యువతులను ఎక్కువగా వేధించే సమస్య.. పిగ్మెంటేషన్. బుగ్గలు, నుదురుపై ఏర్పడే ఈ నల్లటి మచ్చలు.. అమ్మాయిల ముఖ వర్చస్సును దెబ్బతీస్తాయి. వీటిని పోగొట్టుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు. అయితే, ఇంట్లో దొరికే పదార్థాలతోనే.. ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ఒక గిన్నెలో రెండు టేబుల్స్పూన్ల ఓట్మీల్, ఒక టేబుల్‌స్పూన్ పెరుగు, అర టేబుల్‌స్పూన్ టమాటా రసం వేసి.. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లని మచ్చలపై రాసి.. 15-20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. టమాటాలో ఉండే సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు.. చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఓట్మీల్.. ఎక్సోఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ఇక పెరుగు.. ముఖాన్ని మృదువుగా చేస్తుంది.
కలబంద గుజ్జు, తేనె.. ఒక్కో టేబుల్‌స్పూన్ తీసుకోవాలి. ఇందులో రెండు టేబుల్స్పూన్ల పొప్పడి గుజ్జు వేసి.. ప్యాక్‌లాగా చేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్ ఉన్న చోట రాసి అరగంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. కలబందలోని సుగుణాలు.. చర్మంలో కొలాజెన్ స్థాయులను పెంచుతాయి. ముఖాన్ని మెరిపిస్తాయి. ఇక ముఖంపై మచ్చలను తొలగించడంలో తేనె సమర్థంగా పనిచేస్తుంది. పొప్పడిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్.. చర్మంపైన నల్లని మచ్చలు, మొటిమలను తగ్గిస్తుంది.
గుప్పెడు పుదీనా ఆకులను మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్ ఉన్న ప్రాంతాల్లో అప్లయి చేసి.. 10-15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో పుదీనా సాయపడుతుంది.
సోయాపాలు, నిమ్మరసం, టమాటా గుజ్జు ఒక టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకొని.. మెత్తటి పేస్ట్‌గా చేసుకోవాలి. నల్లని మచ్చలమీద ఈ మిశ్రమాన్ని అప్లయి చేసి.. పది నిమిషాలపాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత 10-15 నిమిషాలు బాగా ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే సరి. టమాటాలో ఉండే లైకోపీన్ వంటి యాంటి ఆక్సిడెంట్లు.. చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. చర్మ
ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి.
ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి.. పొడిగా చేసుకోవాలి. అందులో కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తని పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పిగ్మెంటేషన్ ఉన్నచోట అప్లయి చేసుకొని.. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు.. చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తాయి.