‘నెమ్మది’ అనే మాటే నచ్చని నవతరం.. అన్నిట్లోనూ వేగాన్నే కోరుకుంటున్నది. బైక్, ఇంటర్నెట్ స్పీడ్‌లోనే కాదు.. ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఫాస్ట్‌గానే ఆలోచిస్తున్నది. ‘లవ్ ఎట్ ఫస్ట్‌సైట్’ అంటూ.. తొలిచూపులోనే ప్రేమలో మునిగిపోతున్నది. పెద్దలు కుదిర్చిన సంబంధమైనా.. ‘చూపులు కలసిన శుభవేళ’లోనే పెళ్లికి ‘ఓకే’ చెప్పేస్తున్నది. భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే.. వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నది. ఫలితంగా, కొద్దిరోజులకే మనస్పర్ధలు తలెత్తి.. విడాకులకు దారితీస్తున్నది. అలా కాకుండా.. బంధం బలంగా ఉండాలంటే, ‘స్లో డేటింగ్’కు ‘జై’ కొట్టాల్సిన అవసరం ఉన్నది.
నమ్మకమే.. బంధాలకు నిజమైన పునాది. అది బలంగా ఉన్నప్పుడే వివాహ బంధం కలకాలం నిలుస్తుంది. అయితే, అలాంటి నమ్మకాన్ని రాత్రికి రాత్రే నిర్మించలేరు. ఒకరినొకరు పూర్తిగా తెలుసుకున్నప్పుడే.. అది సాధ్యమవుతుంది. ఇందుకు ‘స్లో డేటింగ్’ సంపూర్ణంగా సహకరిస్తుంది. ఎలాంటి తొందరపాటు లేకుండా, ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుంటూ, లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడమే.. ఈ స్లో డేటింగ్. అందుకే, కాలేజీ ప్రేమికులైనా; పెళ్లిచూపుల్లో మెచ్చినవాళ్లయినా.. ‘స్లో డేటింగ్’ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
కనీసం మూడు నుంచి నాలుగు నెలలైనా ఇందుకు కేటాయించాలని చెబుతున్నారు. ఈ సమయం ఇద్దరి మధ్య భావోద్వేగాల భద్రతను పెంచుతుంది. దీర్ఘకాలిక సంబంధాలకు బలమైన పునాది వేస్తుంది. తక్షణ సంతృప్తికి బదులుగా.. సహజంగా అభివృద్ధి చెందే నిజమైన అనుభూతిని పెంచుతుంది. కాస్త సమయం తీసుకున్నా.. మరింత నమ్మకమైన, సంతృప్తికరమైన ఫలితాలను అందిస్తుంది.