ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో ‘పాలకూర’ది ప్రత్యేక స్థానం. ఆకుకూరల్లోనే.. ఇదో దివ్యౌషధం! శరీరానికి కావాల్సిన అన్నిరకాల విటమిన్లు, ఖనిజాలకూ ఇది నిలయం. అలాంటి పాలకూరను తినడం వల్ల కలిగే ‘పది’ అద్భుతమైన ప్రయోజనాలు ఇవి.
ఐరన్ : రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంలో ఐరన్ కీలకపాత్ర పోషిస్తుంది. 100 గ్రాముల పాలకూర తీసుకుంటే 2.7 మిల్లీ గ్రాముల ఐరన్ మన శరీరానికి లభిస్తుంది.
కాల్షియం: మహిళల్లో కాల్షియం లోపిస్తే.. ఎముకలు బలహీనంగా మారుతాయి. ఇక గర్భస్థ శిశువులో ఎముకలు, దంతాల ఎదుగుదలకు కాల్షియం అత్యవసరం. 100 గ్రాముల పాలకూర ద్వారా 99 మైక్రో గ్రాముల కాల్షియం దొరుకుతుంది.
ఫైబర్: జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఫైబర్‌కు సాటి ఏదీ లేదు. మలబద్దకం సమస్యను తగ్గించడంలోనూ ముందుంటుంది. పాలకూరలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. 100 గ్రాముల పాలకూర తినడం ద్వారా 2.2 గ్రాముల ఫైబర్ మన శరీరానికి అందుతుంది.
పొటాషియం: శరీరంలో వివిధ జీవక్రియల నిర్వహణలో పొటాషియం పాత్ర ఎంతో కీలకం. రక్తపోటును అదుపులో ఉంచి, గుండె జబ్బులను నిరోధిస్తుంది. ముఖ్యంగా.. పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఇది అత్యవసర పోషకం. 100 గ్రాముల పాలకూరను తీసుకోవడం ద్వారా 558 మిల్లీ గ్రాముల పొటాషియం పొందవచ్చు.
ఫోలెట్: పిల్లల కోసం ప్రయతిస్తున్నవారికీ, గర్భిణులకూ ఫోలెట్ ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. గర్భస్థ పిండం ఎదుగుదలకు, అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఫోలెట్ కూడా ఒకటి. శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధిలోనూ ఇది కీలకంగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో 165 మైక్రో గ్రాముల ఫోలెట్ లభిస్తుంది.
విటమిన్ ఎ: కంటి చూపును మెరుగుపరచడం, చర్మాన్ని మెరిపించడంలో విటమిన్ ఎ కీలకం. జుట్టు పెరుగుదలకూ సాయపడుతుంది. కాబట్టి, అందాన్ని కాపాడుకోవాలంటే.. పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే! 100 గ్రాముల పాలకూరలో 141 మైక్రో గ్రాముల విటమిన్ ఎ అందుతుంది.
విటమిన్ సి: గొప్ప యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్ సి.. గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. అయితే, పాలకూరను ఎక్కువసేపు మరిగిస్తే.. అందులోని విటమిన్ సి ఆవిరైపోతుంది. అందుకే, సలాడ్ రూపంలో తీసుకోవడం మంచిది. 100 గ్రాముల పాలకూర ద్వారా 28.1 మిల్లీ గ్రాముల విటమిన్ సి అందుతుంది.
విటమిన్ కె : వెన్నునొప్పి, జుట్టు రాలడం అతివలను ఎక్కువగా వేధించే సమస్యలు. వీటిని నివారించడంలో విటమిన్ కె.. ప్రధాన పాత్ర పోషిస్తుంది. 100 గ్రాముల పాలకూర ద్వారా 482.9 మైక్రో గ్రాముల విటమిన్ కె శరీరంలోకి చేరుతుంది.
సోడియం: కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరు బాగుండాలంటే.. శరీరంలో కావాల్సినంత సోడియం ఉండాలి. శరీరంలో సోడియం తక్కువగా ఉంటే.. తీవ్రమైన తలనొప్పి, కండరాల బలహీనత వేధిస్తాయి. 100 గ్రాముల పాలకూరలో 79 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది.
మెగ్నీషియం: హార్మోన్ల నియంత్రణ మొదలుకొని ఎముకల ఆరోగ్యం వరకు అన్నిటినీ మెగ్నీషియం క్రమబద్ధీకరిస్తుంది. 100 గ్రాముల పాలకూర తీసుకోవడం ద్వారా 79 మైక్రో గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.