భారతదేశం నదుల దేశం. నది భారతీయులకు పవిత్రమైనది. దేవతగా కొలుస్తూ నదులకు పన్నెండేండ్లకు ఓసారి పుష్కరాలు జరుపుకొంటారు. సింధు నాగరికత మొదలుకుని ఇప్పటివరకు ఎన్నో నాగరికతలకు నదులు పుట్టినిండ్లు. తాగునీరు, సాగునీరు, విద్యుత్తు, మత్స్యసంపద మొదలైనవి మానవాళికి నదులు ఇస్తున్న వరాలు. ఇక మన జీవిత ప్రయాణం నదిని తలపిస్తుంది. నదిలానే… కొన్నిసార్లు మంద్రంగా సాగుతుంది, మరికొన్ని సందర్భాల్లో అంతులేని అగాధాలకు జారిపోతుంది. అందుకే మనం నది నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలి. వాటిని ఆకళించుకుని జీవితాన్ని సానుకూలంగా మార్చుకోవాలి.
ముందుకు సాగాలి
పుట్టినచోటు నుంచి ప్రవహించే క్రమంలో నది భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. ఏ రూపాన్నయినాధరిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే తనకే సొంతమైన మార్గంలో ముందుకు సాగిపోతుంది. మనమూ నదిలానే పురోగమించాలి.
లక్ష్యమే లక్ష్యంగా
వెడల్పుగా ఉన్నా, ఎంత దూరం ప్రయాణించినా, ఎంత లోతుగా ఉన్నప్పటికీ నది ప్రయాణం సాగరానికే. మనమూ నది లక్షణాలను ఆవాహనం చేసుకుని జీవితం ఒడుదొడుకులతో సంబంధం లేకుండా మన లక్ష్యం దిశగా సాగిపోవాలి.
గతం గతః
నదీ గమనంలో ముఖ్య విషయం… ఒకసారి ప్రవాహం మొదలైందంటే అది ఎన్నడూ మరి వెనక్కి వెళ్లదు. మనం కూడా గతం మర్చిపోవాలి. నిరంతరం సానుకూల దృక్పథంతో వర్తమానంలోంచి భవిష్యత్తు మీద దృష్టి సారించాలి.
ఒక్కొక్క అడుగు వేయాలి
ఇక లక్ష్యం వైపు నడక సాగించడంలో నది అనవసరమైన తొందరపడదు. చేరే సమయం వచ్చినప్పుడు తప్పకుండా సముద్రానికి చేరుకుంటుంది. మనం కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒకరోజు లక్ష్యాన్ని చేరుకుంటాం.
తగ్గి నెగ్గాలి
నది ప్రయాణంలో అడవులు, కొండలు, ఎత్తుపల్లాలు ఎన్నో ఎదురవుతాయి. కానీ, నదికి ఎక్కడ తగ్గాలో తెలుసు. ఎలా ముందుకు సాగిపోవాలో కూడా తెలుసు. మనం నదిలానే తగ్గేచోట ఒదిగి ఉండాలి. ఓర్పు వహించి లక్ష్య సాధనలో గెలుపు సొంతం చేసుకోవాలి.
పట్టుదలతో పయనం
ఇక నది తనకు అడ్డం వచ్చిన రాళ్లను ఒక్కపెట్టున శక్తిని అంతా ఉపయోగించి కోతకు గురిచేయదు. పట్టుదలతో నిదానంగా కఠినమైన రాళ్లను కరిగించుకుంటూ వెళ్లిపోతుంది. మనం కూడా ప్రతికూలతలు ఒక్కసారిగా తొలగిపోని సమయాల్లో ఓర్పు, పట్టుదలతో పోరాటం ఆపకుండా ముందుకు సాగాలి.
ప్రవాహానికి అనుగుణంగా
నది తన ప్రవాహానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. మనమూ అంతే… జీవన ప్రవాహంతో సాగిపోతూ ఉండాలి. అడ్డుకునే ప్రయత్నం చేస్తే మన జీవితం కూడా ఆగిపోతుంది. నదిలా దిశ మార్చుకుని ముందుకు వెళ్లడమే జీవితంలో మనం చేయాల్సిన ఉత్తమమైన పని.