భారతీయ వంటకాల్లో అన్నం ప్రధానం. చాలామంది ఒక పూటైనా సరే అన్నం తింటారు. దక్షిణాదిలో అయితే రెండు పూటలా అన్నం ఆరగించాల్సిందే. దోసె, ఇడ్లీలో కూడా బియ్యాన్నే వాడుతుంటారు. అయితే ఈ బిజీ లైఫ్ ైస్టెల్ కారణంగా చాలామంది బియ్యాన్ని సరైన పద్ధతిలో ఉడికించకుండానే వండుకొని తినేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అన్నం వండడానికి ముందు బియ్యాన్ని నీటిలో కాసేపు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
బియ్యంలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరానికి అందాల్సిన ఐరన్, జింక్, క్యాల్షియాన్ని నిరోధిస్తుంది. బియ్యాన్ని కడిగిన తర్వాత కొంతసేపు నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ తొలిగిపోయి పోషకాలు మెరుగవుతాయి. జింక్, ఐరన్ లోపాలతో బాధపడుతున్నవారు బియ్యాన్ని నానబెట్టిన తర్వాత వండుకోవాలి. నానబెట్టడం వల్ల అన్నం తక్కువ సమయంలోనే సిద్ధమవుతుంది. అన్నంలో జిగట తగ్గడంతోపాటు నోటికి రుచికరంగా ఉంటుంది.
నానబెట్టడం మూలంగా ైగ్లెసమిక్ ఇండెక్స్ తగ్గి రక్తంలో చకెర స్థాయులు అమాంతం పెరగకుండా ఉంటాయి. ప్రస్తుతం రకరకాల బియ్యం మార్కెట్లో లభిస్తున్నాయి. వాటి గుణాన్ని బట్టి నానబెట్టే సమయం మారుతుంది. తెల్ల బియ్యాన్ని 15-20 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇక బాస్మతి రైస్ అయితే.. 20-30 నిమిషాలు, బ్రౌన్ రైస్ అయితే 6-8 గంటలు నానబెట్టడం మంచిదని చెబుతున్నారు. తెల్లబియ్యాన్ని మరీ ఎక్కువ సమయం నానబెడితే అందులోని విటమిన్లు, ఖనిజాలు కరిగి, బయటికి వెళ్లిపోతాయి. దీంతో బియ్యంలోని పోషక విలువలు తగ్గుతాయి.