సూర్యుడు భగ్గుమన్నాడంటే మంచు మీద మనసవ్వడం మామూలే. దారెంట నడుస్తుంటే గోదారంతా తాగినా దాహం తీరదేమో అనిపిస్తుంటుంది. అందుకే నీళ్లయినా, జ్యూసైనా ఐస్ ముక్క పడందే హమ్మయ్య అనిపించదు. అలాగని ఏ రోడ్డు పక్కనో దాన్ని చప్పరించామంటే గొంతునొప్పికి ద్వారం తెరిచినట్టే. అదే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి ఆహ్వాన పత్రిక అందించడమే అవుతుంది. దాంతోపాటు, ఆనందాన్నీ పంచిపెట్టేలా ఇప్పుడు మంచుముక్కల్ని తయారుచేయొచ్చు. అదెలాగో మీరూ చూసేయండి!
వేసవిలో చల్లటి పానీయాలకు యమ డిమాండ్. వంటింటి నుంచి వచ్చే వేడివేడి పునుగుల కన్నా, ఫ్రిజ్ దగ్గరనుంచి వచ్చే చల్లచల్లటి రసాలే మిన్న అంటారు పిల్లాపెద్దా. ఇక, ఆ గ్లాసు చూడగానే వావ్… అంటూ కళ్లింతలు చేయాలంటే, అందులో ‘యానిమల్ షేప్డ్ ఐస్ క్యూబ్స్’ వేస్తే సరి! జ్యూసులు, షర్బత్‌లు, కోల్డ్ కాఫీ, కోల్డ్ టీలాంటి రకరకాల డ్రింక్స్‌లో వీటిని వేసిస్తే ఎవరైనా ముచ్చట పడిపోవాల్సిందే!
టెడ్డీబేర్, పిల్లి, కుక్క, కుందేలు, ఆవు… ఇలా రకరకాల ఆకృతుల్లో మనమే ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా బొమ్మలకు సంబంధించిన ఐస్ ట్రేలు మార్కెట్లో దొరుకుతాయి.
ఆ ట్రేలలో నీళ్లు కానీ లేదా రంగు రంగుల రసాలు కానీ పోసి ఫ్రిజ్‌లో పెట్టేస్తే చాలు. మనం చేసే డ్రింక్‌లో పైన దాన్ని వేసి అందించామంటే, తాగను అనే వాళ్లుండరంటే నమ్మండి!
సాయంకాలాల్లో చేసుకునే చిన్నచిన్న పార్టీల్లో ఐస్ క్యూబ్‌లు ప్రత్యేక ఆకర్షణ కావచ్చు. అదెలా అంటారా… ‘ఎల్ఈడీ ఐస్‌క్యూబ్’లు తెచ్చుకుంటే సరి! రంగు రంగుల్లో మెరిసే వీటిని ఫ్రీజర్‌లో చల్లబరిచి డ్రింకుల్లో వేసుకోవచ్చు.
దానికి ఉండే బటన్‌ను నొక్కడం ద్వారా విభిన్న వర్ణాల్లో అవి వెలుగుతూ ఉంటాయి. అవి ఎలా వెలగాలో కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. లోపల ఎల్ఈడీ లైట్లు, చిన్న బ్యాటరీ అమర్చిన ఈ ఐస్‌క్యూబ్‌లు వాటర్‌ప్రూఫ్‌గా ఆక్రిలిక్‌తో చేసి ఉంటాయి.
ఇంకేం, కాస్త చీకటి పడ్డాక ఈ ఐస్‌క్యూబ్‌లు వేసి డ్రింక్స్ సర్వ్ చేశారంటే, అది సరదా సాయంత్రమైపోదూ!
ఏదైనా జ్యూస్‌లో ఐస్‌క్యూబ్స్ వేస్తే అది కాస్త పల్చగా అవుతుంది. కొందరికి షర్బత్‌లు, పండ్లరసాల్లో అసలు ఐస్ వేయడమే ఇష్టం ఉండదు. అలాగని ఉత్తిగా తాగితే చల్లగా ఉండవు సరికదా అంత రుచిగానూ అనిపించవు. అలాంటి వాళ్లకోసం సూపర్ ఐడియా ఒకటి ఉంది.
అవే ‘రీ యూజబుల్ ఐస్ క్యూబ్స్’. ఈ రకం వాటిలో క్యూబ్స్ సిలికాతో చేసి రంగురంగుల్లో ఉంటాయి. లోపల జెల్‌లాంటి పదార్థం ఉంటుంది. వీటిని డీప్ ఫ్రీజర్‌లో కొద్దిసేపు ఉంచి తీసి, ఏ ద్రవాలైతే మనం చల్లగా తాగాలనుకుంటామో అందులో వేస్తే సరి… క్యూబ్‌లు కరగకుండానే చల్లటి రసం సిద్ధమైపోతుంది. రకరకాల పండ్లు, హృదయాకారాల్లాంటి వాటితోపాటు మెటల్‌తో చేసినవీ ఈ రకంలో దొరుకుతున్నాయి.