కలపను కనువిందు చేసేలా రూపుదిద్దడంలో నిర్మల్ కళాకారులు సిద్ధహస్తులు. అది వాళ్లకు వంశపారంపర్య వృత్తే. తెలంగాణకు మాత్రం ఘనమైన వారసత్వం. ఆ కళాకారుల కుటుంబాలకు కష్టం వస్తే తెలంగాణకు నష్టమొచ్చినట్టేనని భావించింది కొత్తపల్లి విజయలక్ష్మి.రాష్ర్టానికి పచ్చలహారం తొడిగినట్టు హరితహారం చేపట్టిన వేళ.. అవకాశాన్ని పొనికి పుచ్చుకున్నది. నిర్మల్ బొమ్మగా మారే పొనికి కలప కోసం ఆ మొక్కల పెంపకానికి పథకరచన చేసింది. నిర్మల్ బొమ్మకు, హస్త కళాకారుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చింది. తెలంగాణకు స్కోచ్ అవార్డ్ తెచ్చింది! అందమైన నిర్మల్ బొమ్మలంత తన అనుభవాన్ని జిందగీతో ఇలా చెప్పింది.
నిర్మల్ అంటే ఎవరికైనా కొయ్యబొమ్మలే గుర్తుకొస్తాయ్. అక్కడికి బదిలీ అనగానే నాకూ ఆ బొమ్మలే కండ్లల్లో కదలాడాయి. అందుకే నిర్మల్‌లో పోస్టింగ్ రాగానే నాకు ఎన్నడూ లేని సంతోషం కలిగింది! గలగల పారే గోదావరి… ఆ నదీ పరివాహకంలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం… ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన ‘నిర్మల్ కొయ్య బొమ్మలు’.. నిర్మల్ జిల్లా డీఆర్డీఓ, ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్టింగ్ నా అదృష్టం అనుకున్నాను. నాలుగేండ్ల క్రితం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిగా నిర్మల్‌లో అడుగుపెట్టాను. బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకొన్నాను.
ఎన్నో ఏండ్ల నుంచి చూడాలనుకున్న ‘నిర్మల్ కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార కేంద్రం’ చూసేందుకు వెళ్లాను. అక్కడ కొలువుదీరిన కొయ్యబొమ్మల అందాలను చూసి మురిసిపోయాను. నకాషీ హస్తకళాకారుల చేతుల్లో కొమ్మ అందమైన బొమ్మగా రూపుదిద్దుకోవడం చూస్తూ సంతోషంగా గడిపాను. కానీ, ఆ కళాకారులు మాత్రం అంత సంతోషంగా లేరని గమనించాను. వాళ్ల కష్టమేమిటో విందామని మాట కలిపితే..
బొమ్మల కథలు
అరవై తొమ్మిదేళ్ల రాచర్ల లక్ష్మీ నర్సమ్మ అంత వయసులోనూ అందమైన బొమ్మల తయారీలో ఉంది. పైండ్లెన తర్వాత పద్దెనిమిదేళ్ల వయసులో తన భర్త వీటి తయారీ నేర్పించాడని చెప్పిందామె. బొమ్మల ప్రపంచంలో అందమైన జీవితాన్ని నిర్మించుకున్న ముచ్చట్లెన్నో పంచుకుంది. అలాగే ఓ చేదు నిజాన్నీ బయటపెట్టింది. బొమ్మల తయారీలో ఆదాయం తగ్గిపోతున్నదని నర్సమ్మ బాధపడింది. వాళ్ల బాధలు విన్నప్పుడు చాలా ఏండ్లుగా వాళ్ల కష్టాలే కాదు, అనేక వ్యవస్థల సహకారం కూడా వాళ్లు ఆశిస్తున్నారని అర్థమైంది.
