చిన్నాపెద్దా తేడాలేకుండా ఈరోజుల్లో అందరికీ నచ్చిన పదం.. సెల్ఫీ! ఏ ప్రదేశానికి వెళ్లినా, ఎవ్వరిని కలిసినా.. ఒక సెల్ఫీ దిగడం ఇప్పుడు సాధారణమై పోయింది. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం.. లైక్‌లు, కామెంట్లు చూసి సంతోషించడం.. ఫ్యాషన్‌గా మారింది. మరి.. ఏమిటా సెల్ఫీ? దాన్ని మరింత స్టయిలిష్‌గా తీసుకోవడం ఎలా? మరిన్ని లైక్‌లు కొల్లగొట్టలాంటే.. ఎలాంటి చిట్కాలు పాటించాలి? పదండి.. తెలుసుకుందాం!
Selfie | సెల్ఫీ.. అంటే స్వీయ చిత్రం. మనల్ని మనమే ఫొటో తీసుకోవడం. ఒకప్పుడు మన కెమెరాతో మన ఫొటో తీసుకోవాలంటే.. వెంట ఒకరు ఉండాల్సిందే! కెమెరానువారికి ఇచ్చి.. మనకు నచ్చేలా ఫొటో తీయించుకునేవాళ్లం. అయితే.. కెమెరా లేకపోయినా, ఎప్పుడూ మన చేతిలోనే ఉండే స్మార్ట్‌ఫోన్ కెమెరాతో.. మనకి నచ్చినట్టుగా మన ఫొటో మనమే తీసుకోవడమే సెల్ఫీ అంటే!
దాదాపు ఒక దశాబ్దం క్రితం వరకూ మనం ఇలాంటి ఆలోచన చేసి ఉండం. కానీ, ఈ డిజిటల్ యుగంలో.. కొత్తకొత్త స్మార్ట్ఫోన్ల రాకతో సెల్ఫీలు తీసుకోవడం చాలా సులువైంది. దీనికి ప్రత్యేకంగా కెమెరా అవసరం లేదు. మన ఫొటో తీయడానికి ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. మన సెల్ఫీ మనమే తీసుకోవచ్చు. ఆ జ్ఞాపకాల్ని భద్రంగా దాచుకొని.. మనకు దగ్గరైన వాళ్లతో పంచుకోవచ్చు. మనం ఏ పర్యటనకు వెళ్లినా, మనవాళ్లు ఎవరు కలిసినా.. ఆ మధుర క్షణాలను, అనుభూతులను సెల్ఫీల రూపంలో నిక్షిప్తం చేసుకోవచ్చు.
సెల్ఫీ.. టిప్స్!
మరి ఇంత ప్రాముఖ్యమున్న సెల్ఫీలను ఎలా తీయాలి? ఒక మంచి జ్ఞాపకాన్ని.. ఒక మంచి సెల్ఫీ రూపంలో ఎలా బంధించాలి? అందుకు కావాల్సిన సరంజామా.. టిప్స్ ఏంటి?
జాగ్రత్త జాగ్రత్త..
సెల్ఫీలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో.. వాటిని దిగే సమయంలో చూపే అత్యుత్సాహం, అంతే విషాదాన్ని తెచ్చిపెడుతుంది. 2008 నుంచి 2021 వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకుంటూ దాదాపు 400 మంది మరణించారని జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్ అధ్యయనం చెబుతున్నది. నిజానికి సెల్ఫీలు ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి కాకపోయినా.. కొండ చరియలు, జలమార్గాలు లేదా వన్యప్రాణుల దగ్గర అజాగ్రత్తగా సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరమని ఈ అధ్యయనం హెచ్చరిస్తున్నది. మీరు అద్భుతమైన సెల్ఫీతో అందరి మన్ననలూ పొందవచ్చు. కానీ, అందుకోసం రిస్క్ చేయడం తెలివైన పని కాదు. అన్ని హెచ్చరికలనూ పరిగణనలోకి తీసుకోండి. అన్ని జాగ్రత్తలూ పాటించండి. ఎందుకంటే.. మీ సెల్ఫీని పంచుకోవడానికి మీరే లేకపోతే.. ఆ ఫొటో తీసి ఏం లాభం? అందుకే.. సెల్ఫీ తీసుకునేటప్పుడు చుట్టూ ఏం జరుగుతున్నదనే విషయంపై ఎరుకతో వ్యవహరించండి.
మంచి సెల్ఫీ తీసుకోవడానికి కావాల్సిన ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ చిట్కాలు మీకు సహాయపడతాయని ఆశిస్తూ..
కావాల్సినవి..
