డాక్టర్ సి.నారాయణ రెడ్డి ‘నిలువెత్తు తెలుగు సంతకం’ మాత్రమే కాదు… ప్రయోగానికి పర్యాయపదం, సంప్రదాయానికి ‘నిక్కమైన’ నీలం. అది పాటైనా, మాటైనా, తన బాటైనా ఆయన ముద్ర ఆయనదే! ఏడున్నర దశాబ్దాలు ఇటు కవిత్వం లోనూ… అంతే స్థాయిలో గీతాల్లోనూ నిరంతరం ప్రయోగాలు చేస్తూనే వచ్చారు. ‘మా కందాలు’, ‘ప్రపంచ పదులు’ లాంటివి అందుకు చక్కని ఉదాహరణ. ‘తెలుగు గజళ్ళు’ ఆయన విరాన్మూర్తిత్వపు తఖల్లుస్. గేయ కావ్యాలు మొదలు విశ్వంభర వరకు, అటు తరువాత సినిమాల్లోనూ ఆయన చేసిన విశేష, విలక్షణ ప్రయోగాలు పాఠకులకు, శ్రోతలకు తెలుసు.
సినారె ప్రయోగాలపై, సాహిత్యంపై వందల పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. డా॥ వడ్డేపల్లి సంధ్య
రాసినట్టు ‘… ఎప్పటికైనా శాస్త్రం కన్నా ప్రయోగమే గొప్పదన్న ఆయన భావన సినారె రచనల్లో కనిపిస్తుంది’. ఈ కోణంలోంచి డెబ్బయ్యో దశకంలో సినారె రాసిన ఒక గీతాన్ని చూద్దాం.
‘తూర్పు పడమర’ చిత్రం 1976లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంలో సినారె రాసిన గీతం ఇప్పటికీ శ్రోతలు, సంగీతప్రియుల గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది. అదే ‘శివరంజనీ నవరాగినీ’. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి…’ అన్నట్టు పండిత పామరులను, ఆబాల గోపాలాన్ని గత ఐదు దశాబ్దాలుగా అలరిస్తున్న ‘జీవ’గీతమిది. దీనికి సంగీతం రమేశ్ నాయుడు కూర్చగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా ఆలపించారు.
సినారె మాటలో అయినా, పాటలో అయినా లయాత్మకత అణువణువునా ఉట్టిపడుతుంది. ప్రయోగ వైవిధ్యంతో పాటు పదాల కూర్పు, నూతన పదబంధాలతో విరాజిల్లుతుంది. అది ఒక్క ఆయనకే చెల్లింది. ఈ ‘శివరంజని నవరాగిని’ అనే గీతం ‘శివరంజని’ రాగంలో సాగడమే కాదు, నేపథ్యం వేరైనా కవి తనకు తానుగా నాయికా విశేషంగా ఆ రాగాన్ని గురించే రాయడం గొప్ప ముచ్చట. ఒక రాగాన్ని గురించిన రాగగీతమన్నమాట ఇది. సినిమా కథా సందర్భానుసారంగా కథా నాయకుడు నాయికను గురించి పాడే పాట ఇది. కవిగా నారాయణరెడ్డి వీటన్నిటికి అతీతమైన భావనను జతకడతారు. భావకవిగా సినారె ప్రౌఢశైలికి ఈ గీతం అద్దం పడుతుంది. చూడండి! పైన పేర్కొన్నట్టు ‘శివరంజని’ రాగ ప్రశస్తితో ఈ గీతం మొదలవుతుంది.
పల్లవి
శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృత వాహినీ…
చరణం
రాగాల సిగలోన సిరిమల్లివీ..
సంగీత గగనాన జాబిల్లివీ..
స్వర సుర ఝరీ తరంగానివీ ॥2॥
సరస హృదయ వీణావాణివీ
చరణం:
ఆ కనులు.. పండు వెన్నెల గనులు
ఆ కురులు.. ఇంద్ర నీలాల వనులు
ఆ వదనం.. అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధు కలశం
చరణం:
జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహినీ జానకి..
వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి..
రాశీకృత నవరసమయ జీవనరాగ చంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
రావే… రావే నా శివరంజనీ, మనో రంజనీ
రంజనీ నా రంజనీ!
నీవే నీవే నాలో పలికే నాదానివి
నీవే నాదానివి..
నా దానివి నీవే నాదానివి
ఇందులో కవి శివరంజని రాగం గురించి చెబుతూ, ఆ నేపథ్యంలో నాయిక గురించి చెబుతున్నాడు. అంతే సుకుమారంగా, లలిత పల్లవంగా చెప్పాలి కదా! అందుకే ‘శివరంజని’ సినిమాలో రాసినట్టు లాగా “మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ శివరంజనీ…’ అంటూ ప్రౌఢసమాస ప్రయోగం చేయలేదు సినారె. ‘నవరాగిణీ’ అంటూ చల్లగా చెబుతారు, ‘అమృతవాహిని’ అంటూ తీయగా రాస్తారు. ఔచిత్యం తెలిసిన కవి కదా!
మొదటి చరణంలో అటు నాయిక పరంగా, ఇటు రాగ పరంగా రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి అంటూ వర్ణిస్తారు సినారె. ఇంకా సరసులైన శ్రోతల హృదయాలలో వీణానాదానివి అంటారు. ఇవి శివరంజనికి నాయకుడు ఇచ్చిన సంబోధనలు. ఇంకో చరణంలో నాయిక అందాన్ని, తనూలతికను వర్ణిస్తూ ‘ఆ కనులు పండు వెన్నెల గనులు’ అంటారు. ఇంకా ఆమె కురులను ఇంద్రనీలాల మణులుగా, మెరిసే నల్లని రత్నాలుగా వర్ణిస్తారు.
ఇక చివరి చరణంలో సినారె భావుకత అద్భుతంగా దర్శనమివ్వడమే కాదు, ఆయన అసమాన ఊహకు తార్కాణంగా నిలుస్తుంది కూడా. చరణం మొదటి భాగంలోని వాక్యాలు జనకుని కూతూరైన సీతకు, కృష్ణుడిని వరించిన రుక్మిణికి సంబంధించినవి. కాగా, మిగతా పాదాలు చక్కని సంబోధనా వాక్యాలు. అవి కూడా ఎంత గొప్పవంటే నవ రసాలన్నీ ఒక్కచోట కుప్పగా పోస్తే ఎలా ఎంటుందో అలా ఉంటుందట.
ఇటు నాయిక పరంగా… అటు శివరంజని రాగపరంగా అన్వయిస్తూ చెప్పుకొంటే రెండింటికీ ఇది వర్తిస్తుంది. ఇంకా కవి భావన పరంగా ‘శివరంజనిలో లలితమైన లావణ్యమైన భయాన్ని గొలిపే సౌందర్యాలను ఇముడ్చుకున్న చంద్రరేఖ’ అని కూడా అర్థం. ‘నువ్వు నాలో పలికే నాదానిని.. నా దానివి’ అనే నాయకుని తపనతో ఆ గీతం ముగుస్తుంది.
సినారె సినీ జీవన ప్రస్థానంలో పాల వెన్నెలలు… పండు వెన్నెలలు లాంటి ఇటువంటి వందలాది గీతాలను రాశారు. ప్రతి గీతాన్ని రాగరంజితంగా… రసాలకూజితంగా మలిచారు. ఇప్పటికీ ఆ వెన్నెల తెలుగు వెలుగు తెరమీద చక్కగా ప్రసరిస్తూనే ఉన్నది.
…? పత్తిపాక మోహన్