ముదిత.. నేర్వగరాని విద్య లేదు, సాధించలేని విజయమూ లేదు. ఇంటిని తీర్చిదిద్దిన చేతులతోనే గ్రామాన్నీఅభివృద్ధి చేయగలదు. పోపు డబ్బాలో పొదుపు చేసుకున్న చిల్లర పైసలతో బిడ్డలను ప్రయోజకులను చేసినట్టే, వృథాను అరికట్టి, చెత్తను ఒడిసిపట్టి బంగారంగానూ మార్చేయగలదు. ఆ అచ్చమైన నాయకత్వ లక్షణమే ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా (కే)సర్పంచ్ గాడ్గే మీనాక్షిని ‘స్వచ్ఛ్ఛ సుజల్ శక్తి సమ్మాన్’కు అర్హురాలిని చేసింది. ‘మా పల్లెను నా ఇల్లుగా భావించాను. ఇంటిని తీర్చిదిద్దినట్టే గ్రామాన్నీ తీర్చిదిద్దాను’ అంటారామె.
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి. సర్పంచ్‌ను చూసి గ్రామ ప్రగతిని అంచనా వేయాలి. ఇల్లాలు గుణవంతురాలైతే ఇల్లు స్వర్గం. సర్పంచ్ పనిమంతురాలైతే గ్రామం పరిశుభ్రం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామం ముత్యంలా మెరుస్తున్నదంటే.. కారణం సర్పంచ్ గాడ్గే మీనాక్షి చొరవే. ఆమె దృష్టిలో ఇల్లు పల్లెలో భాగం కాదు.. పల్లె మొత్తం ఆమె ఇల్లు కిందే లెక్క. చెత్తాచెదారం కనిపిస్తే.. చికాకు పడిపోతారు. వెంటనే శుభ్రం చేయిస్తారు. మురుగు వాసన ముక్కుపుటాల్ని తాకితే మహోగ్రరూపం ధరిస్తారు. సిబ్బందికి చివాట్లేస్తారు. ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉండాల్సిందే. చిందరవందరగా పడుంటే తానే సర్దేస్తారు. బుద్ధిమంతులైన విద్యార్థుల చేతిరాతను తలపించేలా పంచాయతీ రికార్డులు ఉండాలంటారు. ఇంట్లో బల్బు వృథాగా వెలుగుతున్నా, ఫ్యాన్ అనవసరంగా తిరుగుతున్నా అమ్మకు కోపం వచ్చేస్తుంది. సర్పంచమ్మనూ ధర్మాగ్రహం ఆవహిస్తుంది. పంచాయతీ పరిధిలో కరెంటు వృథా అయినా, నల్లా నీళ్లు వీధిపాలైనా అసలు తట్టుకోలేరు. కుటుంబానికైనా, పంచాయతీకైనా ఆర్థిక వనరులే ఆధారం. ఆ విషయంలో మీనాక్షికి ముందుచూపు ఎక్కువ. కాబట్టే, సేంద్రియ ఎరువుల తయారీతో గ్రామానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చవచ్చనే ఆలోచన స్ఫురించింది. సర్పంచ్, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇలా అన్ని వైపుల నుంచీ అందిన కృషి ఫలించింది. ముక్రా (కే) ఆదర్శ పంచాయతీగా పేరు తెచ్చుకుంది.
ముక్రా(కే) గ్రామాన్ని ప్రభుత్వం పంచాయతీగా ప్రకటించాక.. 2019 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో గ్రామస్తులు గాడ్గే మీనాక్షిని సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.. అదీ ఏకగ్రీవంగా. అప్పటి నుంచి గ్రామాభివృద్ధిలో ఆమె తనదైన పాత్ర పోషిస్తూనే ఉన్నారు. గ్రామంలో రెండొందల గడపలు ఉన్నాయి. వెయ్యికిపైగా జనాభా. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తారు మీనాక్షి. దాంతోపాటు తాగునీరు, రహదారులు, మురుగునీటి వ్యవస్థ.. తదితర ప్రాథమిక సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత ఏర్పాటు చేయించారు. నీటి వినియోగం ఉన్న దగ్గరంతా ఇంకుడు గుంతలు తవ్వించారు. ఆ వ్యక్తిగత కృషికి సర్కారు సహకారం తోడైంది. అందులోనూ ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం గ్రామ రూపురేఖలు మార్చేసింది. పచ్చదనం, పరిశుభ్రత మెరుగుపడ్డాయి. మొక్కల పెంపకానికి పెద్దపీట వేశారు. హరితవనం, పలె ్లప్రకృతి వనం.. పచ్చదనానికి పట్టం కట్టాయి. వైకుంఠధామం.. చివరి యాత్ర సజావుగా సాగేందుకు దోహదపడుతున్నది.
డంపింగ్‌యార్డు, సెగ్రిగేషన్ షెడ్.. చెత్త సమస్యను పరిష్కరించాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ ద్వారా రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి.. డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అందులోని తడిచెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. దీనివల్ల మూడేండ్లలో రూ.7 లక్షల ఆదాయం సమకూరింది. ఆ ప్రగతి ప్రయాణమే అనేక పురస్కారాలను సంపాదించిపెట్టింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సశక్తీకరణ్’, ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులిచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ ‘జీవవైవిధ్య పురస్కారం’ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో ప్రతిభ కనబరచిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్’ పురస్కారం అందిస్తుంది. ఈ ఏడాది గ్రామ పరిశుభ్రత విభాగంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షిని ఎంపిక చేశారు. మార్చి 4న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు అవార్డు అందజేస్తారు. ‘ఇది అందరి విజయం. ప్రతి పల్లెకూ ప్రగతి పాఠం’ అంటారు మీనాక్షి.
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ‘పల్లెప్రగతి’ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఊతమిస్తున్నది. ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. మా గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. సేంద్రియ ఎరువుల తయారీ వల్ల పంచాయతీకి ఆదాయం సమకూరుతున్నది.
-గాడ్గే మీనాక్షి, సర్పంచ్ ముక్రా(కే)
-భాకే రఘునాథ్‌రావు