రాతిరివేళ అంబరం మరింత అందంగా కనిపిస్తుంది. పున్నమి చంద్రుడు, మిళమిళ మెరిసే నక్షత్రాలతో ఆహ్లాదాన్ని పంచుతుంది. అలాంటి వినీలాకాశాన్ని కెమెరాలో బంధించడమే.. ఆస్ట్రో ఫొటోగ్రఫీ! ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు, పాలపుంత లాంటి ఖగోళ అద్భుతాలను ఫొటోలుగా మలిచే కళ ఇది. డీఎస్ఎల్ఆర్ కెమెరా సహాయంతో రాత్రిపూట ఆకాశంలోని అందాలను కలకాలం నిలిపి ఉంచొచ్చు.
1. డీఎస్ఎల్ఆర్ కెమెరా
2. వైడ్ యాంగిల్ లెన్స్ (14mm 24mm, f/2.8 లేదా ఎక్కువ)పాలపుంత, నక్షత్ర సమూహాలు పూర్తిగా ఫోకస్ చేసేందుకు.
3. ట్రైపాడ్ లాంగ్ ఎక్స్పోజర్ సమయంలో కెమెరాను స్థిరంగా ఉంచడానికి.
4. రిమోట్ షట్టర్ రిలీజ్ షట్టర్ నొక్కే సమయంలో కెమెరా షేక్ అవ్వకుండా ఉండటానికి.
5. టార్చ్ / రెడ్‌లైట్ లాంప్ చీకట్లో సులభంగా పని చేసుకోడానికి
ఆకాశం+ఫోర్‌గ్రౌండ్ : ఆకాశంతోపాటు భూమిపై ఉన్న చెట్లు, కొండలు, భవనాలూ ఫ్రేమ్‌లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఫొటోకి మరింత డెప్త్ వస్తుంది.
రూల్ ఆఫ్ థర్డ్స్ : పాలపుంత లేదా చంద్రుణ్ని.. ఫ్రేమ్‌లో భాగంలో ఉంచండి.
లీడింగ్ లైన్స్: రోడ్లు, ఎత్తయిన భవనాలు చంద్రుడివైపుగా సాగుతున్నట్లు ఫ్రేమ్ చేసుకోవచ్చు.
పౌర్ణమి రాత్రి: పౌర్ణమి రోజున నిండు చంద్రుడి ఫొటోలు అద్భుతంగా వస్తాయి. పున్నమి చంద్రుడితో కలిపి పాలపుంతనూ కెమెరాల్లో బంధించొచ్చు.
నగరాలకు దూరంగా: నగరాల్లో కాంతి కాలుష్యం (light pollution) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి,
నక్షత్రాలు, పాలపుంత అంత స్పష్టంగా కనిపించవు. ఆస్ట్రో ఫొటోగ్రఫీకి కాలుష్యంలేని పర్వత ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి.
స్టార్ ట్రేయిల్స్ : ఈ రకమైన ఫొటోగ్రఫీలో నక్షత్రాలు గీతల మాదిరిగా వస్తాయి. ఇందుకోసం ఎక్స్పోజర్ను 30 sec వరకూ ఉంచి.. వరుసగా తీయాలి. కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఆ ఫొటోలన్నిటినీ స్టాక్ చేయాలి.
మిల్కీవే పనోరమా: వైడ్ యాంగిల్లో పాలపుంతను చిన్నచిన్న భాగాలుగా ఫొటోలు తీసుకోవాలి. ఆ తర్వాత ఫొటోషాప్, ఇతర సాఫ్ట్వేర్లలో పనోరమా మెర్జ్ చేయాలి.
టైమ్‌లాప్స్: నక్షత్రాలు, పాలపుంతను వరుసగా వందకు పైగా ఫొటోలుగా తీసుకోవాలి. వీటన్నిటినీ వీడియో రూపంలో టైమ్టాప్స్గా చూపించవచ్చు.
చివరిగా.. ఆస్ట్రో ఫొటోగ్రఫీతో చంద్రుడి చమత్కారాలు, నక్షత్రాల నృత్యాలతోపాటు పాలపుంత వైభవాన్ని ఫొటోలుగా మలచవచ్చు. కచ్చితమైన ప్లానింగ్, కాస్త ఓపికతోపాటు సరైన సెట్టింగ్స్ కూడా ఉంటే.. ఆకాశ అద్భుతాలను ఇంట్లోని ఫ్రేమ్‌లో బంధించవచ్చు. నిత్యం సాధన చేస్తూ.. ప్రతిసారీ సెట్టింగ్స్‌ను మార్చుకుంటూ, మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూ ఉంటే.. మీ కెమెరా అర్ధరాత్రి ఆకాశాన్ని ఒక కొత్త కవిత్వంలా చూపిస్తుంది.
– ఆడెపు హరికృష్ణ