ఇప్పుడు డబ్బు స్మార్ట్ అయిపోతున్నది! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన డిజిటల్ రూపీ గురించి విన్నారా? ఇది మనదేశంలో డబ్బు వాడకాన్ని పూర్తిగా మార్చేయబోతున్నది. ఇప్పటికే UPI పేమెంట్స్‌లో దూసుకుపోతున్న భారత్.. డిజిటల్ రూపీతో మరో ముందడుగు వేయనున్నది. అది కూడా ఆర్బీఐ గ్యారెంటీతో! మీ డబ్బు.. మీ ఫోన్లోనే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలన్నీ ఇంట్లో కూర్చుని చేసేయొచ్చు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం కదా! అంటారా!! సాధారణ యూపీఐ, ఆన్లైన్ పేమెంట్స్‌తో పోలిస్తే డిజిటల్ రూపీ అంతకుమించి. అదెలాగంటారా.. అయితే చదివేయండి..
డిజిటల్ రూపీ అంటే ఆర్బీఐ తయారుచేసిన ఒక డిజిటల్ డబ్బు. ఇది కరెన్సీ లాంటిదే! దీని విలువ కూడా మన కరెన్సీతో సమానమే!అంటే 1 డిజిటల్ రూపీ 1 రూపాయికి సమానం. కాకపోతే మన ఫోన్లో ఉంటుంది. ఈ డబ్బును ఆర్బీఐ నేరుగా ఇస్తుంది. బిట్ కాయిన్‌లాంటి ప్రైవేట్ కరెన్సీలతో పోలిస్తే ఇది చాలా సురక్షితం. ఈ డిజిటల్ రూపీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రిటైల్ డిజిటల్ రూపీ. దీన్ని మనలాంటి సామాన్యులు, చిన్న వ్యాపారులు వాడుకోవడానికి ఉపయోగించ వచ్చు. రెండోది హోల్‌సేల్ డిజిటల్ రూపీ. ఈ కరెన్సీని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య భారీస్థాయి లావాదేవీల కోసం వాడొచ్చు.
ఎందుకు అవసరం?
ఇప్పుడు ఫోన్‌తో హాయిగా డిజిటల్ పేమెంట్లు చేసేస్తున్నాం కదా.. ఇప్పుడు ఈ డిజిటల్ రూపీ ముచ్చటేంటి? దీనివల్ల ఏం ప్రయోజనం? అనే సందేహం రావడం సాధారణం. ఈ కరెన్సీ పుట్టుకే డిజిటల్. దీంతో లావాదేవీలు చాలా వేగంగా జరుగుతాయి. నగదు లేకుండా, బ్యాంకుల మీద ఆధారపడకుండా సులువుగా డబ్బు పంపొచ్చు, తీసుకోవచ్చు. మరో ముఖ్యమైన అంశం కరెన్సీ ముద్రణ, స్టోర్ చేయడం, ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడం.. ఇలా బోలెడంత ఖర్చు అవుతుంది. డిజిటల్ రూపీతో ఈ ఖర్చులు చాలావరకు తగ్గుతాయి.
మారుమూల ప్రాంతాలకు కూడా..
మనదేశంలో బ్యాంకులు, ఏటీఎంలు లేని గ్రామాలు ఉన్నాయేమో కానీ, స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులో లేని గ్రామాలు లేవేమో! బ్యాంకులు లేని చోట స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఈ డిజిటల్ రూపీని వాడుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా.. ఆఫ్లైన్లోనూ దీన్ని ఉపయోగించొచ్చు. దీనవల్ల ఆర్థిక వ్యవస్థలోకి ఎక్కువమంది చేరుతారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అందరూ భాగస్వాములు అవుతారు. అంతేకాదు, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత ఉంటుంది. ఈ డిజిటల్ రూపీతో జరిగే ప్రతి లావాదేవీ ట్రాక్ అవుతుంది. అంటే, డబ్బు ఎక్కడికి వెళ్లింది.. ఎవరు వాడారు.. అనేది ఇట్టే తెలుసుకోవచ్చు. దీనివల్ల మనీ లాండరింగ్, ట్యాక్స్ ఎగవేత, చట్టవిరుద్ధ కార్యకలాపాలు తగ్గుతాయి.
