పంటి నొప్పి ఇబ్బంది పెడుతున్నదంటే.. దంతాల పట్ల మనం శ్రద్ధ తీసుకోవడంలేదని అర్థం. నెల జీతం సరిపోవడం లేదంటే.. సంపాదనను సమర్థంగా సమన్వయం చేసుకోలేక పోతున్నామని భావం. పిప్పిపన్ను ఉన్నకొద్దీ ఇబ్బందే. అధిక వడ్డీ రుణాలూ అంతే. త్వరగా వదిలించుకోవాలి. మనీ డాక్టర్‌గా అవతరించిన డెంటిస్ట్ మణి పవిత్ర.. ఎంతో మందికి ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ కథంతా ఆమె మాటల్లోనే..
సంపద సృష్టి ఎప్పుడూ హాట్ టాపికే. మనిషి తలుచుకుంటే సంపాదన పెద్ద సమస్యేం కాదని నమ్ముతాన్నేను. కానీ ఈ విషయంలో మహిళలు చాలా వెనకబడి ఉంటారు. ఇంటికి సంబంధించిన ప్రాథమిక ఆర్థిక విషయాలు కూడా వారికి తెలియవు. ఒకప్పుడు, ఇనప్పెట్టె తాళాలు ఇల్లాలి దగ్గరే ఉండేవి. ఇప్పడా పరిస్థితి లేదు. ‘మిలియన్ మామ్స్’ సంస్థను నడుపుతున్నప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. ఆడవాళ్లు… ముఖ్యంగా తల్లులు వెనకబడిపోవడానికి, తీవ్ర అసంతృప్తితో ఉండటానికి మూలకారణం ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడమే. అలాంటి వాళ్లకు ఆర్థిక పాఠాలు నేర్పాలనే ఉద్దేశంతో నేను ‘ఫార్చ్యూన్ అకాడమీ’ ప్రారంభించాను.
నేను వృత్తిరీత్యా డెంటిస్ట్‌ని. చదువు పూర్తిచేసి కెరీర్ మొదలు పెట్టే సమయానికే ఒక ఎన్జీవో ప్రారంభించాను. సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చిన్నప్పటి నుంచీ ఉండేది. దానికి కారణం మా తాతయ్య పొట్లూరి సత్యనారాయణ గారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధులు. సమాజం కోసం యావదాస్తినీ ధారపోశారు. ఆ స్ఫూర్తితోనే ‘అడ్వొకేట్స్ ఫర్ బేబీస్ ఇన్ క్రైసిస్ సొసైటీ’ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను. శిశువిహార్‌లోని పిల్లలకు వైద్య సదుపాయాలు కల్పించాను. ఆ పసిపిల్లలకు మాతృత్వ స్పర్శ అందించేందుకు, చాలా మంది అమ్మలను అక్కడికి తీసుకెళ్లేదాన్ని. అలా వచ్చిన వారిలో బాగా చదువుకున్నవాళ్లూ ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కెరీర్లో ముందుకు వెళ్లలేకపోయామనే అసంతృప్తి చాలామందిలో కనిపించింది. ఆరోగ్యం, ఫిట్నెస్ తోడైతే మనోస్థయిర్యం వస్తుందన్న ఉద్దేశంతో అలాంటి లక్షలాది తల్లులను భాగం చేస్తూ ‘మిలియన్ మామ్స్’ ప్రారంభించాను. డెంటిస్ట్‌గా నా ప్రాక్టీస్ నాకుంది. వ్యాపారాలూ చేస్తాను. వాటి మీద వచ్చిన డబ్బును ఒక సంస్థలో పెట్టి.. ఆ లాభాలతో ‘మిలియన్ మామ్స్’ నడిపేదాన్ని. కానీ, మేం పెట్టుబడి పెట్టిన సంస్థ మమ్మల్ని మోసం చేసింది. చాలా డబ్బు ఇరుక్కుపోయింది. అప్పుడే, మరింత లోతుగా ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలని భావించాను. శిక్షణ కోసం.. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ కోడలు మేరీ బఫెట్‌కు చెందిన అకాడమీలో చేరాను.
