ఒకప్పుడు బొగ్గుగనుల్లో పని చేయాలంటేనే జంకేవారు. భూమి పొరల్లో బొగ్గు వెలికి తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. గాలిసక్రమంగా అందక కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. గని ప్రమాదాల్లో చనిపోయిన వారెందరో ఉన్నారు. ఇక ముందుతరం ఈ పనులు చేయలేరు అని కార్మికులు అభిప్రాయపడేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గనుల్లో సాంకేతికత అభివృద్ధి చెందింది. సంస్థలో యువరక్తం చేరుతున్నది. కేసీఆర్ కల్పించిన కారుణ్య నియామకాల హక్కుతో కార్మికుల పిల్లల భవిష్యత్తుకు భరోసా ఏర్పడింది. ఇప్పుడు సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమ్మాయిలు సైతం బొగ్గు గనుల్లో అడుగుపెట్టారు. క్లిష్టమైన పనుల్లోనూ రాణిస్తున్నారు. అధికారులుగా, కార్మికులుగా, టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తూ.. చరిత్రను తిరగరాస్తున్నారు.
అతివ నడుం బిగిస్తే.. అసాధ్యమనేదే ఉండదు అని నిరూపిస్తున్నారు ఈ సింగరేణి రాణులు. నల్లబంగారు గనుల్లో సత్తా చాటుతున్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తిలో అమ్మాయిలు సైతం కదం తొక్కుతున్నారు. ప్రస్తుతం సంస్థలో 1,960 మంది మహిళలు పనిచేస్తున్నారు. మజ్దూర్ నుంచి మేనేజర్ స్థాయి దాకా వివిధ కొలువుల్లో కొలువుదీరి మగవారికి దీటుగా రాణిస్తున్నారు. పురుషులే భారంగా భావించే మైనింగ్ విభాగంలో నారీ శక్తి నానాటికీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో వారికోసం అధికారులు ప్రత్యేక గనులను ఏర్పాటుచేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 5 ఇంక్లయిన్ను మహిళా గనిగా మార్చేందుకు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదట ఒక సెక్షన్లో, అనంతరం ఒక షిప్టులో, తర్వాత ఫలితాలను బట్టి గనిలో పూర్తిస్థాయిలో మహిళా శక్తిని వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన కారుణ్య నియామకాలతో అమ్మాయిలకు బొగ్గుగనుల్లో ఉద్యోగం చేసే అవకాశం లభించింది.
ఒకప్పుడు సింగరేణి కార్యాలయాల్లో మినహా ఇతర విభాగాల్లో మహిళలు పనిచేసిన దాఖలాలు లేవు. 2018లో కేసీఆర్… సింగరేణిలో కారుణ్య నియామకాల హక్కును కల్పించి కార్మికుల పిల్లలకు భరోసా అందించారు. దీంతో కార్మికుడు చనిపోతే భార్య లేదా కుమారుడు, కుమార్తెకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఏర్పడింది. అలాగే కార్మికుడు అనారోగ్యంతో అన్‌ఫిట్ అయితే కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇచ్చే హక్కును మళ్లీ తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎందరో మహిళా కార్మికులు సంస్థలో అడుగుపెట్టారు. కేవలం కారుణ్య నియామకాల ద్వారానే కాకుండా టెక్నికల్ విద్యను అభ్యసించిన అమ్మాయిలు అండర్ మేనేజర్లుగా, ఓవర్మెన్లుగా బొగ్గుగనుల్లో ఉద్యోగం చేస్తున్నారు. సింగరేణిలోని 11 డివిజన్లలో 1,960 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో 144 మంది ఎగ్జిక్యూటివ్ హోదాలో, 1,816 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు.
