ఇన్ఫోగ్రాఫిక్
ఆధునిక ప్రపంచానికి వేగం ఎక్కువ. ఇక మహానగరాల్లో ఉండేవాళ్లయితే వేగానికి అదనంగా కాలుష్యాన్ని కూడా భరించాల్సిందే. పైగా తమకంటూ గడపడానికి సమయం ఉండదు. ఎంత వేగంగా ఉన్నా కాసేపు సేదదీరడానికి మనకు ప్రకృతి ఎంతో ఇచ్చింది అనే
విషయాన్ని చాలామంది గ్రహించరు. ఇలాంటివారికి స్వచ్ఛమైన గాలి పీల్చి, ఒత్తిళ్ల నుంచి సాంత్వన పొందడానికి జపాన్ ఉపశమన విధానం షిరిన్ యోకు పనికొస్తుంది. ఈ విధానం 1980లలో పుట్టింది. ఒత్తిడి,దీర్ఘకాలిక వ్యాధులపై పోరాటానికి ఆరోగ్య అవగాహనలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. అప్పటినుంచి షిరిన్ యోకు ప్రభావం గురించి అధ్యయనాలు జరుగుతున్నాయి. ఫలితాలు కూడా గణనీయంగానే ఉన్నాయి.
ప్రకృతి చికిత్స
షిరిన్ యోకు అంటే అడవి స్నానం అని అర్థం. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రకృతి చికిత్స లాంటిదన్నమాట. అడవి స్నానం అంటే నదుల్లో దూకడమో, కొండలు ఎక్కడమో కాదు. పచ్చటి ప్రదేశంలో మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా గడపడం. అడవిలో నెమ్మదిగా నడవడం, గాఢంగా గాలి పీల్చుకోవడం, సహజమైన పరిసరాలను ఇతర ఆలోచనలు, వ్యాపకాలు లేకుండా గమనించడం.
ఇన్ఫెక్షన్స్పై పోరాటం
అడవి వాతావరణంలో చెట్లు, మొక్కలు ఫైటోన్సైడ్స్, సేంద్రియ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. వీటిని పీల్చినప్పుడు ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి లభిస్తుంది.
ఒత్తిడి చిత్తు
చెట్ల నుంచి వచ్చే తాజా గాలి సహజంగానే నెమ్మదిగా డయాఫ్రమాటిక్ శ్వాసను ప్రోత్సహిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ స్థాయులను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
శ్వాసకు ఊపిరి
శ్వాస వ్యవస్థ విషయానికి వస్తే… అడవి గాలి.. కాలుష్యం, అలర్జెన్లు, హానికరమైన ధూళికణాలకు దూరంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఫలితంగా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. కొన్నాళ్లు అడవి వాతావరణంలో ఉన్నాక శ్వాసించడం సులువైనట్టు, దగ్గు తగ్గినట్టు కొంతమంది అభిప్రాయం.
రోగ నివారిణి
షిరిన్ యోకు మనల్ని ఉల్లాసంగా ఉంచే ప్రక్రియ మాత్రమే కాదు… రోగ నివారణ ఔషధం కూడా!
పచ్చటి ప్రదేశం ఏదైనా..
అడవి స్నానం అంటే అడవుల్లోనే ఉండిపోవాలని అర్థం కాదు. ఏదో ఒక ఉద్యానవనంలో, రకరకాల చెట్లు ఉండే బొటానికల్ గార్డెన్లో, పచ్చగా ఉన్న పరిశుభ్రమైన ఏ ప్రదేశంలో ఉన్నా దాదాపుగా ఇవే ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇలా వారంలో ఒకసారికి అరగంట చొప్పున రెండు మూడుసార్లు చెట్ల మధ్య గడపాలి. దీంతో ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. శ్వాసించే క్రమం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.