డయాబెటిస్, ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవాళ్లు మెడిటేరియన్ దేశాల ప్రజల్లా తింటే ఆరోగ్యం మెరుగవుతుందని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ఓ మంచి వార్త చెప్పింది. మెడిటేరియన్ దేశాల ప్రజలు శారీరకంగా దృఢంగా ఉంటారు. అంతేకాదు వాళ్ల సగటు ఆయుష్షు కూడా ఎక్కువే! అంత బలం, ఆరోగ్యం గురించి చర్చ జరిగినప్పుడల్లా మెడిటేరియన్ డైట్ గురించి ప్రస్తావన వస్తుంది. నార్డిక్ దేశాల (డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్) ప్రజల ఆహారపు అలవాట్ల నుంచి వచ్చిన మెడిటేరియన్ డైట్లో అన్నిరకాల పోషక పదార్థాలుంటాయి. తక్కువ కార్బోహైడ్రేట్లు, మాంసం (ప్రొటీన్) వాళ్ల ఆహారంలో ఉంటుంది.
అయితే ఈ ఆహారం ద్వారా ఏవైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు టైప్ 2 డయాబెటిస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ జబ్బులతో బాధపడేవాళ్లతో ఓ ప్రయోగం చేశారు. పన్నెండు నెలల పాటు వారికి మెడిటేరియన్ డైట్‌ని అందించారు. తృణధాన్యాలు, కూరగాయల ముక్కలు, కొవ్వు కలిగిన మాంసాహారం కలిపి వడ్డించారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలు, మాంసం ఉన్న ఈ ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉండి, నియంత్రణలో ఉంటున్నదని, లివర్ ఫ్యాట్ ఇరవై శాతం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు.