Coconut Water | అభిషేకంలో వాడితే పుణ్యం అయ్యగారి చేతి నుంచి పడితే తీర్థం కొట్టువాడు తెగ్గొట్టిస్తే… దాహార్తి తీర్చే ధన్యజలం మండువేసవిలోనే కాదు.. నిండు వానకాలంలోనూ కొబ్బరినీళ్లు అబ్బురపరిచేవే! వియ్యాలవారి ఈ వెల్కమ్ డ్రింక్ ఇప్పుడు గోలీసోడాతో నెయ్యమందుకుంటున్నది. నోట్లో కమ్మగా కరిగే లేత కొబ్బరి నేడు ఐస్‌క్రీంతో దోస్తీ చేస్తున్నది. అవును, కోకోనట్ కొత్త రుచులు నయా ఫుడ్ ట్రెండ్! ఆ సంగతులేంటో మనమూ చూద్దాం!
ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీళ్ల వరుసలో కొబ్బరినీళ్లు ముందుంటాయి. వీధివీధిలో కొబ్బరి బోండాల షాపు ఉన్నా తరతరాలుగా మనకు బోండాం తాగి లేత కొబ్బరి చప్పరించడమే అలవాటు. కొబ్బరినీళ్లలో విటమిన్లు, ఖనిజ లవణాలెన్నో ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ప్రకృతి రాసిన ప్రిస్క్రిప్షన్ అనే చెప్పొచ్చు. అటు రుచి ఇటు ఆరోగ్యం ఉండే వీటిని అందుకే మనం ఇష్టంగా తీసుకుంటాం. అయితే ఆహారం విషయంలో కొత్తకొత్త ప్రయోగాలు చేయడం నేటి తరం నైజం. అందుకే టెండర్ కోకోనట్ జ్యూస్ అంటూ లేతకొబ్బరినీ, కొబ్బరినీళ్లనూ కలిపి మిక్సీ పట్టి జ్యూస్‌గా చేస్తున్నారు. అంతేకాదు, అసలు ఇవి కూడా ఉంటాయా అన్న రీతిలో కొబ్బరి బోండాంతో కొత్త రుచులు ఆవిష్కరిస్తున్నారు. అచ్చంగా వాటిని అమ్మడం కోసమే ప్రత్యేకంగా సంస్థలు స్థాపించి, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
ఏమేం ఉంటాయి..
కేవలం కొబ్బరినీళ్లు, లేతకొబ్బరి కలిపిన జ్యూస్‌లే కాదు… జామ, సపోట, పైనాపిల్, నారింజలాంటి పండ్లను కొబ్బరినీళ్లతో జోడించి కూడా రసాలు తయారు చేస్తున్నారు. అలాగే కొబ్బరిపాలను, రకరకాల పండ్లనూ కలిపి గుజ్జుగా చేసి కోకోనట్ స్మూతీలు చేస్తున్నారు. కోకోసోడా, కోకోకాఫీ, కోకోషేక్, స్లష్, పుడ్డింగ్… ఇలా బోలెడు రకాలు ఇందులో ఉంటున్నాయి.
ఇవి కాక కొబ్బరిపాలతో జామ, సీతాఫలం, చాక్లెట్, ఓరియో… ఇలా విభిన్న రకాల ఐస్‌క్రీమ్‌లూ నోరూరిస్తున్నాయి. వీటి తయారీ ఎలాగన్నదీ యూట్యూబ్‌లో వీడియోలు దొరుకుతున్నాయి. ఓసారి వీటిని రుచి చూసి, మరోసారి చేసి చూస్తే సరి. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు… మనకూ కొత్త కొబ్బరి రుచులెన్నో దొరికేస్తాయి. ప్రయత్నించండి మరి!