వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడానికి చిన్నస్థాయి మహిళా వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 70 శాతం మంది ఈ వైపుగా అడుగులు వేస్తున్నారు. భారత్ ఉమెన్ ఆస్పిరేషన్ ఇండెక్స్ – 2025 నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దేశంలోని ద్వితీయశ్రేణి నగరాలు, చిన్నచిన్న పట్టణాలకు చెందిన 1,300 మందికిపైగా మహిళా వ్యవస్థాపకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో అత్యధిక మంది 18 నుంచి 55 ఏండ్లలోపు వారే! సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి సమర్థంగా నిర్వహిస్తున్నా.. సంస్థాగతంగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. తాము ఫైనాన్స్, మార్కెటింగ్తోపాటు డిజిటల్ కార్యకలాపాల్లో వెనకబడి పోయినట్లు 70 శాతం మహిళా వ్యాపార యజమానులు వెల్లడించారు.
రుణాలు, వ్యాపార నెట్వర్క్లు, సరైన ప్రాతినిధ్యం లేక.. తమ ఆశయాలు నీరుగారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో సహచరుల మద్దతు, మార్గదర్శక అవకాశాలకు దూరం అవుతున్నామని చెప్పుకొచ్చారు. సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నా.. ఆర్థికంగా సొంత నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారట. వీరిలో 52 శాతం మంది ఇప్పటికీ డబ్బుల కోసం కుటుంబ పెద్దల దగ్గర చేయి చాస్తున్నారట. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమను తక్కువ రుణ అర్హత కలిగినవారిగా భావిస్తున్నారని 54 శాతం మంది వెల్లడించారు కూడా. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన లింగ పక్షపాతాన్ని పట్టి చూపుతున్నదని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు.
ఇక తమకు ప్రభుత్వ రంగంతోపాటు మీడియాలోనూ తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరో 49 శాతం మంది చెప్పుకొచ్చారు. ఇది కూడా మహిళల వ్యవస్థాపక సామర్థ్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన సామాజిక అవసరాన్ని సూచిస్తున్నది. 52 శాతం మంది ఇ-కామర్స్, ఎడ్టెక్ వంటి డిజిటల్ రంగాలలో పనిచేస్తున్నప్పటికీ.. వీరిలో 12 శాతం మంది మాత్రమే డిజిటల్ నైపుణ్యాలను కలిగి ఉన్నారట. ఈ అవరోధాలన్నీ తమ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో, ఆయా రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకొని.. వ్యాపారాలను మరింత విస్తృతపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ఈ నివేదిక ఒక బ్లూప్రింట్ మాత్రమేనని.. ఈ రంగంలో వ్యవస్థాగత అంతరాలను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు. ఇందుకోసం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, వివిధ వేదికలు, విధాన రూపకర్తలు.. మహిళా వ్యవస్థాపకులకు అండగా నిలవాలని కోరుతున్నారు. వారు ఎదగడానికి సహాయపడాలనీ, అందుకు తగిన పరిష్కారాలను చూపాలని అంటున్నారు.