మనిషి సంతోషంగా ఉండటానికి ఏం కావాలి? డబ్బుంటే కుదరదు. మనిషి సంతృప్తిగా ఉండాలంటే ఏం కావాలి? విజయం దక్కితే సరిపోదు. తన జీవితం పరిపూర్ణం కావాలంటే కుటుంబం ఒక్కటీ చాలదు? మరి ఇంకేం కావాలి. తన సంతృప్తి, సంతోషం, సంపూర్ణత… అన్నింట్లోనూ లోటు లేకుండా ఉండాలి అంటే?? స్నేహం కావాలి. తన సుఖదుఃఖాలలో తోడుండేందుకు, విజయాన్ని పంచుకునేందుకు, కుటుంబంలా కలిసి ఉండేందుకు ఓ మిత్రుడు కావాల్సిందే! ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కానీ. ఆరోగ్యంతో పాటు జీవితంలో కావాల్సినవి, కోరుకున్నవి ఎన్ని దక్కినా కూడా మన పక్కన ఓ మిత్రుడు లేకపోతే బతుకు అంపశయ్యలా భారంగా మారిపోతుంది.
ఆ స్నేహం గురించి కొత్తగా చెప్పుకొనేందుకు ఏముంది? స్నేహం విలువ, మన జీవితం మీద దాని ప్రభావం, అందులో ఒడుదొడుకులను దాటడం లాంటి ఎన్నో విషయాల గురించి సవాలక్ష సందర్భాలలో వింటూనే వస్తున్నాం. కానీ విదేశాలలో స్నేహం, మిత్రుల మీద సోషల్ మీడియా ప్రభావం లాంటి కొన్ని అంశాలను తల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా భావిస్తున్నాం కాబట్టి… ఈ రోజు కాస్త ఆ సంగతులు పట్టించుకుందాం!
ఫ్రెండ్షిప్ డే ప్రారంభం వెనుక ఉన్న కథ అంత ఆకర్షణీయంగా ఏం ఉండదు. హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు… తన గ్రీటింగ్ కార్డుల అమ్మకం కోసం ఈ రోజును ప్రారంభించాడు. ఆ ఉద్దేశం పూర్తిగా వాణిజ్యపరమైనదే! కానీ, అప్పటికింకా మొదటి ప్రపంచ యుద్ధపు చేదు జ్ఞాపకాలు ఎవరూ మర్చిపోలేదు, రెండో ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమవుతున్నారు. గాలి, నేల సైతం పగ, ప్రతీకారాలతో మండుతున్న ఆ సమయంలో స్నేహపు విలువను అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ఫ్రెండ్షిప్ డే ప్రపంచవ్యాప్తం అయ్యింది. అప్పటి నుంచీ ఏటా వచ్చే ఈ రోజు కేవలం స్నేహాన్ని, స్నేహితులను గుర్తుచేసుకునే సమయం మాత్రమే కాదు… కాలానుగుణంగా మన బంధాలలో వస్తున్న మార్పును గమనించే సందర్భం కూడా! మరి ఇప్పటి స్నేహంలో వచ్చిన మార్పులేంటి?
ఓ మనిషి 150 మందికి మించి స్నేహితులతో బంధాన్ని ఏర్పరుచుకోలేడన్న సూత్రం ఒకటి ఉంది. దీనిపేరు డన్బర్ సిద్ధాంతం. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని వేలమంది స్నేహితులు ఉన్నారు. వీరిలో ఎవరన్నా మన ఎదురుగా వచ్చి నిలబడితే… చూసి గుర్తుపట్టలేని, గుర్తుపట్టినా మాట్లాడలేని వాతావరణం. కారణం సోషల్ మీడియా స్నేహం అనేది ఇప్పుడు ఓ సంఖ్యగానే మారిపోయింది. అయితే ఆ పరిస్థితి నిజమైన స్నేహాల మీద కూడా పడటం బాధాకరం. ఓ వ్యక్తి తనకు ఉన్న ఖాళీ సమయంలో కెరీర్, కుటుంబం, నిద్రాహారాలకు ఎలాగూ 90 శాతాన్ని వెచ్చించేస్తాడు. ఇక మిగిలిన కొద్ది సమయాన్నీ ‘సామాజిక జీవితానికి’ కాకుండా ‘సామాజిక మాధ్యమాలకు’ కేటాయిస్తున్నాడు.
