ఈశాన్య రాష్ట్రం మిజోరం ఇటీవలే భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా రికార్డు సాధించింది. ఆ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 98.20 శాతం. అక్షరాస్యత అంటే గుర్తుకువచ్చే కేరళను దాటుకుని మిజోరం ఈ విజయం సాధించడం వెనక బలమైన కారణాలు, దశాబ్దాల పాటు సాగిన ప్రయత్నాలు ఉన్నాయి. నిజానికి మిజోరం 1980లలోనే మంచి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నిలిచింది. కానీ, ఆ రాష్ట్ర ప్రజలు అక్కడితో ఆగిపోలేదు.
సంపూర్ణ అక్షరాస్యత దిశగా వాళ్లు అలుపెరగకుండా శ్రమించారు. రాష్ట్రంలో ప్రతి ఇల్లూ తిరిగారు. పెద్దల్లో నిరక్షరాస్యులను గుర్తించారు. వారికి అక్షర జ్ఞానం కలిగించారు. 2000-10 దశాబ్దంలో సర్వశిక్ష అభియాన్, ‘జోరం ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ ప్రయత్నాల మూలంగా మారుమూల ప్రాంతాల్లోనూ బళ్లు వెలిశాయి. స్థానిక ఉపాధ్యాయులకు మంచి శిక్షణ అందించారు. కొత్తవాళ్లను నియమించారు. ఇందులో స్థానిక పౌర సమాజం, ధార్మిక సంస్థలు, యువజన సంఘాలు, మహిళలు కూడా తమవంతు చేయూత అందించారు. వయోజన విద్యను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకున్నారు. అలా 2011 నాటికి మిజోరం 91.3 శాతం అక్షరాస్యత సాధించింది. దీంతో ఇంకా ఎవరైనా అక్షర జ్ఞానం లేకుండా మిగిలిపోయారా అనే ఆలోచన చేశారు.
సంపూర్ణ అక్షరాస్యత కోసం విద్యార్థులు మొదలుకుని విశ్రాంత విద్యావేత్తల వరకు సుమారు 290 మంది స్వచ్ఛందంగా విద్యాదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఎలాంటి ఫలితం ఆశించకుండానే తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. పిల్లలకు తొలిదశలో ప్రజల మాతృభాష మిజోలో బోధించారు. దీంతో పిల్లలకు చదువంటే భయం పోయింది. డ్రాపవుట్ రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. 2022 నాటికి ప్రాథమిక విద్యలో చేరిన విద్యార్థుల్లో దాదాపు 90 శాతం మంది తమ చదువును కొనసాగిస్తుండటం విశేషం. ఇక నేర్చుకోవడం కూడా తరగతి గదులకే పరిమితం కాలేదు.
వలంటీర్లు ఇల్లిల్లూ తిరిగారు. స్థానిక మండళ్లు వయోజన విద్యను కొనసాగించాయి. అలా అక్షరాస్యత అనేది అందరి ఆశయంగా మారిపోయింది. సామాజిక విలువలు, సమ్మిళిత విధానాలు, అన్నిటికీ మించి విద్య తమ జీవితాలను మారుస్తుందనే బలమైన విశ్వాసం వల్ల మిజోరం ఈ విజయం సొంతం చేసుకుంది. దేశంలోని ఇతర రాష్ర్టాలు కూడా ఈ చిన్న రాష్ర్టాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. సంపూర్ణ అక్షరాస్యతతో సాధికారత సాధించాలి.