావిడ నగలను నేనే దొంగతనం చేశా. లూజ్ ఫిట్టింగ్ ఉండటంతో పోతూపోతూ ఈ ఫ్యాన్‌ను కూడా నేనే ఊడబీక్కొని వచ్చా’ అంటూ ఒప్పేసుకొంది కోమలి. నిజం ఒప్పుకొన్న కోమలితో రామస్వామి సంతకం తీసుకొంటుండగా.. రుద్ర మొబైల్ రింగ్ అయ్యింది. నగలు పోగొట్టుకొన్న ముసలావిడ చనిపోయిందని ఆ కాల్ సారాంశం. దీంతో రుద్ర షాక్ అయ్యాడు. వెంటనే కోమలి వైపు తిరగ్గానే.. ‘సార్.. దొంగతనం నేను చేసిన మాట వాస్తవమే. అయితే, ముసలావిడ ఎలా చనిపోయిందో ప్రమాణపూర్తిగా నాకు తెలియదు’ అంటూ బోరుమన్నది. దీంతో థెఫ్ట్ కేసు కాస్త మిస్టరీ మరణంగా మారడంతో కేసును లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించాడు రుద్ర. కాగా, పోకిరీలో సీన్‌ను చూడగానే, ఫ్యాన్‌ను ఆన్ చేయగానే.. కోమలి ఎందుకు నిజం ఒప్పేసుకొంది? మీరు కనిపెట్టారా??
…? రాజశేఖర్ కడవేర్గు