ఓ లెక్క ప్రకారం సగటు భారతీయుడు మూడు గంటలకు పైగానే సోషల్ మీడియాలో ఖర్చు చేస్తున్నాడు. మన ఉరుకుల పరుగుల జీవితంలో ఈ సమయం ఎంత అమూల్యమో చెప్పనక్కర్లేదు. అక్కడ రీల్స్ చూసీ, లైకులు లెక్కపెట్టుకునీ, కామెంట్ల కోసం కష్టపడీ ఒత్తిడికి గురవుతున్నాడు. దీనికి డిజిటల్ స్ట్రెస్ అని కూడా పేరు పెట్టేశారు. పోనీ అక్కడన్నా తన ఆప్తమిత్రులతో కలిసి ఉంటున్నాడంటే అదీ లేదు. మనుషుల మధ్య ఉన్న సవాలక్ష వివక్షకు ఇప్పుడు ‘డిజిటల్ డివైడ్’ కూడా తోడయ్యింది. ఇప్పటికీ పల్లె ప్రాంతాల్లో 25 శాతం ఇళ్ల్లలో మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మిగతా 75 శాతం మందికీ ఇంటర్నెట్ సౌకర్యం సంగతి అటుంచితే… ఆ సదుపాయం గురించి అవగాహనే లేని పరిస్థితి. వయసు, ఆర్థిక పరిస్థితి, ప్రాంతం అన్నవి ఇంటర్నెట్ చేరువ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అలా వారు తమ మిత్రులను ఆన్లైన్లో కలుసుకునే అవకాశాన్నీ కోల్పోతున్నారు.
మన దేశంలో వారానికి సగటు పని గంటలు 47 అని తేలింది. ఆదివారాన్ని పక్కన పెడితే ఇది రోజుకు ఎనిమిది గంటలు. కానీ వాస్తవ పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉందని మనకు తెలుసు. సాఫ్ట్వేర్ కంపెనీలు పేరుకు అయిదు రోజులే పనిచేస్తున్నా… రోజుకు 10-15 గంటల పని ఉంటున్నదని అందరికీ తెలిసిందే. పనిసంగతి దేవుడెరుగు. ఇక డ్రైవర్లుగా, డెలివరీ బాయ్స్‌గా, కాంట్రాక్ట్ జీతగాళ్లుగా పనిచేస్తున్న ‘గిగ్ వర్కర్స్’ పరిస్థితి మరీ దారుణం. రోజంతా పనిచేస్తే కానీ ఓ వెయ్యి రూపాయలు కళ్ల చూడలేని దైన్యం. అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఉద్యోగులకు స్వర్గధామంగా భావించే అమెరికాలోనూ వారానికి 40 పనిగంటల సగటు ఉందనీ, చాలా తక్కువ మంది సెలవులు పెడుతున్నారనీ, 65 ఏళ్లు దాటివారిలో కూడా 20 శాతం మంది పనిచేస్తున్నారనీ ఓ రీసెర్చ్ వాపోయింది.
పనిగంటలతో నీరసం ఒకవైపు. లక్ష్యాలు, ఉద్యోగంలో కోతలు, అధికారుల కూతలతో పని ఒత్తిడి మరోవైపు… వెరసి స్నేహానికి సమయం ఉండటం లేదని తేలింది. భారతీయ పరిశ్రమల సంఘం (CII) నిర్వహించిన ఓ సర్వేలో మన ఉద్యోగులలో 62 శాతం మంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని గమనించారు. మరొక సర్వేలో మన ఐటీ ఉద్యోగులలో ఏకంగా 82 శాతం మంది వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నట్టు బయటపడింది. ఇక స్నేహం సంగతి చెప్పేదేముంది!
