ఆమె నడుం బిగిస్తే.. ఏదైనా సాధ్యమే!ఆమెకు ఆమె తోడైతే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. మిట్టపల్లి మహిళలూ అంతే! పరస్పర సహకారంతో తమ కలలు సాకారం చేసుకున్నారు. పసుపులు పట్టించి.. కారం దట్టించి.. దండిగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ వనితల విజయగాథ.. అందరికీ ఆదర్శం.
సాధారణంగా గ్రామ సమాఖ్య సభ్యులు నెలకోసారి భేటీ అవుతారు. తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లించి.. పిచ్చాపాటీ మాట్లాడుకొని ఇండ్లకు తిరుగుముఖం పడతారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో ఉండే మిట్టపల్లి గ్రామ సమాఖ్య మహిళలు ఇందుకు మినహాయింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ఆదరువును తమ బతుకుదెరువుగా మార్చుకున్నారు. గ్రామానికి చెందిన 11 మంది మహిళలు దుర్గాభవాని, శ్రీరామ అనే రెండు బృందాలుగా సంఘటితమయ్యారు. 2021 జనవరిలో శ్రీరామ దుర్గాభవాని పసుపు, కారం పొడి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. వ్యాపారంలో రాణిస్తూ పదిమందికీ ఉపాధి కల్పిస్తున్నారు.
ఐక్యతే వీరి బలం
వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే లక్ష్యంతో మొదట ఒక్కో సభ్యురాలు రూ.15వేల చొప్పున జమ చేసుకున్నారు. వారి ఐక్యతను చూసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అండగా నిలిచారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి రుణ సదుపాయాన్ని కల్పించారు. పావలా వడ్డీ కింద బ్యాంకు నుంచి సుమారు రూ.47 లక్షల రుణం మంజూరు కావడంతో.. వారి లక్ష్యానికి మార్గం ఏర్పడింది.
ఆ మొత్తంతో పసుపు, కారం పొడి తయారీకి కావాల్సిన యంత్రాలను, ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు మిట్టపల్లి మహిళలు. ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. నాణ్యమైన పసుపు, కారంపొడి తయారుచేసి స్వయంగా ప్యాకింగ్ చేసి మార్కెట్ ధరకు విక్రయిస్తున్నారు. ఆ నోటా ఈ నోటా ఈ కారం ఘాటు ప్రచారం కావడంతో… చాలామంది ఉత్పత్తి కేంద్రానికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సిద్దిపేట రైతుబజారులో సైతం ఒక స్టాల్ ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
రుణం సగం తీరింది
ఇంటాయన అప్పు చేస్తే ఇల్లాలికి మనసునపట్టదు. వీలైనంత త్వరగా అప్పు తీర్చమని పోరుపెడుతుంది. అలాంటిది ఇంతులంతా ఒక్కటిగా చేరినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వచ్చిన లాభాలను చూసి మురిసిపోకుండా.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌పై ఉన్న కొండంత అప్పును వీలైనంత త్వరగా తీర్చేయాలని నడుం బిగించారు. ఈ క్రమంలో రూ.47 లక్షల రుణానికి గానూ రూ.23 లక్షలు బ్యాంకుకు తిరిగి చెల్లించి అదుర్స్ అనిపించుకున్నారు. కారం పొడి, పసుపు విక్రయాల ద్వారా వచ్చిన లాభాల నుంచి ప్రతినెలా బ్యాంకుకు కిస్తీలు కడుతున్నారు.
ఇందులో పనిచేస్తున్న మహిళలు రోజుకు రూ.250 చొప్పున నెలకు ఒకసారి వేతనంలా తీసుకుంటారు. మిగిలిన డబ్బును బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు. ఈ మొత్తం నుంచి ముడిసరుకు కొనుగోలు చేస్తారు. బ్యాంకు రుణం తీరిపోయాకే లాభాలు పంచుకుంటామని చెబుతున్నారు మిట్టపల్లి అతివలు. ఈ సమాఖ్య స్ఫూర్తి చుట్టు పక్కల జిల్లాలకూ విస్తరించింది. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు మిట్టపల్లికి వచ్చి వీరి వ్యాపార దక్షతను ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటున్నారు. వ్యాపారం విషయంలో ఈ అతివల అంకితభావానికి సలాం చేస్తున్నారు. ఇక్కడ నేర్చిన పాఠాలను తమ గ్రామాల్లో అమలు చేయడానికి ఉద్యుక్తులు అవుతున్నారు.
వరంగల్ మిర్చి..నిజామాబాద్ పసుపు..
కారం పొడి తయారీకి వరంగల్ ఎనుమాముల మార్కెట్ నుంచి ఎండు మిర్చి కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో నాణ్యమైన మిర్చి దొరుకుతుందని తెలిస్తే.. అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. నిజామాబాద్ మార్కెట్ నుంచి పసుపు కొమ్ములు తెస్తున్నారు. ఒకేసారి 10-15 క్వింటాళ్ల వరకు మిర్చిని కొనుగోలు చేస్తారు. దానిని బాగా ఎండబెట్టి, కూలీలతో తొడిమెలు తీయించి.. కారం పొడి తయారీకి పూనుకుంటారు. కిలో కారం పొడి రూ.300, కిలో పసుపు రూ.260కి విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 20 కిలోల చొప్పున పసుపు, కారం పొడి అమ్ముతూ ఘనమైన లాభాలు గడిస్తున్నారు.
…? కత్తుల శ్రీనివాస్‌రెడ్డి