నాకున్న అవగాహన ద్వారా మహిళలకు సాయపడాలనే ఉద్దేశంతో ఫార్చ్యూన్ అకాడమీ ప్రారంభించాను. కానీ అక్కడికి మగవాళ్లే ఎక్కువగా వచ్చేవారు. దీంతో నా మాడల్‌ను ఇద్దరికీ సరిపోయేలా రూపొందించాను. మా తరగతుల్లో రోజువారీ ఆర్థిక ప్రణాళిక సూత్రాలు బోధిస్తాం. సమయం, శక్తి, డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నామన్నది సమీక్షిస్తాం. ప్రాణాయామం చేయిస్తాం. కనకధార స్తోత్రం పఠిస్తాం. ‘నిన్నటి కన్నా ఇవాళ నేను ఎంత మెరుగయ్యాను?’ అని ఎవరికి వారు బేరీజు వేసుకునేందుకు సాయపడతాం.
ఈ క్రమంలో మేం శాస్త్రీయంగా నిరూపితమైన ఒక పద్ధతిని కనుగొన్నాం. అదే ఫార్చ్యూన్ ట్యూనింగ్. సంగీత వాద్యంలో ఒక తీగను మీటితే మిగిలినవి కూడా ఝుమ్మంటూ శబ్దం చేస్తాయి. అలాగే ఒకే మంచి ఫలితం కోసం అందరూ కలిసి పనిచేయడం వల్ల ఒకరి గెలుపు నుంచి మరొకరూ విజయం పొందగలరు. ఇదే ఇక్కడి సూత్రం. దీన్నే మా తరగతుల ద్వారా అమలు చేస్తుంటాం. వారానికి మూడొందల నుంచి వెయ్యిమంది దాకా పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి ఈ పాఠాలు చెప్పాం. ఎవరికి వారు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా ‘రైట్ యువర్ డెస్టినీ‘ పేరిట ఒక వర్క్‌బుక్ తయారుచేశాను. పది లక్షల మందికి ఆర్థిక పాఠాలు చెప్పాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాను. ఎంతమంది ఆర్థిక పరిస్థితి మెరుగైతే సమాజమూ అంత పటిష్ఠంగా తయారవుతుందని నా నమ్మకం. ఇదో రకమైన ఆర్థిక చికిత్స. వైద్యంలో ఉన్నంత తృప్తి ఇందులోనూ లభిస్తున్నది.
విజయాన్ని సాధించిన వాళ్లలో ఒక నలభై ఏళ్ల మహిళ గురించి చెప్పుకోవాలి. ఆమె భర్త క్యాన్సర్‌తో చనిపోయారు. ఇద్దరు పిల్లలు. ‘ఏరోజూ నేను డబ్బు మేనేజ్ చేయలేదు. అసలు నోట్ల కట్టను చూస్తేనే భయం వేస్తుంది. ఏం చేయాలో చెబుతారా..’ అంటూ నా దగ్గరికి వచ్చారు.ఆ సమయానికి, ఆమె భర్త కొన్న షేర్లు సగానికి సగం ధరకు పడిపోయాయి. కానీ రెండేళ్లలో ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఈవెంట్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్, చీరల తయారీ సంస్థ స్థాపించారామె. ఈ మధ్యే రూ.13.5 కోట్ల రియల్ ఎస్టేట్ డీల్ విజయవంతంగా పూర్తి చేశారు. ఏం తెలీదు అన్న దగ్గర నుంచి ఆర్థిక విషయాల మీద పట్టు వచ్చేదాకా మేం తోడున్నాం. ఓ గైనకాలజిస్ట్… ఇంటినీ, డబ్బునూ ఎలా మేనేజ్ చేయాలంటూ వచ్చారు. హాస్పిటల్ అంటే ఎంత పని ఉంటుందో తెలిసిందే. ఇప్పుడామె, ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూనే.. నెలకు మూడు లక్షల రూపాయలు ఆదా చేస్తున్నారు. ఆసుపత్రి వదిలేసి ఒక సెలూన్, ఎడ్యుకేషన్ కంపెనీ నడుపుతున్నారు. మా దగ్గర స్టాక్‌మార్కెట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఇలాంటి ఆర్థిక విజయ గాథలు అనేకం. ప్రతి కథలో మహిళలే కథానాయికలు.
-లక్ష్మీహరిత ఇంద్రగంటి