కార్టిజోల్
ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ చిగురించేందుకు, కోపాన్ని వ్యక్తం చేసేందుకు, ఒత్తిడిని తట్టుకునేందుకు, ఆకలి తీర్చేందుకు హార్మోన్లే కీలకం అని తెలుసు. కానీ స్నేహం వెనుక కూడా హార్మోన్ల పాత్ర ఉండటం విచిత్రమే! ఆక్సిటోసిన్, డోపమైన్, కార్టిజోల్ హార్మోన్లది స్నేహంలో కీలక పాత్ర.
బంధాలను పెంచుకునేందుకు, వాటిని అనుబంధంగా మార్చుకునేందుకు ఉపయోగపడుతుంది. పరస్పర నమ్మకానికి, కష్టాలను పంచుకునే సానుభూతికి కూడా ఇదే కారణం. స్నేహితులను చూడగానే ఒత్తిడంతా మాయమైపోయి, మనసు తేలికగా తోచడానికి కారణం ఈ హార్మోనే!
డోపమైన్
ఏ అలవాటు అయినా పదేపదే చేయాలి అనిపించడానికి కారణం… అది మనలో పెంచే డోపమైన్ అనే హార్మోనే. వ్యాయామం నుంచి మద్యపానం వరకూ మంచైనా, చెడైనా అలవాట్ల వెనుక కారణం ఇదే. స్నేహితులతో తరచూ గడపాలి అనే ఆసక్తికి కూడా డోపమైనే కీలకం. ఆ సమయంలో అది అంతులేని తృప్తిని కలిగిస్తుంది. స్నేహితులతో కలిసి కాలాన్ని గడపమని ప్రోత్సహిస్తుంది.
ఆక్సిటోసిన్
చాలామంది కార్టిజోల్ను ఒత్తిడిని కలిగించే హార్మోన్గానే భావిస్తారు. దీని స్థాయి పెరిగితే ఎంత ఉద్రేకంగా తోస్తుందో, తగ్గితే అంతే విశ్రాంతిని అందిస్తుంది. మిత్రుల సమక్షంలో ఈ కార్టిజోల్ తక్కువగా ఉంటుంది కాబట్టే, వారిమధ్య సురక్షితంగా ఉన్నామనే భావనలో ఉంటాం.
ఒకప్పుడు ఇంటి పెద్దంటే… పొద్దునొకసారి, సాయంత్రం మీద ఒకసారి కనబడేవారు. ఇంట్లో ఉన్నా… తనతో మాట్లాడేంత చనువు ఉండేది కాదు. ఇంట్లో పిల్లలను తాతయ్యలో, నానమ్మలో గమనించుకునేవారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి… చిన్న కుటుంబాలు పెరిగాక, పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. భేషజాలు పక్కన పెట్టి, కుటుంబంతో కలిసిపోతున్నారు. ఓ సర్వేప్రకారం 78 శాతం మంది తమ కుటుంబంతోనే ఖాళీ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్నారంట.
మరో నివేదిక ప్రకారం భార్యాపిల్లలతో కలిసే ప్రయాణం చేయాలి అనుకునేవారి సంఖ్య 75 శాతానికి చేరింది. ఒక రకంగా చూస్తే ఇది మంచి పరిణామమే. కానీ ఈ సందడిలో, స్నేహితుల కోసం వెచ్చించే సమయం తగ్గిపోవడం స్పష్టమే! ఇంతే కాదు. ఒకప్పుడు సేవకు కూడా చాలా సమయాన్ని వెచ్చించేవారు. ఆ సమయంలో సామాజికంగా ఇతరులతో కలిసే అవకాశం, మిత్రులతో పనిచేసే సందర్భం ఏర్పడేది. కానీ ఇప్పుడు స్వచ్ఛంద సేవకు కూడా ఎవరూ కదలడం లేదని తేలింది. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సేవ కోసం వెచ్చించే సమయం ఏకంగా 15 శాతం తగ్గిపోయింది. వాస్తవం ఇంతకంటే దారుణంగా ఉందన్నది మన అనుభవం.