మహిళా కార్మికులకు అండగా నిలవడానికి సింగరేణి సంకల్పించింది. కొత్తగూడెంలోని పీవీకే 5, భూపాలపల్లిలోని కేటీకే 5 ఇంక్లయిన్, గోదావరిఖనిలో ఒకదాన్ని మహిళా గనులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. మొదటగా భూపాలపల్లిలోని కేటీకే 5 ఇంక్లయిన్‌లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నారు. ఇక్కడ రోజుకు సుమారు 700 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం బీటెక్ మైనింగ్ చేసిన అమ్మాయిలు అండర్ మేనేజర్ ట్రైనీలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక షిఫ్ట్ మొత్తం మహిళా కార్మికులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మహిళా అండర్ మేనేజర్లు, మహిళా ఓవర్మెన్ల పర్యవేక్షణలో బ్యాచ్‌ల వారీగా విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం దీనిని పూర్తిస్థాయి మహిళా గనిగా మార్చే యోచనలో ఉన్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే.. సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్టే అని భావించొచ్చు. అతివ రాజ్యమేలుతున్న ఎన్నెన్నో రంగాల్లో భూగర్భం కూడా వచ్చి చేరుతుంది అనడంలో సందేహం లేదు!
నేను బీటెక్ మైనింగ్ చేశాను. మైనింగ్ డిపార్టుమెంట్ అంటే కష్టమన్నారు. అయినా వెనుకాడలేదు. మాది తొర్రూరు దగ్గర పోచంపల్లి. నాన్న పేరు బల్లూ.. వ్యవసాయం చేస్తారు. నన్ను చాలా కష్టపడి చదివించారు. 2021లో బీటెక్ పూర్తిచేశాను. సింగరేణిలో ఎక్స్టర్నల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాను. గత డిసెంబర్లో ఉద్యోగంలో చేరాను. భూపాలపల్లిలోని కేటీకే 5 ఇంక్లయిన్‌లో అండర్ మేనేజర్ ట్రైనీగా విధులు నిర్వర్తిస్తున్నా. గని లోపల పూర్తిస్థాయి పట్టు సాధించాను. గతంలో సింగరేణిలో అమ్మాయిలకు అవకాశం ఉండేది కాదు. ఆఫీస్ స్టాఫ్‌లో అరుదుగా కనిపించేవారు. ఇప్పుడు అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నది. గనిలోనూ మహిళలు కీలకంగా పనిచేస్తున్నారు. సింగరేణిలో మహిళల భాగస్వామ్యం అవసరం.
– బి.మౌనిక, అండర్ మేనేజర్ ట్రైనీ
వరంగల్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ (2015-17) పూర్తిచేశాను. 2024లో సింగరేణి పరీక్ష రాశాను. అదే ఏడాది డిసెంబర్ 16న ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం ట్రైనీగా పనిచేస్తున్నా. మా నాన్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి. ఆయన సలహా మేరకే ఐటీఐ చేశాను. ఆయన ప్రోత్సాహంతోనే గనుల్లో ఏ బెరుకూ లేకుండా పనిచేస్తున్నాను. భూమి లోపలి పొరల్లోకి వెళ్లి.. కష్టమైన పనులెన్నో నేర్చుకుంటున్నా. ట్రైనింగ్ తర్వాత గని బయటా, లోపలా పనులు చేయాల్సి ఉంటుంది. సంస్థ అభివృద్ధికి నావంతు కృషి చేస్తాను. ఇప్పటివరకు సింగరేణిలో మహిళలు ఫిట్టర్ పనిచేసిన దాఖలాలు లేవని అధికారులు చెప్పారు. నాకు అలాంటి అవకాశం రావడం గర్వంగా ఉంది.
– ఎద్దు సౌజన్య, ఫిట్టర్
సింగరేణి చరిత్రలో ఎలక్ట్రీషియన్ హోదాలో ఇప్పటివరకు అమ్మాయిలు ఎవరూ పని చేయలేదు. గనుల్లో భారీ మోటార్లు ఉంటాయి. కరెంటుకు సంబంధించిన పని కత్తిమీద సాములాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా భారీ నష్టం జరుగుతుంది. నా విషయానికి వస్తే.. మాది హన్మకొండ దగ్గరిలోని పైడిపల్లి గ్రామం. నాన్న మేస్త్రీ పనిచేస్తారు. నన్ను కష్టపడి చదివించారు. వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో 2013-15లో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పూర్తిచేశాను. గతేడాది డిసెంబర్ 16న నేను సింగరేణి కేటీకే 5 ఇంక్లయిన్‌లో ఎలక్ట్రీషియన్ ట్రైనీగా జాయిన్ అయ్యాను. అధికారుల సాయంతో పనిమీద పట్టు సాధిస్తున్నా! సింగరేణిలో మాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
– పి.శ్రీకన్య, ఎలక్ట్రీషియన్
– అమ్ముల తిరుపతి