1. ఫ్రంట్ కెమెరా ఉన్న ఒక స్మార్ట్‌ఫోన్
2. సెల్ఫీ స్టిక్ (ఉంటే మంచిది)
టిప్ నెం 1 : ముందుగా మీ ఫోన్ కెమెరా సెట్టింగ్స్ గురించి సరిగ్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు వస్తున్న అనేక స్మార్ట్ఫోన్లలో సెల్ఫీల కోసం ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఉంటున్నాయి. వాటి గురించి తెలుసుకోవడం కూడా అవసరం. మనం సెల్ఫీ తీసుకునే చోట వెలుతురు సరిగ్గా ఉండకపోవచ్చు. ఇతర కారణాల వల్ల మనం సెల్ఫీ తీసుకోవడం కష్టం అవ్వొచ్చు. ఇలాంటి సమయాల్లో మన ఫోన్లో కెమెరా సెట్టింగ్స్ గురించి సరైన అవగాహన ఉంటే.. ఈ ఇబ్బందులను అవలీలగా అధిగమించొచ్చు.
టిప్ నెం 2 : ఒక మంచి సెల్ఫీ రావడంలో.. మీ ఆటిట్యూడ్, మీ చుట్టూ ఉన్న పరిసరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సెల్ఫీ తీసుకునే ముందు రిలాక్స్ అవ్వండి. మీకు సంతోషం తెప్పించే విషయాన్ని గుర్తుచేసుకోండి. దీనివల్ల మీ ముఖం మీద ఒక చిరునవ్వు వెలుగుతుంది. ఆ చిరునవ్వు.. మీ సెల్ఫీకి నిజమైన అందాన్ని తీసుకొస్తుంది.
టిప్ నెం 3 : ఎలాంటి ఫొటోలు తీయడానికైనా.. లైటింగ్ అనేది చాలా ముఖ్యం. లైటింగ్‌లో ఏమాత్రం తేడా వచ్చినా.. ఫొటోపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముందుగా ఫోన్‌ను మీ ముఖం ఎదుట ఉంచండి. సెల్ఫీ కెమెరాను ఆన్ చేసి.. మీ ముఖంపై వెలుతురు, నీడ ఎక్కడెక్కడ పడుతున్నాయో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఫోన్‌ను అలాగే పట్టుకొని.. 90 డిగ్రీలు తిరగండి. మీ ముఖంపై వెలుతురు సరిగ్గా పడుతున్నదని గుర్తించిన తర్వాత.. సెల్ఫీ తీసుకోండి.
టిప్ నెం 4 : సెల్ఫీలో మీ బ్యాక్‌గ్రౌండ్/ బ్యాక్‌డ్రాప్ అనేది కూడా ముఖ్యమే. అలాగే, సెల్ఫీలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. ఉదాహరణకు.. మీరు చార్మినార్ ముందు సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నారనుకోండి. మీ వెనకాల చార్మినార్ తప్ప వేరేవాటి మీద కెమెరా ఫోకస్ లేకుండా చూసుకోవాలి. వచ్చీపోయే వాళ్లు ఫోకస్ అయితే.. సెల్ఫీలో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. దాంతో మీ సెల్ఫీ అర్థమే మారిపోతుంది. ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో సెల్ఫీ స్టిక్స్ వాడటం మంచిది. ఎందుకంటే.. సెల్ఫీ స్టిక్ అనేది డిజిటల్ కెమెరాను, సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌ను చేతి పరిధికి మించి ఉంచుతుంది. ఫలితంగా.. ఫొటోలు, వీడియోల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉంటాయి.
టిప్ నెం 5 : ఎప్పుడూ ఒకే యాంగిల్లో సెల్ఫీలు దిగితే.. అన్నీ ఒకేలా కనిపిస్తాయి. అందుకే.. కాస్త క్రియేటివ్‌గా ఆలోచించండి. సెల్ఫీలు దిగడంలో కొత్తదనం చూపించండి. కొత్తకొత్త యాంగిల్స్‌లో సెల్ఫీలు దిగండి. ఆ చిత్రాలు మీ స్నేహితులనే కాదు.. మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
టిప్ నెం 6 : ఇప్పుడు వస్తున్న సరికొత్త మోడల్ స్మార్ట్ఫోన్లు.. సెల్ఫీ పోర్ట్రెయిట్ మోడ్‌లను అందిస్తున్నాయి. ఇవి మీ ఫొటోల్లో మిమ్మల్ని హైలైట్ చేయడానికి మీ ముందు.. వెనక ఉండే నేపథ్యాలను బ్లర్ చేస్తాయి. అందుకే, మీరొక్కరే సెల్ఫీ దిగాలనుకుంటే.. పోర్ట్రెయిట్ మోడ్‌లోకి వెళ్లిపోండి.
…? ఆడెపు హరికృష్ణ