రబ్బర్ తోటల్లో పనిచేయడానికో, కూలీలుగా సేవ చేయడానికో విదేశాలకు వెళ్లే పరిస్థితులు ఇప్పుడు లేవు. అక్కడి అవకాశాలను అందిపుచ్చుకుంటూ, అక్కడే స్థిరపడే రోజులివి. ఓ అంచనా ప్రకారం ఏకంగా మూడున్నర కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఒక్క అమెరికాలోనే అరకోటి భారతీయులున్నారు. ఇంగ్లండ్, కెనడా, అరేబియా, ఆస్ట్రేలియా… ఇలా ఎక్కడ చూసినా మనవాళ్ల సంఖ్య లక్షలమీదే ఉంది. పరాయి దేశంలో అడుగుపెట్టినవారికి అక్కడి సంస్కృతి, జీవనశైలి అలవాటు పడటానికి చాలా సమయం పడుతుంది.
వేరే దేశాలవారితో స్నేహం చేస్తే చాలా లాభాలుంటాయని చెబుతారు. ఇతరుల గురించి అవగాహన పెరుగుతుందనీ, అపోహలు తగ్గుతాయనీ, సహనం అలవడుతుందనీ, జీవితం వైవిధ్యంగా ఉంటుందనీ చాలా కారణాలే పేర్కొంటారు. కానీ ఇలాంటి ఎన్ని మాటలు చెప్పుకొన్నా ఎంత ఆధునిక దేశమైనా వివక్షను ఎదుర్కోక తప్పదు. ఇలాంటి పరిస్థితులలో కొత్త స్నేహాలకు చోటెక్కడిది? ఒకటి, తరాలు దాటిన తర్వాత ఆ పరిస్థితులు మారవచ్చు. అక్కడే పుట్టిపెరిగినవారు, స్థానికులతో కలిసిపోవచ్చు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రాణస్నేహితుల అండ కొరవడుతుంది.
స్నేహానికి అడ్డుగోడలు వచ్చేశాయని అర్థమైపోతున్నది. మరి వాటిని దాటడం ఎలా. ముందుగా సమస్య ఉందని గుర్తిస్తే సరి… మార్గాలు అవే కనిపిస్తాయి.
పలకరించి చూడండి: స్నేహితుల దినోత్సవం వెనుక వాణిజ్యపరమైన లక్ష్యాలే ఉండవచ్చు. కానీ ఇలాంటి రోజుల్లో అయినా ఓసారి మన కాంటాక్ట్ లిస్ట్ తీసి, పాత స్నేహితులందరినీ ఓసారి పలకరించే ప్రయత్నం చేద్దాం.
నేరుగా సంభాషించండి: స్నేహితుడిని పలకరిస్తూ ఓ సందేశాన్ని పంపడం కన్నా… ఫోన్ చేసి మాట్లాడటం వల్ల మనసు మరింత దగ్గరవుతుంది. ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడినా రాని చనువు, ఓ పూట నేరుగా కలిసి మాట్లాడితే ఏర్పడుతుంది.
