విహారయాత్రలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగితేనే మనసుకు హాయి.కానీ, అప్పుడప్పుడూ అనుకోని చిన్నచిన్నఅవాంతరాలు ఏర్పడుతుంటాయి. బ్యాగ్ మర్చిపోవడం; ఫోన్లో బ్యాటరీ అయిపోవడం;హోటల్లో పవర్ ప్లగ్‌తో ఇబ్బందులు.. ఇలాంటిసమస్యలెన్నో పలకరిస్తాయి. యాత్రలో లేనిపోని చికాకును కలిగిస్తాయి. ట్రావెలింగ్‌లో ఎంజాయ్‌కి బదులుగా.. టెన్షన్‌ను క్రియేట్ చేస్తాయి. అయితే, కొన్ని ఉపయోగకరమైన గ్యాడ్జెట్స్ వెంట ఉంటే.. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయట పడేస్తాయి. ప్రయాణాలు సాఫీగా సాగేలా చేస్తాయి.
హై కెపాసిటీ పవర్‌బ్యాంక్
తరచుగా ప్రయాణాలు చేసేవారు ఎదుర్కొనే ప్రధాన సమస్య.. పవర్ బ్యాకప్. ట్రావెలింగ్‌లో ఫోన్, వ్లాగింగ్ కెమెరా ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాలి. వీడియోలు తీస్తూ ఉండాలి. దాంతో, వాటి బ్యాటరీలను చార్జ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి సింపుల్ సొల్యూషన్.. ఓ హైకెపాసిటీ పవర్ బ్యాంక్‌ను వెంట తీసుకెళ్లడమే! అయితే.. తక్కువ బరువు, ఎక్కువ కెపాసిటీ ఉండే పవర్‌బ్యాంక్‌లను ఎంచుకోవాలి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులైతేనే మంచిది. ప్రయాణాల్లో ఇబ్బంది కాకుండా ఉంటుంది.
యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్
విదేశాల్లో విహరించేవారు ‘ప్లగ్’లతో ఇబ్బంది పడుతుంటారు. ఒకే ప్లగ్‌తో మల్టిపుల్ డివైస్‌లకు చార్జింగ్ పెట్టాల్సి రావడం కూడా ఇబ్బందే! ఈ సమస్య నుంచి బయట పడేందుకు ‘యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్’ను ఆశ్రయించండి. ఎలాంటి టెన్షన్ అవసరం లేకుండా.. ఒకేసారి ఫోన్, ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్ లాంటి డివైస్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఏ దేశానికి చెందిన ప్లగ్నైనా వాడుకునేలా ఈ అడాప్టర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలు.. ఈ రకమైన అడాప్టర్లను విరివిగా తయారుచేస్తున్నాయి. మంచి మన్నికైన వాటిని ఎంచుకోండి.
కాంపాక్ట్ వ్లాగింగ్ కెమెరా
ఇప్పుడొస్తున్న అన్ని రకాల స్మార్ట్ఫోన్లలో అద్భుతమైన కెమెరా సెటప్ ఉంటున్నది. కానీ, కాంపాక్ట్ వ్లాగింగ్ కెమెరా ఉంటే.. ఆ అనుభూతే వేరు. మంచిమంచి లొకేషన్లు, చారిత్రక కట్టడాలను సందర్శిస్తున్నప్పుడు.. వాటిని వీడియోల రూపంలో భద్రపర్చుకోవడం మర్చిపోవద్దు. ఫోన్లో తీద్దామంటే.. మెమొరీ ప్రాబ్లం. కెమెరాలు కూడా అంత క్వాలిటీ వీడియోలను అందించలేవు. అదే, ఓ కాంపాక్ట్ వ్లాగింగ్ కెమెరాను వెంట తీసుకెళ్తే.. 4కె వీడియోలు, స్టెబిలైజేషన్, ఫ్లిప్ స్క్రీన్ లాంటి ఫీచర్లతో ప్రయాణాలను అద్భుతంగా రికార్డు చేసుకోవచ్చు. మంచిమంచి కంటెంట్‌ను సృష్టించొచ్చు.
నాయిస్ క్యాన్సెలింగ్ ఇయర్ బడ్స్
అసలే దూర ప్రయాణాలు.. క్షేమ సమాచారం కోసమో, ఆఫీస్ పనిమీదో ఫోన్‌కాల్స్ మాట్లాడాల్సి వస్తుంది. అయితే, రద్దీ ప్రాంతాలు, రైలు, బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుంది. ఒకరు మాట్లాడేది మరొకరికి వినిపించదు. దాంతో.. చాలా చిరాకు కలుగుతుంది. అందుకే, నాయిస్ క్యాన్సెలింగ్ ఇయర్ బడ్స్‌ను వెంట తీసుకెళ్లండి. వీటితో ఫోన్‌కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అవతలి వారికి మీ వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ప్రయాణాల్లోనూ కూల్‌గా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు.
స్మార్ట్ లగేజ్ ట్రాకర్
ప్రయాణాలంటే రెండుమూడు బ్యాగులు సర్దేయాల్సిందే! పర్స్ నిండా మనీ నింపాల్సిందే! అయితే, విహార యాత్రల మధ్యలో బ్యాక్‌ప్యాక్, పర్స్ లాంటివి కనిపించలేదంటే.. గుండె ఆగినంత పనవుతుంది. అందుకే, వాటిపై నిఘా పెట్టాల్సిందే! అందుకోసం.. స్మార్ట్ లగేజ్ ట్రాకర్లను జతచేస్తే సరి. ఇక వాటిని ఎక్కడ మర్చిపోయినా.. ఇట్టే కనిపెట్టేయొచ్చు. అత్యాధునిక సాంకేతికతతో అనేక రకాల స్మార్ట్ లగేజ్ ట్రాకర్లు తయారవుతున్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. రెండుమూడు కొనుగోలు చేస్తే.. ప్రయాణాల్లో చాలా సౌకర్యంగా ఉంటాయి.