బాల్య వివాహంలోని బాధలు ఆ ఊబిలో చిక్కుకున్నవారికే అర్థమవుతాయి. అందుకే మన్భర్ అలాంటి కష్టం పగవారికికూడా రావొద్దని భావించింది. బాల్య వివాహాలను నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. రాజస్థాన్లోని మారుమూల పల్లెలో పుట్టిన మన్భర్కు ఏడేండ్ల వయసులో పెండ్లి చేశారు. పదకొండేండ్లు రాగానే అత్తింటికి పంపారు. పద్నాలుగేండ్లు వచ్చేసరికి బిడ్డకు తల్లి అయ్యింది. అంతలోనే భర్త మరణించాడు. దీంతో తన బతుకు తాను బతకాల్సి వచ్చింది. ఎవరైనా బాల్య వివాహాల గురించి మాట్లాడితే.. మన్భర్కు గతం గుర్తుకొస్తుంది. నెత్తురు ఉడికిపోతుంది.
ఓసారి, అయిదుగురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. అత్యాచారానికి ప్రయత్నించారు. ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది. రక్షణ కోసం జైపూర్లో మహిళా హక్కుల కోసం పనిచేసే మమతా జైట్లీని కలిసింది. ఆమె నేతృత్వంలోని ‘విశాఖ’ సంస్థలో ఉద్యోగం ఇవ్వమని ప్రాధేయపడింది. పనికంటే ముందు ఎంతోకొంత చదువుకోమని మమతాజీ సూచించడంతో.. మన్భర్, ఆమె కూతురు ఒకే తరగతి గదిలో కూర్చుని పాఠాలు విన్నారు. అలా ఎనిమిదో తరగతి వరకు చదివింది. కూతురితో కలిసే కరాటే నేర్చుకుంది. ఆ తర్వాత, మహిళలకు ఆత్మరక్షణలో ఉచిత శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. గత ముప్పై అయిదు సంవత్సరాల్లో పదివేల మందికి పాఠాలు చెప్పింది. అరవై ఏడేండ్ల్ల వయసులో కూడా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నది మన్భర్.