సుగంధ ద్రవ్యాలు.. ఆహార పదార్థాలకు అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఘాటైన వాసనలతో వంటలను పరిమళ భరితంగా మార్చేస్తాయి. అంతేకాదు.. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ఇవి ముందుంటాయి. అయితే, మాన్సూన్ సీజన్లో.. మసాలా దినుసులు త్వరగా పాడవుతాయి. వర్షాకాలపు తేమతో.. సుగంధాన్ని కోల్పోయి పనికిరాకుండా పోతాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
వర్షాకాలంలో గాలిలో తేమ పెరుగుతుంది. దాంతో మసాలా పొడులు ముద్దగా అయిపోతాయి. ఇతర దినుసులు, సుగంధ ద్రవ్యాలపై బూజు, ఫంగస్ లాంటివి పెరుగుతాయి. అందుకే.. నిల్వ చేయడానికి ముందే సుగంధ ద్రవ్యాలను కొద్దిగా వేయించాలి. దీనివల్ల వాటిల్లో తేమ తగ్గిపోతుంది. నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు, ఈ సింపుల్ డ్రై రోస్టింగ్‌తో అవి మరింత రుచికరంగా మారుతాయి. తేమ వల్ల ఇనుప డబ్బాలు తుప్పు పడుతుంటాయి. వాటిలో నిల్వచేసిన మసాలాల్లోనూ ఈ తుప్పు కలిసిపోయి..
అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి, సుగంధ ద్రవ్యాలను గాజు పాత్రలలో నిల్వ చేయండి. గాలి చొరబడని ఎయిర్‌టైట్ కంటైనర్లను వాడండి.
కిచెన్‌లో తేమ ఎక్కువగా ఉండే సింక్, వాష్ ఏరియాలకు మసాలా డబ్బాలను దూరంగా ఉంచండి. అలాగే, ఆ డబ్బాలపై సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోండి.
మసాలా దినుసులను వాడటానికి ముందు.. చేతులను శుభ్రంగా కడుక్కొని, పొడి వస్త్రంతో బాగా తుడుచుకోవాలి. లేకుంటే.. సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాతో అవి కలుషితమైపోతాయి.
చాలామంది అన్ని దినుసులను ఒక్క డబ్బాలోనే నిల్వచేస్తారు. దీనివల్ల వాటి సహజసిద్ధమైన రుచి మారుతుంది. బదులుగా.. ఒక్కో దినుసును ఒక్కో డబ్బాలో నిల్వచేయండి.