పతంజలి యోగసూత్రాల్లో ఉన్న ఆసనాలు ‘పెద్దలకు మాత్రమే’ అని ముద్ర పడిపోయింది. కానీ, మొక్కగా ఉన్నప్పుడే ఎరువు దిట్టంగా పడితే.. అది బలంగా పెరుగుతుంది. చిన్న వయసులోనే యోగ సాధన అలవాటు చేస్తే… పిల్లలకు ఆరోగ్య యోగం పడుతుంది. ప్రత్యేకమైన ఆసనాలు వేయడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. కాబట్టి, పిల్లల జీవనశైలిలో యోగాను భాగం చేయండి. బడులు తెరిచే సమయం ఆసన్నమవుతుంది. అంతకుముందే.. మీ పిల్లల యోగాభ్యాసానికి అంకురార్పణ చేయండి.
సాధారణంగానే పిల్లలు చురుగ్గా ఉంటారు. వారికి ప్రత్యేకంగా యోగా, వ్యాయామం లాంటివి అవసరంలేదని చాలామంది భావిస్తుంటారు. అయితే, ఇదంతా నిన్నటి మాట. నేటితరం పిల్లలంతా చదువులు మొదలుకొని ఆటపాటలన్నిటికీ ఆన్‌లైన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. మైదానంలో ఆటలకు దూరమవుతున్నారు. ఫలితంగా.. అధిక బరువు, ఊబకాయం లాంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇక ఆన్లైన్ గేమ్స్‌తో ఏకాగ్రత కోల్పోతున్నారు. మరికొందరు పిల్లలు అతిచురుకుగా తయారవుతున్నారు. శక్తికి మించిన పనులు చేస్తూ.. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీన్నే వైద్య పరిభాషలో ‘ఏడీహెచ్ఏ ప్రవర్తన’ అని పిలుస్తున్నారు.
బుద్ధిగా చదువుకునే పిల్లలైనా.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పుస్తకాల్లోనే తలలు దూర్చేస్తున్నారు. దాంతో, వెన్నెముక, మెడ నొప్పులతో బాధపడుతున్నారు. ఇక చదువుల ఒత్తిడి.. కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు.. రోగ నిరోధక శక్తి తగ్గడం.. ఎత్తు తక్కువగా ఉండటం.. ఇలా ఎన్నెన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటన్నిటికీ ‘యోగా’ చక్కని పరిష్కారం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పిల్లలకు యోగాను అలవాటు చేస్తే.. వారి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. పిల్లల కోసం..తాడాసనం: పిల్లల్లో నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫలితంగా.. వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక స్థిరత్వం మెరుగుపడుతుంది. పిల్లలు ఎత్తు పెరిగేందుకూ సాయపడుతుంది.
మార్జర్యాసనం: ఎక్కువసేపు కూర్చొని చదివే పిల్లలకు.. ఈ ఆసనం ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. వెన్నెముకను బలోపేతం చేయడంతోపాటు నడుము, మెడ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మెడ, భుజాలు, వెన్ను కండరాలు ఆరోగ్యంగా తయారవుతాయి. నాడులు ఉత్తేజితం అవుతాయి. మలబద్ధకం సమస్య తగ్గుముఖం పడుతుంది.
సేతుబంధ సర్వాంగాసనం: ఇది వెన్నెముక ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదర కండరాలను పటిష్ఠంగా మారుస్తుంది. నడుముచుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించి.. ఊబకాయాన్ని తరిమేస్తుంది.
భుజంగాసనం: ఈ ఆసనంలో శరీరాన్ని ఎత్తడం వల్ల వీపు కండరాలు, ఉదరం బలపడతాయి. వీపు, మెడకు సంబంధించిన అన్ని రకాల నొప్పులనూ ఇది నివారిస్తుంది.
వృక్షాసనం: తొడ కండరాలను బలోపేతం చేస్తుంది. పిల్లలను శారీరకంగా దృఢంగా మారుస్తుంది. పిల్లలు ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది.
ధనురాసనం: వీపును విల్లులా వంచి చేసే ఈ ఆసనంతో.. పిల్లల ఛాతీ, వీపు సాగుతాయి. వెన్నుపూస కండరాలు బలోపేతం అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి.. శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడి.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అధోముఖ శ్వానాసనం: పిల్లల్లో బద్ధకాన్ని తరిమేయడంలో.. ఈ ఆసనం ముందుంటుంది. అధోముఖ శ్వానాసనంతో తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో, మెదడు చురుగ్గా తయారవుతుంది. కాళ్లు, చేతులు, భుజాల కండరాలను బలంగా చేసి.. నడుము నొప్పిని తగ్గిస్తుంది.
పద్మాసనం: ఈ యోగాసనంతో కండరాల ఉద్రిక్తత తగ్గుతుంది. పిల్లల మెదడును ప్రశాంతంగా మారుస్తుంది. ఫలితంగా ఏడీహెచ్ఏ సమస్య దూరమవుతుంది.
ఈ ఆసనాలన్నీ సులభంగా చేయగలిగేవే! పిల్లలకు సురక్షితమైనవి కూడా! అయితే.. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు ఆయా ఆసనాలు సాధన చేయడం మంచిది. కొన్నాళ్లపాటు నిపుణుల దగ్గర శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.