మిగిలిపోయే జ్ఞాపకాలు: కాలేజ్ స్నేహాలు మనకు ఎక్కువ రోజులు ఎందుకు గుర్తుండిపోతాయి. కలిసి సినిమాలకు వెళ్తాం, రోజూ క్యాంటీన్లలో కలుసుకుంటాం, ఆఖరికి కలిసే కాలేజ్ ఎగ్గొడతాం. వీటిని షేర్డ్ ఎక్స్పీరియన్సెస్ లేదా షేర్డ్ యాక్టివిటీస్ అంటారు. ఇలా చేయడం వల్ల అనుబంధం బలపడటమే కాదు, దాని తాలూకు జ్ఞాపకాలు జీవితకాలం పాటు పదిలంగా ఉండిపోతాయి.
మార్పు సహజం: కెరీర్, పెళ్లి, పిల్లల తర్వాత మనుషులు మునుపటిలా ఉండకపోవచ్చు. వారి ప్రాధాన్యాలు, అభిరుచులు, దృక్పథాలు మారిపోతాయి. ఆ మార్పును ఉదారంగా స్వీకరిస్తేనే స్నేహం మారకుండా ఉంటుంది.
అమెరికా, ఇండియాలలో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారంలో చేసుకుంటారు. కానీ అన్ని దేశాల్లో ఇదే పాటిస్తారు అనుకోవడానికి లేదు. వాటిలో కొన్నింటి వెనుక ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి.
ఫిన్లాండ్, మెక్సికో, ఈక్వెడార్, వెనెజుల లాంటి కొన్ని దేశాల్లో ప్రేమికుల దినోత్సవం రోజునే ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారు.
పరాగ్వేలో జూలై 20ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకొంటూ ఆ రోజు చిట్టీల ఆట ఆడతారు. తమ బెస్ట్ ఫ్రెండ్ పేరు దానిమీద రాసి… పదిరోజుల తర్వాత ఆ వ్యక్తికి మంచి బహుమతి ఇస్తారు.
పెరూ దేశంలో Pilsen Callao అనే బీర్ బ్రాండ్ ఉంది. నిజమైన స్నేహపు రుచి అంటూ అది ఓ ఘనమైన ప్రచారం మొదలుపెట్టింది. అదే క్రమంగా జూలై తొలి శనివారం, అక్కడి స్నేహితుల దినోత్సవంగా మారింది.
అర్జెంటీనాకు చెందిన ఎర్నెస్టో ఫెబ్రారో… మనిషి చంద్రుడి మీద అడుగుపెట్టిన సందర్భాన్ని చూసి తెగ సంబరపడిపోయాడు. మనుషులు కలిసికట్టుగా ఉంటే ఇలాంటి అసంభవం ఏదైనా సాధించవచ్చు అనుకున్నాడు. అందుకే అపోలో 11 చంద్రుడి మీదకు దిగిన ఆ జూలై 20ని స్నేహితుల దినోత్సవంగా మొదలుపెట్టాడు. అక్కడ చాలా ఘనంగా జరిగే ఈ దినోత్సవం రోజున పార్టీలతో హోటళ్లన్నీ కిటకిటలాడతాయి. అభినందనలతో నెట్‌వర్క్‌లన్నీ బిజీ అయిపోతాయి. బ్రెజిల్, స్పెయిన్ దేశాలు కూడా ఈ రోజునే అనుసరిస్తున్నాయి.
విచిత్రం ఏమిటంటే ఐక్యరాజ్య సమితి కూడా ఓ స్నేహితుల దినోత్సవాన్ని ప్రకటించింది. స్నేహంతోనే శాంతి సాధ్యమని పేర్కొంటూ 2011 నుంచి జూలై 30న అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.
డిస్నీ హగ్:
డిస్నీలాండ్లో ఓ అలిఖిత నిబంధన ఉంది. డిస్నీ పాత్రల వేషాల్లో ఉండేవారిని పిల్లలు సరదాగా కావలించుకుంటారు. పిల్లవాడు వదిలేదాకా, తనను విదిలించుకోకూడదని చెబుతారు. స్నేహితుల విషయంలో కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి అంటారు. మనం వద్దనుకుని మిత్రుడు మనల్ని వదిలేదాకా, మనం మిత్రుడిని వదలకూడదు.
