ఉద్యోగుల్లో ఉత్సాహం కరువైపోతున్నది. పనిపట్ల ప్రేరణ, నిబద్ధతతోపాటు సృజనాత్మకత కూడా తగ్గిపోతున్నది. వెరసి.. ఉత్పాదకత, లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. చిన్న పరిశ్రమలు మొదలుకొని.. కార్పొరేట్ సంస్థల వరకూ ఇదే ధోరణి కనిపిస్తున్నది. ఈ క్రమంలో ఉద్యోగులకు సరైన ప్రోత్సాహకాలు, ప్రయోజనాలే కాకుండా.. వారి అభివృద్ధికి యాజమాన్యాలు ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉన్నది.
భారతీయ ఉద్యోగుల్లో బర్న్ అవుట్ పెరుగుతున్నది. పని ఒత్తిడి, టార్గెట్లు, యాజమాన్యం అంచనాలు, కరువైపోతున్న ప్రోత్సాహకాలు, వారాంతాల్లోనూ పని చేయించడం.. వారిలో తీవ్రమైన అసంతృప్తిని రాజేస్తున్నది. వారిని క్రమంగా రాజీనామావైపు అడుగులు వేయిస్తున్నది. ఉద్యోగుల్లో పనిపై ఆసక్తిని చంపేస్తున్న అతిపెద్ద కారకం.. స్తబ్ధత. ఒక ఉద్యోగి పాత్ర కొన్నేళ్లుగా మారకపోతే; జీతం పెద్దగా పెరగకపోతే; చేసిన పనే మళ్లీమళ్లీ చేస్తున్నట్లుగా అనిపిస్తుంటే.. ఆ ఉద్యోగి మెదడు సహజంగానే ఆటోపైలట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఇక అనేక భారతీయ సంస్థలు.. ప్రమోషన్ల విషయంలోనూ వివక్ష చూపుతున్నాయి. సీనియారిటీ ఉన్నా, కష్టపడి పనిచేస్తున్నా.. ఉద్యోగ హోదా మాత్రం పెరగడం లేదు.
తదుపరి స్థాయిపైనా స్పష్టత ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగిలో ప్రేరణ కరువైపోతుంది. ఇక జానాబెత్తెడు జీతంతో నగరాలు, పట్టణాల్లో కుటుంబాన్ని నెట్టుకురావడమే అతిపెద్ద సవాల్. అలాంటిది సంతోషంగా సమయాన్ని గడిపేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పోతున్నది. పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత, జీతం వంటి సమస్యలు.. చాలామంది ఉద్యోగులను తమ అభిరుచులకు దూరంగా నెట్టేస్తున్నాయి. ఒక దశ తర్వాత.. ఉత్తమ ప్రోత్సాహకాలు అందించినా.. వారిని ఉత్తేజపరచలేని స్థితికి చేరుకుంటున్నారు. అయితే, ప్రతిచోట ఉద్యోగం సరదాగానే సాగాలన్న రూలేమీ లేదు. కానీ, ఉద్యోగం అర్థరహితంగా అనిపిస్తే, నైపుణ్యాలకు సరిపోకపోతే.. సహజంగానే ఆ ఉద్యోగిలోని సృజనాత్మకత అట్టడుగు స్థాయికి చేరిపోతుంది. అది అతని పనితీరుతోపాటు ఉత్పాదకతపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇతరులు ‘టార్గెట్’ చేయడం కూడా.. ఉద్యోగులను ఊపిరి ఆడకుండా చేస్తున్నది. సహోద్యోగులు సహకరించక పోవడం, పెద్దల నుంచి అస్పష్టమైన సూచనలు, అవాస్తవిక గడువులు, అగౌరవం.. అన్నీ కలిసి పని వాతావరణాన్ని విషపూరితంగా మార్చేస్తున్నాయి. మనదేశంలోని అనేక కార్యాలయాలు ఇప్పటికీ నైపుణ్యాలకన్నా.. సీనియారిటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక్కడ జూనియర్లకు ప్రశంసలు లభించవు. వారి అభిప్రాయాలకు విలువ ఉండదు. దాంతో తొలిదశలోనే జూనియర్లు మానసికంగా కుంగిపోతున్నారు.
ఇక యాజమాన్యం నుంచి మద్దతు లోపించడం, ప్రమోషన్ అవకాశాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం కూడా.. వారిని నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ఇక ప్రైవేటు ఉద్యోగుల్లో చాలామంది ఉద్యోగ అభద్రతకు గురవుతున్నారట. తొలగింపుల భయాలు.. ఉద్యోగుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. అనేక సంస్థల్లో చేసిన పనికి తగిన గుర్తింపు లభించకపోవడం, ఎదుగుదల అవకాశాలు లేకపోవడం కూడా వారిని ఉద్యోగాలు వదులుకునేలా చేస్తున్నాయి. కెరీర్ వృద్ధికి పరిమిత అవకాశాలు ఉన్నచోట్ల.. వేరేదారి చూసుకుంటున్నారట. ఇవన్నీ కలిసి.. ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పనిలో ఉత్సాహం లేకపోవడంతో.. వారి పనితీరు మందగిస్తున్నది.
పరిష్కారాలు