ఆది కైలాస యాత్ర అంటే.. మంచు పర్వతాలను చూసి రావడం కాదు! అదో ఆధ్యాత్మిక అనుభూతి. శాంతి, విశ్వాసంతోపాటు నాతో నేను జరిపిన ఒక సంభాషణ! మే 22న ‘ఫైండింగ్ శివ’ అనే ఆధ్యాత్మిక కమ్యూనిటీ ఆధ్వర్యంలో మా ఆది కైలాస యాత్ర మొదలైంది.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లి, అక్కడి నుంచి కాత్గోదాం వెళ్లే ‘సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్’ రైలు ఎక్కాం. మే 23న నీమ్కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శనతో.. మా అసలైన యాత్రకు అంకురార్పణ చేశాం. తదుపరి గమ్యస్థానం.. గోలు దేవి మందిరం. ఈమెను న్యాయ దేవతగా కొలుస్తారు. భక్తులు తమ కోరికలను కాగితాలపై రాసి ఆలయ ప్రాంగణంలో కడతారు. అవి నెరవేరిన తర్వాత.. మళ్లీ వచ్చి, కృతజ్ఞతగా ఒక గంటను ఇక్కడ వేలాడదీస్తారు. ఆ తర్వాత ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న పురాతన దేవాలయాల సమూహమైన జగేశ్వర్ ఆలయాన్ని సందర్శించాం. ఉత్తరాఖండ్‌లోని ఈ ఆలయం.. శివుడికి అంకితమైన 125కి పైగా పురాతన రాతి దేవాలయాల సమూహం.
ఇవి హిమాలయాలలో సంప్రదాయ ‘నాగర శైలి’ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణలు. మరునాడు ధార్చులా వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మధ్యాహ్నం 3 గంటలకు ధార్చులా చేరుకున్నాం. ఆ రాత్రి అక్కడే బస చేసి, మే 25 ఉదయం నాభి వైపు బయల్దేరాం. గంభీరమైన హిమాలయాల మధ్య ఉన్న ఒక అందమైన హోమ్‌స్టేలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాం. మే 26 ఉదయం 6:30 గంటలకు 14,000 అడుగుల ఎత్తులో ఉన్న ఓం పర్వత్‌ను సందర్శించడానికి బయల్దేరాం. దారిలో వ్యాస గుహ, కాళీ మందిరం, కాళీ నదిని సందర్శించాం. మధ్యాహ్న భోజనానికి తిరిగి వచ్చిన తర్వాత.. కాసేపు విశ్రాంతి తీసుకుని, మరుసటి రోజు ట్రెక్కింగ్ కోసం సిద్ధమయ్యాం. మా గైడ్ సౌరభ్ అందరి ఆక్సిజన్ స్థాయులనూ పరీక్షించారు. ఎక్కువ ఎత్తులో చేసే ట్రెక్కింగ్‌కు మా గ్రూప్ సభ్యులంతా ఫిట్‌గా ఉన్నారని నిర్ధారించుకోవడానికే ఈ పరీక్ష.
అడుగడుగునా ఆనందం..
మే 27న ఉదయం 7:00 గంటలకు అల్పాహారం ముగించుకుని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోలింకాంగ్కు బయల్దేరాం. అక్కడి నుంచి దాదాపు 15,000 అడుగుల ఎత్తులో సుమారు 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ప్రారంభించాం. మా అదృష్టం కొద్దీ ట్రెక్ అంతటా ఆకాశం చాలా స్పష్టంగా ఉంది. దాంతో మాకు ఆది కైలాస పర్వతం అద్భుతమైన దర్శనం లభించింది. పార్వతీ సరోవరం (పార్వతీ కుండ్ అని కూడా పిలుస్తారు) పవిత్రమైన ఆది కైలాస పర్వత ముఖద్వారం వద్ద ఉన్న ఒక ఎత్తయిన గ్లేసియర్ సరస్సు. శివుడి మనసును గెలుచుకోవడానికి పార్వతీ దేవి ఈ ప్రాంతంలోనే కఠోర తపస్సు చేసిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మా తర్వాతి గమ్యస్థానం భీమ్ కీ ఖేతీ (దాన్ కీ ఖేతీ అని కూడా అంటారు). పాండవుల అజ్ఞాతవాస సమయంలో భీముడు ఈ ప్రాంతంలో పంటలు పండించాడని చెబుతారు. మమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఎంతో కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా నేటికీ ఇక్కడ పంటలు పండుతూనే ఉన్నాయి.
ఆ తర్వాత మా ప్రయాణం.. దాదాపు 18,000 అడుగుల ఎత్తులో ఉన్న గౌరీ కుండ్ వైపు సాగింది. ఇక్కడ ఆక్సిజన్ స్థాయులు గణనీయంగా పడిపోసాగాయి. దాంతో ఈ ట్రెక్ మాకు మరింత సవాల్‌గా మారింది. మేము చాలా జాగ్రత్తగా, నిదానంగా అడుగులు వేయాల్సి వచ్చింది. మా గమ్యస్థానానికి చేరుకోగానే.. మంచుతో కప్పి ఉన్న ఆది కైలాస పర్వతం.. అద్భుతమైన దృశ్యంలా మాకు స్వాగతం పలికింది. ఆ మనోహరమైన దృశ్యం నా మనసులో చెరగని ముద్ర వేసింది. ప్రకృతి ప్రసాదించిన ఆ మహా వైభవం ముందు నిలబడటం.. ఒక మరువలేని, భావోద్వేగ అనుభూతిని అందించింది. ఆ పవిత్ర పర్వత సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించిన తర్వాత, తిరిగి కిందికి దిగడం మొదలుపెట్టాం. జోలింకాంగ్ బేస్ క్యాంప్ చేరుకున్నాం.
ఆ సాయంత్రమంతా మా ట్రెక్కింగ్ అనుభవాలను, ముఖ్యంగా పైవరకూ రాలేకపోయిన కొందరు కుటుంబ సభ్యులతో పంచుకున్నాం. రాత్రి భోజనం తర్వాత, క్యాంప్‌ఫైర్ ఏర్పాటు చేసుకున్నాం. శరీరం అలసిపోయినప్పటికీ.. మనసు నిండా తృప్తితో నిద్రకు ఉపక్రమించాం.
పాతాళ భువనేశ్వర్ సందర్శన..
తిరుగు ప్రయాణంలో.. మే 29న పాతాళ భువనేశ్వర్ సందర్శనకు మా ప్రయాణం మొదలైంది. ఇదో ప్రసిద్ధ సున్నపురాయి గుహాలయం. గుహ లోపలికి వెళ్లే మార్గం చాలా భయంకరంగా ఉంది. నిటారైన మెట్లు, ఇరుకైన దారులు చూసి మా గ్రూప్‌లోని కొందరు సభ్యులు వెనక్కి తగ్గిపోయారు. అయితే, ధైర్యం చేసి ముందుకు సాగిన వారికి, గుహ లోపల ఉన్న శివలింగం దైవిక దర్శనభాగ్యం లభించింది. ఈ యాత్ర శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ.. ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తినిచ్చింది. మే 30న కాత్గోదాం మీదుగా ఢిల్లీ అక్కణ్నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అయ్యాం. ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవాలు, దైవిక ఆశీస్సులు, అద్భుతమైన పర్వత దృశ్యాలు, మధురజ్ఞాపకాలను మూటగట్టుకుని ఇంటికి చేరుకున్నాం.
ఉషఃశ్రీ కందాళ
స్కూల్ సైకాలజిస్ట్, హైదరాబాద్