ఊహల్లో మిత్రుడు
చిన్నప్పుడు పిల్లలు ఏదో ఒక వస్తువునో, పాత్రనో, జంతువునో, బొమ్మనో స్నేహితుడిగా ఊహించుకుంటాడు. తనతో సంభాషిస్తాడు కూడా. విచిత్రంగా తోచే ఈ స్వభావం మానసిక సమస్య కాదనీ, తన ఎదుగుదలకు కీలకం అనీ చెబుతారు. ఒకోసారి పెద్దవాళ్లు కూడా ఒంటరితనంతో ఇలాంటి ఊహాజనిత మిత్రులతో మాట్లాడుతూ ఉంటారు.
బెన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్
ఈ సిద్ధాంతం ప్రకారం ఎవరికన్నా మనం సాయం చేస్తే అతనికి మనపట్ల స్నేహం కలగడంతో పాటు… మనకు కూడా అతనితో అనుబంధం పెరుగుతుందట.
ద ప్రాట్ ఫాల్ ఎఫెక్ట్
చాలామంది అహానికి పోయి తాము చేసిన తప్పులను ఒప్పుకోరు, క్షమాపణలు కోరుకోరు. కానీ ఈ సిద్ధాంతం ప్రకారం తన తప్పును ఒప్పుకొన్నవారి పట్లే ఎక్కువ అభిమానం ఉంటుందట. తప్పు మానవ సహజం కాబట్టి, చేసినదాన్ని ఒప్పుకోవడం అంటే తను సామాన్యుడినే అని చెప్పుకోవడం. తను తప్పు చేసిన విషయం కనిపిస్తున్నా, దాన్ని ఒప్పుకోకపోవడం అంటే తాను అహంకారినని చాటి చెప్పడమే!
రిపల్షన్ హైపోథిసిస్:
ఒకేరకమైన వ్యక్తిత్వం ఉన్నవారితో మనం స్నేహం చేసేందుకు ఇష్టపడతాం. మనకంటే పూర్తి భిన్నమైన స్వభావం, అలవాట్లు ఉన్నవారితో అంతగా ఇమడలేం. ఇదే వికర్షణ సిద్ధాంతం!
ఏ శాస్త్రవేత్తా ప్రతిపాదించకుండా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందిన థియరీ ఇది. మన జీవితంలో ఏడు రకాల స్నేహితులు
తప్పనిసరిగా ఉండాలని చెబుతుంది.
1 చిన్నప్పటి నుంచి మనకు తోడుండేవారు.
2 ఎలాంటి సందర్భంలో అయినా మనల్ని నవ్వించేవారు.
3 ఎన్ని రోజుల పాటు పలకరించకపోయినా… చెక్కుచెదరని స్నేహంతో ఉండేవారు.
4 ఏదైనా తమతో పంచుకునేంత చనువు ఉన్నవారు.
5 నా అన్న లేదా చెల్లి అనిపించే స్నేహితులు.
6 తను నా స్నేహితుడుగా ఉండలేని జీవితాన్ని ఊహించలేం.
7 నీ వ్యక్తిగత సమస్యలు తెలిసినా కూడా… నీ అంతట నువ్వు చెప్పేంతవరకూ అడగనివారు!
చివరిగా స్నేహం ఓ పోరు కాదు, ఎవరో ఒకరిది పైచేయి కావడానికి… ఇద్దరి గౌరవం సమానంగా ఉండాలి.
స్నేహం ఓ వాదన కాదు, మన మాటే వినిపించడానికి… ఇద్దరి మాటా వినిపించాలి. స్నేహం ఓ బానిసత్వం కాదు, ఎవరో ఒకరే ముందుకు రావడానికి… ఇద్దరూ చెరో అడుగు వేయాలి. అందుకు ఇదే సరైనా సందర్భం!
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
– కె.సహస్ర