ప్రత్యామ్నాయాలకు చెక్
రోజురోజుకూ ఆన్లైన్ వ్యవహారాలు.. డార్క్‌నెట్ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. దీంతో పలురకాల ప్రత్యామ్నాయ డిజిటల్ కరెన్సీలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ పుట్టుకొచ్చింది. బిట్ కాయిన్ లాంటి ప్రైవేట్ కరెన్సీపై నెటిజన్లకు ఆసక్తి పెరుగుతున్నది. కానీ, వాటిపై ఎలాంటి అధికారిక మానిటరింగ్ లేదు. దీంతో బిట్ కాయిన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గ్యారెంటీ ఉన్న ఈ డిజిటల్ రూపీ సురక్షితమైన ఆప్షన్‌గా ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. మరోవైపు ఈ డిజిటల్ రూపీతో డిజిటల్ ఎకానమీకి బూస్ట్ వస్తుంది. మనదేశం ‘క్యాష్‌లెస్, ఫేస్‌లెస్, పేపర్‌లెస్’ ఎకానమీగా ఎదగడానికి డిజిటల్ రూపీ ఒక మంచి మార్గం అవుతుంది.
వాలెట్స్‌తో పోల్చితే..
యూపీఐ, ఫోన్ పే, గూగుల్ పే లాంటి వాలెట్స్‌తో.. ఈ డిజిటల్ రూపీని పోల్చితే చాలా తేడాలు కనిపిస్తాయి. యూపీఐ, వాలెట్స్ని ప్రైవేట బ్యాంకులు, కంపెనీలు ఇస్తాయి. కానీ, డిజిటల్ రూపీని నేరుగా ఆర్బీఐ ఇస్తుంది. యూపీఐ పేమెంట్స్ అన్నీ బ్యాంకుల నుంచే జరుగుతాయి. అందుకే ఆయా బ్యాంకు సర్వర్లలో ఇబ్బందులు ఉంటే కొన్నిసార్లు చెల్లింపులు ఫెయిల్ అవుతుంటాయి. కానీ డిజిటల్ రూపీ అలా కాదు. డబ్బు నేరుగా ఒకరినుంచి మరొకరికి వెళ్తుంది. అంటే.. పీర్ టు పీర్ లాగా అన్నమాట. ఆఫ్లైన్లోనూ పేమెంట్ చేసే వెసులుబాటు ఉండటం అదనపు ప్రయోజనం. దీనిపై ఆర్బీఐ మరిన్ని ప్రయోగాలు చేస్తున్నది.
ప్రయోగాత్మక పరిశీలన
డిజిటల్ రూపీని 2022-23 మధ్య కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అందుకోసం పలు పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు కలిసి పనిచేస్తున్నాయి. ఈ డిజిటల్ రూపీతో క్యూఆర్ కోడ్లు వాడుకుని ఒకరి నుంచి ఒకరికి (P2P).. లేదా షాపుల్లో (P2M) పేమెంట్స్ చేయొచ్చు. ఉదాహరణకు, మీరు మీ స్నేహితుడికి డబ్బు పంపాలనుకుంటే.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులువుగా పంపొచ్చు. ప్రజల నుంచి స్వీకరించే సలహాలు, టెక్నాలజీ అప్డేట్స్ ఆధారంగా డిజిటల్ రూపీని మరింత మెరుగుపరిచే ప్రయత్నాల్లో ఉంది ఆర్బీఐ. మన డిజిటల్ రూపీ ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఇది మనదేశంలో ఆర్థిక లావాదేవీల స్వరూపాన్ని పూర్తిగా మార్చేయనుంది అనడంలో సందేహం లేదు.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్