హైదరాబాద్: సీజన్ ఏదైనా అందుబాటులో ఉండే అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. అందుకే డయాబెటిస్ లేకపోతే ప్రతిరోజు ఒక అరటిపండైనా తీసుకోవాలని డాక్లర్లు చెబుతుంటారు. అరటిపండులో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. అజీర్తిని పోగొడుతుంది. అందుకే ఏ శుభకార్యానికైనా అరటి పండునే ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి ఇంతటి ప్రత్యేకతలున్న అరటిపండు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..?
అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు..
1. ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎముకలు, దంతాలకు చాలా మంచిది. శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అరటి పండులో ఉండే పోషకాలు ఆస్తమా, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ను నివారిస్తాయి.
2. కిడ్నీల ఆరోగ్యానికి కూడా అరటిపండు ఉపకరిస్తుంది. వారానికి రెండు లేదా మూడు అరటి పండ్లు తినడంవల్ల కిడ్నీ సంబంధిత జబ్బుల బారినపడే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఒక అధ్యయనంలో తేలింది.
3. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకానికి మంచి మందు.
4. అరటిపండులో కొవ్వులు తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు తినవచ్చు. ఇందులో ఉండే పిండిపదార్థం కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది.
5. అరటిపండు పేగులను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
6. అరటి పండులో ఉండే ‘బాన్‌లెక్’ అనే రసాయనానికి ఎయిడ్స్ వైరస్‌పై పోరాడే శక్తి ఉందని ఓ రిసెర్చ్‌లో తేలింది. లెక్టిన్ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుని ఇన్ఫెక్షన్ను నిరోధిస్తుంది.
7. అరటిపండులో ఉండే ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత కలుగజేస్తుంది. రాత్రిపూట పాలతో కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.