చేనేత కార్మికుల కళా నైపుణ్యంతో సిరిసిల్ల ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరనేసిన సిరిసిల్ల మగ్గంపై మరెన్నో ఆవిష్కరణలు చేసింది. ఆ వారసత్వానికి కొనసాగింపుగా సేంద్రియ సాగులో పత్తిని పండించి, రసాయనాలు లేని రంగులద్ది, మగ్గంపై వస్ర్తాలను నేస్తూ మార్కెట్లో మళ్లీ విజయాలు సాధిస్తున్నది. మల్ఖా సంస్థ చేయూత తంగళ్లపల్లి చేనేతకు చేవనిచ్చింది. పర్యావరణానికీ మేలు చేస్తున్నది.
సిరిసిల్ల ప్రాంతం ఎప్పటి నుంచో చేనేతకు పట్టుగొమ్మగా పేరుగాంచింది. ఆ రోజుల్లో వేలాదిమంది చేనేత కార్మికులు పనిచేసేవాళ్లు. మార్కెట్లోకి అడుగుపెట్టిన మిల్లు వస్ర్తాలు చేనేత కార్మికుల ఉపాధిని పోగొట్టాయి. గడిచిన అయిదు దశాబ్దాల్లో చేనేత రంగం అనేక మార్పులకు లోనైంది. సంక్షోభాలను ఎదుర్కొంది. ఆ సంక్షోభ కాలంలో చేనేత కార్మికుల కోసం సిరిసిల్లలో మల్ఖా సంస్థ అడుగుపెట్టింది. చేనేత కార్మికులకు ముడి సరుకులిచ్చి వాళ్ల ఉత్పత్తులను సేకరించడం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నం కూడా మరమగ్గాల ధాటికి నిలువలేకపోయింది.

చేనేత రంగంలో ఉపాధి లేకపోవడం ఒక సమస్య, పరిశ్రమ వల్ల పర్యావరణ కలుష్యం మరో సమస్య. ఈ రెండు సమస్యలకు పరిష్కారం సేంద్రియ పద్ధతులను ఆదరించడమే. కాబట్టి పర్యావరణాన్ని కాపాడేందుకు, సంప్రదాయ చేనేతను ప్రోత్సహించేందుకు మల్ఖా సంస్థ రెండు దశాబ్దాల కిందట ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తంగళ్లపల్లి (నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని ఒక చేనేత సహకార సంఘానికి ఆర్థిక చేయూతనిచ్చింది. స్థానిక రైతులు, చేనేత కార్మికులు సమన్వయంతో ఆర్గానిక్ కాటన్ని మగ్గంపై ఉత్పత్తి చేసేందుకు మల్ఖా సంస్థ ప్రణాళికలు రూపొందించింది. రైతులకు దేశవాళీ పత్తి విత్తనాలను అందించింది. సాగులో పర్యావరణానికి హానిచేసే రసాయనాలు వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపింది. సేంద్రియ పద్ధతుల్లో పురుగు మందులు తయారు చేసుకునేలా రైతులకు శిక్షణ ఇచ్చింది. రైతులు పండించిన ఆ పంటను మల్ఖా సంస్థే కొనుగోలు చేసింది. ఆ పత్తిని చేనేత సహకార సంఘానికి అందించి, మగ్గంపై వస్త్రం నేసేలా ప్రోత్సాహించింది. పత్తి నుంచి విత్తనాలు సేకరించి మరో పంటకు వినియోగించేలా తోడ్పాటును అందించింది.

కొన్నేండ్లపాటు చేనేతను వదిలేయడంతో పాడైపోయిన మగ్గాలను మల్ఖా సంస్థే మరమ్మతులు చేయించింది. సేంద్రియ పద్ధతిలో పండిన పత్తితో దారం తీసి, మగ్గంపై వస్త్రం నేసి, హాని కారక రసాయనాలు లేని రంగులు అద్దేలా మల్ఖా చేనేత కార్మికులను ప్రోత్సహించింది. సంస్థ సహకారంతో పద్నాలుగు మగ్గాలపై సేంద్రియ వస్ర్తాలను ఉత్పత్తి చేస్తున్నారు. తంగళ్లపల్లి మగ్గాలపై చీరలు, డ్రెస్ మెటీరయల్, లుంగీలు, తువ్వాలలు, దుప్పట్లు తయారు చేస్తున్నారు. ఈ వస్ర్తాలను చేనేత కార్మికుల నుంచి మల్ఖా సంస్థే కొనుగోలు చేస్తుంటుంది. వాటిని హైదరాబాద్, ఇతర నగరాల్లో విక్రయిస్తున్నది. ఈ ప్రయోగానికి ఆదరణ ఉండటంతో ఇరవై ఏళ్లుగా ఆర్గానిక్ కాటన్ ఉత్పత్తి చేస్తూనే ఉంది. ఒకప్పుడు అన్నం పెట్టని మగ్గం చేనేత కార్మికులకు భరోసానిచ్చింది. ఆర్గానిక్ కాటన్కి దేశంలోని నగరాల్లోనే కాదు విదేశాల్లో కూడా డిమాండ్ ఉంది. జర్మనీ, జపాన్ దేశాల ప్రతినిధులు మల్ఖా చేనేత కేంద్రాన్ని సందర్శించారు. మల్ఖా సంస్థ ద్వారా అనేక దేశాలకు స్థానిక చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతుండటం విశేషం. ఈ ప్రయాణం మరింత ఉన్నతంగా కొనసాగాలని మనమూ ఆశిద్దాం!

తంగళ్లపల్లిలోని మల్ఖాతో కలిసి ఇరవై ఏండ్లుగా పనిచేస్తున్నాం. పద్నాలుగు మగ్గాలపై ఇక్కడ చేనేత వస్ర్తాల నేస్తున్నాం. మొదట్లో ప్లేన్ వస్త్రాలను నేశాం. పదేండ్లుగా రంగు రంగుల వస్ర్తాలను నేస్తున్నాం. వస్ర్తాల తయారికి అయ్యే ఖర్చులు, నిర్వహణ మల్ఖా సంస్థనే చూసుకుంటున్నది. సంస్థే మాకు వేతనాలిస్తున్నది.
– బూర నారాయణ, నిర్వాహకుడు
– సామల గట్టయ్య రాజన్న సిరిసిల్ల