చిన్నారులపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా, వారి లేత చర్మం.. త్వరగా ప్రతిస్పందిస్తుంది. ఇక శీతకాలంలోనైతే చలిగాలులు, తక్కువ తేమ వల్ల ఇట్టే పొడిబారుతుంది. దాంతో వారిలో దురద మొదలై.. చికాకు కలిగిస్తుంది. అందుకే, చలికాలంలో పిల్లల చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
పిల్లల్ని రాత్రిపూట పడుకోబెట్టే ముందు.. వారి శరీరానికి మాయిశ్చరైజర్ అప్లయి చేయాలి. ఉదయం స్నానం చేయించడానికి ముందు కూడా.. నూనెతో సున్నితంగా మసాజ్ చేయాలి. దీనివల్ల వారి చర్మం పొడిబారకుండా ఉంటుంది. చల్లని వాతావరణం వల్ల కోల్పోయిన తేమను.. నూనెలోని కొవ్వు ఆమ్లాలు తిరిగి నింపుతాయి. శరీరంలో రక్త ప్రసరణనూ మెరుగుపరుస్తాయి.
వేడినీటి స్నానం వల్ల పిల్లల చర్మం త్వరగా పొడిబారుతుంది. కాబట్టి, నీళ్లు గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. స్నానం చేయించే సమయాన్ని కూడా తగ్గించాలి. చిన్నారులు బాత్టబ్లోకి దిగితే.. అంత త్వరగా బయటికి రారు. కాబట్టి, చలికాలంలో బాత్టబ్లను దూరం పెట్టడమే మంచిది. ఇక రాత్రి పడుకునే ముందు స్నానం చేయించవద్దు.
చిన్నపిల్లల సబ్బులు, ఇతర ఉత్పత్తుల ఎంపికలో జాగ్రత్త వహించాలి. సేంద్రియ ఉత్పత్తులతో తయారైన వాటినే ఎంచుకోవాలి. రసాయనాలతో నిండిపోయే సబ్బులు, షాంపూలు.. చిన్నారుల చర్మానికి హాని కలిగిస్తాయి. పిల్లలకు శీతల గాలులు తగలకుండా చూసుకోవాలి. వారి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు వేయాలి.