సమయం చాలా విలువైనది. ఒకసారి చేజారితే ఇక తిరిగి రాదు. ఈ మాటలు ముమ్మాటికీ నిజమైనప్పటికీ, మీ సమయాన్ని ముందు రోజుల కోసం కొద్దికొద్దిగా దాచుకునే అవకాశం ఒకటి ఉంది. దాన్ని తిరిగి వాడుకునే వెసులుబాటూ ఉంది. అదెలా సాధ్యం అంటారా… మీరు యవ్వనంలో ఉండగా వృద్ధులతో గడిపిన సమయాన్ని మీకు అవసరం ఉన్నప్పుడు తిరిగివ్వడమే ‘టైం బ్యాంక్’ సిద్ధాంతం. జపాన్ నుంచి తీసుకున్న ఈ విధానం ఇప్పుడు కేరళలో అమలుకానుంది.
వయసు పెద్దదవుతున్న కొద్దీ కుటుంబం చిన్నదవుతుంది. అప్పటి దాకా దగ్గర ఉండే పిల్లలు రెక్కలొచ్చి దూరంగా ఎగిరిపోతారు. మాటవరసకో మనస్ఫూర్తిగానో తమ దగ్గరికి రమ్మన్న పిలుపు వినిపించినా, ఉన్న ఊరిని వదిలి వెళ్లడానికి ప్రాణం ఒప్పదు. అందుకే మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒంటరి వృద్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. అయితే వాళ్ల బాగోగులు చూసుకునేందుకు ఒక మంచి మార్గం ఎంచాలనుకుంది కేరళ రాష్ట్రం. ప్రపంచంలోనే అత్యధిక వయోవృద్ధుల సంఖ్య కలిగిన జపాన్ దేశంలో వీళ్ల బాగోగులు చూసుకోవడం కోసం తీసుకొచ్చిన టైం బ్యాంకు కాన్సెప్టును ఇందుకోసం ఎంచుకున్నారు. కేరళ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్
దీన్ని అక్కడి కొట్టాయం జిల్లా ఎలికులం గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశ పెడుతున్నది.
ఆ పంచాయతీ పరిధిలో 7,000 మందికి పైగా వృద్ధులు ఉండటంతో ముందస్తుగా టైం బ్యాంకు సేవల్ని అక్కడికే తీసుకొస్తున్నారు. ఈ సేవల్ని వినియోగించుకునేందుకు వివిధ సంస్థల ద్వారా వృద్ధుల వివరాలు, అవసరాలను నమోదు చేస్తున్నది ప్రభుత్వం. అలాగే వాళ్లకు సేవలందించ దలచుకున్న వాళ్లనీ పేర్ల నమోదుకు ఆహ్వానించింది. కేవలం యువకులనే కాదు, ఏదైనా సాయం చేయగలిగిన పెద్దలూ ఇందులో భాగస్వాములు అవ్వచ్చు.
ఇంతకీ వీళ్లు ఏం చేయాలంటే, పెద్ద వాళ్లను మార్కెట్‌కు తీసుకెళ్లడం, వాళ్లతో కలిసి వెళ్లి బ్యాంకు పనులు ఉంటే చేసి పెట్టడంలాంటివి చేయొచ్చు. ఆసుపత్రులకు తోడు, ఇంటి పనిలో సాయంలాంటివీ ఇందులో భాగమే. ఇవేవీ కాదు, వాళ్లతో కాసేపు కూర్చుని ముచ్చట్లు చెప్పినా సరే!
పెద్దవాళ్లు ఓ పోర్టల్ ద్వారా తమ అవసరాలను తెలియజేస్తారు. అప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న వలంటీర్లు ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయొచ్చు. లేదా చేయకపోనూ వచ్చు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాళ్లు టైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తాము ఎంత సేపు వాళ్ల కోసం పనిచేసింది నమోదు చేస్తారు. అంటే ఆ గంట లేదా రెండు గంటల సమయం ఆ వలంటీర్ ఖాతాలో జమ అవుతుంది. తమ దగ్గరి వాళ్ల కోసం కానీ, తామే పెద్దయ్యాక అవసరం ఉన్నప్పుడు కానీ వీళ్లు ఈ వలంటీర్ సేవల్ని తిరిగి పొందొచ్చు. ఇక్కడ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు అస్సలు ఉండవు. సమాజం పెద్దల పట్ల బాధ్యత చూపుతూ, ముందు తరాలకూ సామాజిక భద్రతను అందించే ఈ టైం బ్యాంక్ నిజంగా మంచి ఆలోచన కదూ!