సెకండ్‌హ్యాండ్ సరుకు అంటే కొందరికి విపరీతమైన మోజు ఉంటుంది. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో మంచి, చెడు బేరీజు వేసుకోకుండా వాడిన వస్తువుకు జై కొడుతుంటారు. ఏదైనా సెకండ్ హ్యాండ్లో కొనొచ్చు కానీ, స్మార్ట్ గ్యాడ్జెట్లు మాత్రం కొనకూడదని నిపుణులు చెబుతున్నారు. ఊరించే ఆఫర్ ఉందని వీటిని కొనుగోలు చేస్తే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఉచితంగా ఇస్తామన్నా సున్నితంగా వారించండి. బలవంతంగా అంటగట్టే ప్రయత్నం చేస్తే గట్టిగా మందలించండి.
మరీ దగ్గరి వారి దగ్గరైనా సరే సెకండ్ హ్యాండ్లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొద్దు. మనిషి, నమ్మకం మధ్య భూమి ఆకాశమంత దూరం వచ్చేసింది. ఈ రోజుల్లో ప్రతి విషయంలోనూ కీడెంచి మేలు ఎంచాల్సిందే! అయినవారి దగ్గరే వద్దు అన్నప్పుడు ప్రైవేట్ దుకాణాల్లో పాత సెల్ఫోన్లు కొనడం మరింత ప్రమాదం. మాల్వేర్, బగ్ ఇన్స్టాల్ చేసి వాటిని మీకు అంటగట్టే ప్రమాదం ఉంది. మీరు వాడటం మొదలుపెట్టగానే మీ జీవితం అంతా అమ్మినవారికి తెరిచిన పుస్తకం అయిపోతుంది.
స్మార్ట్‌వాచ్, స్మార్ట్ డోర్ లాక్స్, ఇతర స్మార్ట్ గృహోపకరణాలు సెకండ్స్లో కొనుగోలు చేయొద్దు. స్మార్ట్ అసిస్టెంట్స్‌ను ముందుగానే హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. వాటిని రీసెట్ చేసినా అందులో బగ్ తొలగిపోదు. ఇవేవీ తెలుసుకోకుండా స్మార్ట్ ఉపకరణాలు సెకండ్స్లో కొంటే దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్టు అవుతుంది.
పవర్ బ్యాంకులు సెకండ్‌హ్యాండ్‌లో కొంటే ప్రమాదాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే! బాగా వాడేసిన పవర్ బ్యాంకులు చార్జింగ్ పెట్టగానే వేగంగా వేడెక్కుతాయి. అవి పేలిపోయే ప్రమాదమూ లేకపోలేదు. అంతగా అవసరం అనుకుంటే పవర్ బ్యాంక్ ఫస్ట్ హ్యాండ్లో కొనండి. అంతేకానీ, వాడేసినవి తెచ్చుకోవద్దు.