Smart Work | ఇప్పుడంతా స్మార్ట్ యుగం. హార్డ్‌వర్కర్ అన్న పేరుకన్నా స్మార్ట్ వర్కర్ అన్న పదానికే ఇప్పుడు క్రేజ్ ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తిని ఇవ్వడం అన్నది ఇటు పనిచేసేవారికీ హాయిగొలిపే అంశమే. మీరూ స్మార్ట్ వర్కర్‌గా మారిపోవాలనుకుంటే ఇదిగోండి కొన్ని టిప్స్.
పనుల జాబితా: రోజును ప్రారంభించబోయే ముందే ఆ రోజు ఏం చేయాలి అన్నదాని మీద అవగాహన ఉండాలి. స్టాండప్ కాల్స్, రివ్యూ, క్లయింట్ మీటింగ్, ఇంటర్నల్ డిస్కషన్స్… ఇలాంటివన్నీ ఎప్పుడెప్పుడు ఉంటాయి అన్నది ఒకసారి అవలోకించుకుంటే, ఆ సమయానికి మిమ్మల్ని మీరు చక్కగా ప్రెజెంట్ చేసుకోగలుగుతారు. ఏ గ్యాప్ దగ్గర విశ్రాంతి తీసుకోవచ్చు. ఏ సమయంలో పనిచేసుకోవచ్చు అన్నదీ
తెలుస్తుంది.
ప్రాధాన్యతా క్రమంలో..: పనిచేసేప్పుడు కూడా ఏ పని ఎక్కువ ప్రయారిటీ అన్నది చూసుకోవాలి. అంటే 20 శాతం టాస్క్‌లు 80 శాతం పనిని పూర్తిచేస్తాయి. ముందుగా ప్రాధాన్యం ఉన్న అలాంటి వాటిని గుర్తించి, పూర్తి చేసుకుంటే మిగతావి చేయడం సులభం అవుతుంది.
నో చెప్పండి: చెప్పిన ప్రతి పనికీ తలూపడం కాకుండా, ముందుగా మీ దగ్గర ఉన్న పనులకు పట్టే సమయాన్నీ వాటి ప్రాధాన్యాన్ని అంచనా వేసుకోండి. అవీ ఇవీ చేయడం కష్టం అనిపిస్తే తప్పకుండా నో చెప్పండి. లేకపోతే లేనిపోని గందరగోళానికి గురై సకాలంలో ఏ పనీ
పూర్తిచేయలేరు.
ఇంటర్వెల్ ఉండాలి: సుదీర్ఘ సమయం పనిచేస్తూ ఉండటం అంటే హార్డ్ వర్క్ చేయడమే. కానీ, క్రమం తప్పకుండా బ్రేక్‌లు తీసుకుంటూ పనులు పూర్తి చేస్తే అది ఒత్తిడిగా అనిపించదు. అధ్యయనాలు చెబుతున్న విషయం ఏమిటంటే ఇలాంటప్పుడు పనులు త్వరగా పూర్తవుతాయట కూడా.
సత్వర స్పందన: ఏదైనా ఇష్యూ మీ దగ్గరకి వచ్చినప్పుడు, ఒక మెయిల్‌కు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు వెనువెంటనే దానికి రిైప్లె ఇవ్వండి. అవసరమైన వారి దృష్టికి ఆ సమస్యను తీసుకెళ్లండి. దీని తర్వాతే ఆ టాస్క్‌కు సంబంధించిన పని మొదలుపెట్టండి. వెంటనే స్పందిచడం అన్నది స్మార్ట్ వర్కర్ లక్షణాల్లో ప్రధానమైనది.