ఒంటరి మహిళలు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారట. ఒంటరితనాన్ని తమకు దొరికిన స్వేచ్ఛగా భావిస్తుండటమే.. ఇందుకు ప్రధాన కారణమని తాజా సర్వే ఒకటి తేల్చింది. సోషల్ సైకలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్ ఇటీవల జరిపిన అధ్యయనం.. ఒంటరి మహిళలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బ్యాచిలర్స్.. బ్రేక్అప్స్.. డైవర్స్.. ఇలా కారణాలేవైనా సమాజంలో ఒంటరి మహిళలు పెరుగుతున్నారు.
వాళ్లలో అధికశాతం మంది తమకు మాత్రమే సొంతమైన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఒంటరితనం బాధిస్తున్నా.. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిగే ఆనందం గొప్పదని వాళ్లు ముక్తకంఠంతో చెబుతున్నారు. ‘మా జీవితానికి సంబంధించిన విషయాల గురించి మేమే నిర్ణయాలు తీసుకోగలగడం.. ఎంతో ఆనందం కలిగిస్తుంది” అంటున్నారు.
అలాంటి సొంత నిర్ణయాలే.. తమకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెడతాయనీ చెబుతున్నారు. ఇక ఒంటరితనాన్ని పోగొట్టడానికి వారికున్న మరో మంచి ఆప్షన్.. వారి నెట్వర్క్. ఇలాంటి మహిళలు బలమైన సోషల్ నెట్వర్క్ను సంపాదించుకుంటున్నారట. అదే.. తమ ఒంటరి జీవితాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తున్నదని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఒంటరి మహిళల ఆనందాన్ని మరోమెట్టు ఎక్కించే ఇంకో ముఖ్యమైన అంశం.. ఆర్థిక స్వాతంత్య్రం. కొన్నేళ్ల కిందటివరకూ మహిళలకు తండ్రి, భర్తతోనే ఆర్థిక భద్రత ఉండేది. కానీ, రోజులు మారాయి. చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.
ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తూ.. వ్యక్తిగత ఆనందానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరి గురించో ఆందోళన చెందాల్సిన అవసరం వీళ్లకు లేదు. అందుకే, తమ గురించి తామే ఆలోచిస్తూ.. సంతృప్తిగా జీవిస్తున్నారు. తమ కోరికలను నెరవేర్చుకోవడానికి వీళ్లకు తగినంత సమయం దొరుకుతున్నది. అది ఫిట్నెస్ అయినా.. నచ్చింది తినడమైనా!
ఇక తమ కెరీర్లు, అభిరుచులకే జీవితాన్ని అంకితం చేసేవాళ్లూ ఉన్నారు. అయితే, ఒంటరితనంతోనే సంతృప్తి పొందుతున్న మహిళలు.. ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతారని అనుకోవడానికి లేదు. వీళ్లలో చాలామంది మళ్లీ ప్రేమలో పడతామనీ, కుటుంబాన్ని ప్రారంభిస్తామనీ చెప్పుకొచ్చారు. కాకపోతే.. వీళ్ల ప్రమాణాలు ఇతరుల కన్నా భిన్నంగా ఉంటాయి. నచ్చినవారితోనే జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. అందులోనూ.. వారి నిర్ణయమే ఫైనల్!