భారతీయుల్లో ‘బ్రెయిన్ ఫాగ్’ సమస్య క్రమంగా పెరుగుతున్నదట. అంటే.. ఏ విషయం మీదా దృష్టిని కేంద్రీకరించక పోవడం, గుర్తుంచుకోగలిగే, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతున్నదట. ఒకప్పుడు అరుదుగా ఉన్న ఈ సమస్య.. ప్రస్తుతం చాలా ఎక్కువగా కనిపిస్తున్నదని పరిశోధకులు చెబుతున్నారు. జీవనశైలి లోపాలు, ఒత్తిడి, కొవిడ్ ప్రభావాలతోపాటు హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా ఈ బ్రెయిన్ ఫాగ్కి కారణం అవుతున్నాయని అంటున్నారు. నిద్రలేమి, ఒత్తిడి మొదలుకుని పోషకాల లోపాల వరకూ.. బ్రెయిన్ ఫాగ్కు ఆజ్యం పోస్తున్నాయి. నిద్రలేమి మెదడుపై భారాన్ని పెంచుతుంది.
ప్రతి వ్యక్తికి కనీసం 8-9 గంటల నాణ్యమైన రాత్రినిద్ర ఎంతో ముఖ్యం. అంతేకాకుండా తగినంత విశ్రాంతి కూడా అవసరం. లేకుంటే.. ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇది వారి ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో 25-30 శాతం మంది ఏకాగ్రత లేకపోవడం, మానసిక అలసట వంటి దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. వీరినీ బ్రెయిన్ ఫాగ్ వేధించే అవకాశం ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తీసుకోవడం కూడా బ్రెయిన్ ఫాగ్కు కారణం అవుతున్నది. అయితే.. ఈ సమస్యను గుర్తించడానికి ఎలాంటి వైద్య పరీక్ష లేదు. మానసిక ఆరోగ్యం, ఆహారంతోపాటు ఇతర లక్షణాల ఆధారంగా ‘బ్రెయిన్ ఫాగ్’ను అంచనా వేస్తారు.