సోషల్ మీడియా ఇప్పుడు జీవితంలో భాగమైంది. ఉదయం కాఫీతో సెల్ఫీ నుంచి రాత్రి గుడ్‌నైట్ ఎమోజీ వరకు అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, అధికారుల వరకు అందరూ దీన్ని వాడుతున్నారు. ఒకప్పుడు సమాచార షేరింగ్ కోసం వచ్చిన ఈ వేదిక ఇప్పుడు షో-ఆఫ్ సిండ్రోమ్‌గా మారింది. ఎందుకిలా? దీని ప్రభావం ఏంటి?
Social Media | సోషల్ మీడియా ప్రచారంతోనే పాలన చేయగలమనే భావన నాయకులు, సెలెబ్రిటీల్లో పెరిగిపోతున్నది. సోషల్ మీడియాలో వాళ్లు చెప్పేవన్నీ గొప్పగానే అనిపిస్తాయి. కానీ, వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఇక ఏఐ రాకతో మరింత ఎఫెక్టివ్‌గా భావోద్వేగ పోస్టులు, ఆకర్షణీయమైన వీడియోలు కుమ్మరిస్తున్నారు.
సోషల్ మీడియా ఒకప్పుడు స్నేహితులతో మాట్లాడే సాధనంగా ఉండేది. ఇప్పుడు ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్టా, యూట్యూబ్ ఇలా సామాజిక మాధ్యమాల విప్లవం విస్తరించింది. వాట్సాప్‌లో స్టేటస్లు, టెలిగ్రామ్ గ్రూప్‌లు కూడా జోడయ్యాయి. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం వీటిని వాడుతున్నారు. అధికారులు తమ పనులను ప్రచారం చేసుకుంటున్నారు. సామాన్యులు సెల్ఫీలు, రీల్స్‌తో బిజీగా గడిపేస్తున్నారు. ఈ వేదిక ఇప్పుడు లైక్‌లు, షేర్ల కోసం పోటీపడే రణరంగంగా మారిపోయింది. దీంతో ఇంప్రెషన్ మేనేజ్మెంట్ పుట్టుకొచ్చింది.
ఇది ఇతరుల మనస్తత్వాన్ని ప్రభావితం చేసేందుకు వేసే ఎత్తుగడ. ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందో, ఎవరు ఎక్కువ లైకులు, షేర్స్, కామెంట్లు సాధిస్తారో అనేది లక్ష్యంగా మారిపోయింది. అధికారులు, రాజకీయ నాయకులు తమ పనులను గొప్పగా చూపించుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రతిరోజూ చేసే సాధారణ కార్యక్రమాలను కూడా అసాధారణ ఘట్టాలుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒక సమావేశానికి హాజరైనా, షేక్ హ్యాండ్ ఇచ్చినా.. దాన్నో చారిత్రక క్షణంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కన్నా, సెల్ఫ్-ప్రొమోషన్ మిన్నఅన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
రోజువారీ ఉదాహరణలు
సామాన్యంగా వ్యక్తులు తమకు అనుకూలమైన అభిప్రాయాన్ని ప్రజల్లో జొప్పించేందుకు ఈ సోషల్ మీడియాను బలంగా ఉపయోగిస్తారు. పత్రికలు, టీవీ లాంటి సంప్రదాయ మీడియా వేదికల్లో పబ్లిష్ అయ్యేవి, ప్రసారం అయ్యే వాటికి కొంత ప్రామాణికత ఉంటుంది. కానీ, సోషల్ మీడియా వేదికలపై ఎలాంటి నియంత్రణ కనిపించదు. వాస్తవికత పక్కన పెట్టేసి.. తమ గురించి, తమ పనితీరు గురించి ఎవరు పడితే వారు, ఏవేవో కథనాలు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ ధోరణికి అలవాటుపడ్డారు. లైక్‌లు, కామెంట్లు, షేర్ల కోసం పిల్లల నుంచి పెద్దల వరకు కొందరు తక్కువ స్థాయి కంటెంట్ పోస్టు చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఎవరైనా తాము చేసిన పనికన్నా.. ప్రచారానికే ఎక్కువగా ఆరాటపడుతున్నారు.
సెల్ఫ్‌డబ్బా..
సోషల్ మీడియాలో మీ గురించి ఇతరులు ఏం ఆలోచిస్తారనేది ముఖ్యమైంది. ఒక నాయకుడు రోజూ పోస్టు పెడితే అతను చాలా చురుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగా గ్రౌండ్ లెవల్లో ఆ పని జరిగిందా అంటే అనుమానమే! ‘నేను ఇలా చేశాను’ అని చెప్పడం రివాజుగా మారింది. నిపుణులు దీన్ని ‘నార్సిసిజం ఎపిడెమిక్’గా అభివర్ణిస్తున్నారు. ప్రభావం చూపే వ్యక్తిగా నిలవాలనే తపన, విజయవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందాలనే కోరికతో వర్చువల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. సోషల్ మీడియాను సెల్ఫ్‌డబ్బా కొట్టుకోవడానికి వేదికగా మార్చేశారు.
లైక్‌లతో ఆనందం
సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్, కామెంట్లు పొందడమే ప్రధాన లక్ష్యంగా మారుతున్నది. పోస్టు చేసిన ప్రతిసారీ మరింత స్పందన రావాలని చూసే ఈ సైకిల్‌ను ‘డోపమైన్ రష్’ అని పేర్కొంటున్నారు నిపుణులు. వాస్తవ పాలన కన్నా, సోషల్ మీడియా ట్రెండ్స్‌లో కనిపించడమే వీళ్లకు ముఖ్యం అన్నమాట. ప్రజల్లో తమ ‘డిజిటల్ ఇమేజ్’ మెరుగుపడితే, నిజమైన పనితీరు ఎలా ఉన్నా ఫలితాలు సాధించొచ్చనే భావన పెరగడమే ఇందుకు కారణం.
సోషల్ మీడియా ప్రచారంతోనే పాలన చేయగలమనే భావన నాయకులు, సెలెబ్రిటీల్లో పెరిగిపోతున్నది. సోషల్ మీడియాలో వాళ్లు చెప్పేవన్నీ గొప్పగానే అనిపిస్తాయి. కానీ, వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఇక ఏఐ రాకతో మరింత ఎఫెక్టివ్‌గా భావోద్వేగ పోస్టులు, ఆకర్షణీయమైన వీడియోలు కుమ్మరిస్తున్నారు. ఇవి చూడటానికి బాగుంటాయి. కానీ, వీటిలోని నిజాయతీ మాత్రం శంకించాల్సిందే! ‘సోషల్ మీడియా ఒక సాధనంగా ఉండాలి. అది ప్రజా సేవను మరిచేలా మారకూడదు’ అనేది నిపుణుల మాట. విజయాలను పంచుకోవడం మంచిదే. కానీ, డిజిటల్ ప్రచారం నిజమైన పాలనను దాటిపోకూడదు.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్