నేను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిగా ఏదైనా చేయాలనుకున్నాను. ఆ సందర్భంలోనే హస్తకళాకారుడు రాచర్ల శ్రీనివాస్ మూడేండ్లుగా పొనికి కలప తగినంత దొరక్క ఇబ్బంది పడుతున్నామని చెప్పాడు. ఉన్న కలపతో ఇంకో రెండేండ్ల కంటే ఎక్కువకాలం బొమ్మలు చేయలేమన్నాడు. కొయ్యబొమ్మల తయారీ ఆగిపోయే ప్రమాదముందని నాకు అర్థమైంది. పొనికి చెట్టు లేకపోతే నిర్మల్ బొమ్మ లేనట్టే. అయిదు వందల ఏండ్ల హస్తకళా వారసత్వం ఆగిపోయినట్టే. రెండు వందల మంది నిర్మల్ హస్త కళాకారులు పచ్చగా బతకాలంటే పచ్చని అడవిలో పొనికి చెట్లు వేళ్లూనుకోవాలని అర్థమైంది. వాళ్ల సమస్యను పరిష్కరిస్తానని సొసైటీకి ఆ రోజే మాటిచ్చాను.
అడవిని సృష్టించాం..
అప్పుడు తెలంగాణలో ‘హరిత హారం’ చురుగ్గా సాగుతున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దీనిని నిర్వహిస్తున్నది. మేము అందులో చురుగ్గా పాల్గొన్నాం. డీఆర్డీఓ ద్వారా లక్షల మొక్కలు నాటించాం. నిర్మల్ కళాకారుల కోసం పొనికి మొక్కలూ ఎంపిక చేయాలని నిర్ణయించాం. కానీ, స్థానికంగానే కాదు రాష్ట్రంలో ఎక్కడా ఆ మొక్కలు లేవు. అప్పటి జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సహకారంతో కళాకారుల సమస్యను, మొక్కల అవసరాన్ని అటవీ శాఖ, పంచాయితీ రాజ్, ఉద్యానశాఖల ఉన్నతాధికారులకు చేరవేశాం. ఆయా శాఖల సహకారంతో ఉత్తరాఖండ్ నుంచి అయిదు వేల పొనికి మొక్కలు తీసుకువచ్చాం. పొనికి చెట్ల పెంపకానికి జిల్లాలో అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు భూసార పరీక్షలు నిర్వహించాం.
మహబూబ్ ఘాట్, లింగాపూర్, జగదాంబ తాండ శివారు ప్రాంతాలను పొనికి మొక్కల పెంపకానికి ఎంపిక చేశాం. ఉత్తరాఖండ్ నుంచి తెచ్చిన మొక్కలే కాకుండా స్థానిక నర్సరీల్లోనూ కొన్నింటిని పెంచాం. గ్రామ పంచాయతీల సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో మొక్కలు నాటించాం. వాటికి నీరు పోయించాం. మూడేళ్లపాటు వాటిని కాపాడుకున్నాం. ఇకముందూ కాపాడుకునేలా స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. ఇప్పుడు పదిహేను అడుగుల ఎత్తు వరకు పెరిగాయి. ఆ పొనికి చెట్లు కొయ్య బొమ్మల కళాకారుల ఆశలు పెంచుతున్నాయి. డీఆర్డీవో చేపట్టిన పొనికి చెట్ల పెంపకం అటవీ సంపదలోని జీవ వైవిధ్యాన్నే కాదు తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలోని వైవిధ్యాన్నీ నిలబెట్టింది. నిర్మల్ జిల్లా అధికారుల కృషిని స్థానికులే కాదు జాతీయ మీడియా సైతం ప్రశంసించింది. ఈ ఏడాది స్కోచ్ అవార్డులలో ‘పర్యావరణ పరిరక్షణ’ విభాగంలో మాకు గోల్డెన్ అవార్డు దక్కింది. ఈ అవార్డు జిల్లా అధికారులకే కాదు నిర్మల్ కళకూ దక్కిన గౌరవం!..? మాధాపురం మహేశ్ రావు, నిర్మల్
మెరుగు ప్రేమ్‌కుమార్