ఎండాకాలం సెలవులు అయిపోయాయి. మళ్లీ బడి గంటలు మోగుతున్నాయి. ఇక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి బడిలోనే పునాది పడుతుంది. కాబట్టి సెలవులు అయిపోయిన పాత పిల్లలైనా, కొత్తగా చేరుతున్న పాలబుగ్గల బాలలైనా వారి పాఠశాల జీవితం సాఫీగా సాగిపోవడానికి తల్లిదండ్రులు సహకరించాలి. పిల్లలను బడిలో చేర్చడానికి ముందే వారికి ఓసారి బడి ఎలా ఉంటుందో చూపించాలి. బడిలో ఉపాధ్యాయులను పరిచయం చేయాలి. దీంతో కొత్తగా చేరే పిల్లలకుబడి అంటే బెరుకుతనం పోతుంది. ఇంట్లో ఎవరైనా పెద్ద పిల్లలు అదే బడిలో చదువుతుంటే కొత్తగా చేరే వారికి బడి గురించి సానుకూలంగా చెప్పించాలి. అలా పిల్లలను బడికి వెళ్లడానికి, బాగా చదువుకోవడానికి సన్నద్ధం చేయాలి.
బడి తొలిదశకు ముందు పిల్లలు బాగా చిన్నవాళ్లు కావడంతో ఇంట్లోనే గడుపుతారు. అదీ తల్లి దగ్గరే ఎక్కువగా గడిచిపోతుంది. వారికి బయటి వాతావరణం, సమాజం, తోటిపిల్లల గురించి అసలే తెలియదు. కాబట్టి, బడి ప్రారంభానికి ముందే కొత్తవాళ్లయితే పిల్లలను బడికి తీసుకువెళ్లాలి. అక్కడి తరగతి గదులు, ఆటమైదానం, గ్రంథాలయాలను చూపించాలి. వీలైతే ఆ బడిలో అదే తరగతి చదివే పిల్లలతో ఎండాకాలం సెలవుల్లోనే అప్పుడప్పుడు ఆటపాటల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు చొరవచూపాలి. ఇతరులు చెప్పేది వినడంలో ఉన్న ప్రాధాన్యం వివరించాలి. తోటి పిల్లలతో సానుభూతితో మెలిగేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి.
బడి అంటేనే పాఠాలు, హోమ్‌వర్కులు ఉంటాయి. ఒకవేళ బడిలో పాఠాలు సరిగ్గా వినకపోయినా, టీచర్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు సరిగా చెప్పకపోయినా, హోమ్‌వర్క్ చేయకపోయినా ఉపాధ్యాయులు దండిస్తారనే భయం పిల్లల్లో ఉంటుంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలను ఎండాకాలం సెలవుల్లోనే తల్లిదండ్రులు పిల్లలతో చదివించాలి. పిల్లల్లో ప్రశ్నలు అడగటాన్ని ప్రోత్సహించాలి. వాళ్లు అడిగే ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పాలి. ఇక స్కూల్ యూనిఫారం, స్టేషనరీ లాంటివి కూడా బడి ప్రారంభానికి ముందే కొనివ్వడం మంచిది. కుదిరితే వారిని కూడా షాపింగ్‌కు తీసుకెళ్లాలి. దీంతో ముందుగానే అలవాటై ఉంటారు కాబట్టి, పిల్లలు బడికి వెళ్లడానికి మానసికంగా ఉత్సాహంగా సిద్ధమైపోతారు. బడికి వెళ్లనని, రేపు వెళ్తానని మారాం చేయడం లాంటివీ దాదాపుగా ఉండవు.
తమ పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తాము చేసుకోగలిగిన పనులు తామే చేసుకునేలా చూడాలి. సాధ్యమైనంత వరకు ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. బడిలో టీచర్లు, ఇతర సిబ్బంది కూడా పిల్లలు తమదైన శైలిలో చదువుకోవడానికి సహకరించాలి. అలానే బడిలో బాత్రూంలు ఉపయోగించడం గురించి కూడా పిల్లలకు నేర్పించాలి. టాయిలెట్‌ను సరిగ్గా ఫ్లష్ చేయడం, బట్టలు సరిగ్గా వేసుకోవడం, చేతులు, కాళ్లు కడుక్కోవడం లాంటివి తొలిదశలోనే నేర్పించాలి. పిల్లల బాల్యం ఎక్కువగా బడి, ఆట మైదానాలు, ఆడుకోవడంలోనే గడిచిపోతుంది. కాబట్టి, వాళ్లు ఇంటికి వచ్చేటప్పటికి బట్టలు మురికిగా అయిపోయి ఉంటాయి. అందుకే వ్యక్తిగత ఆరోగ్య రక్షణ గురించి వారికి అర్థమయ్యేలా చెప్పాలి. చేతులను హ్యాండ్‌వాష్‌తో కడుక్కోవడం, బట్టలు మురికిపట్టకుండా చూసుకోవడం లాంటివి అలవాటు చేయాలి. పిల్లలు స్కూల్ డ్రెస్‌లు, షూస్ వాళ్లంతట వాళ్లే వేసుకునేలా నేర్పించాలి. ఆహారం విషయానికి సెలవుల్లోనే వారికి లంచ్ బాక్స్‌లు సొంతంగా తినడం అలవాటు చేయాలి.
పిల్లల చదువు విషయానికి వస్తే.. ఆటపాటలతో కూడిన విద్యా విధానం మంచిది. ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుని చదివించాలి. హోంవర్క్ చేయించాలి. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అలా ఏదైనా అనుమానం వస్తే తాము తీరుస్తామన్న భరోసా కల్పించాలి. అప్పుడప్పుడు చిన్నచిన్న కథల పుస్తకాలను చదివించాలి. వాటిలో నీతిని విడమర్చి చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో పద సంపద పెరుగుతుంది. సంభాషణ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. సృజనాత్మకత అలవడుతుంది. బడిలో టీచర్లు పాఠాలు చెప్తుంటే జాగ్రత్తగా వినడం, నోట్సు రాసుకోవడం పరిచయం చేయాలి. ఇక కొత్తగా చేరుతున్న పిల్లలకైతే తమ పేరులో అక్షరాలను, వారు బడికి తీసుకువెళ్లే వస్తువులను గుర్తించడమూ నేర్పించాల్సి ఉంటుంది. వారి పేరు సొంతంగా రాయడం నేర్పించాలి.
పిల్లలకు పరిసర వాతావరణం నుంచే వస్తువులను లెక్కపెట్టడమూ నేర్పడం మంచిది. అలా లెక్కలు చేయడంలో ప్రాథమిక ప్రక్రియలైన కూడిక, గుణకారం, తీసివేత, భాగహారం సులువుగా అర్థమైపోతాయి. పిల్లలు వాడే పుస్తకాలు, బ్యాగులు, ఇతర వస్తువులు అన్నీ ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి పక్క పిల్లల వస్తువులతో కలిసిపోతాయి. ఇలా జరగకుండా తమ వస్తువులు తాము గుర్తించడానికి వాటిపై లేబుల్స్ అంటించడం మంచిది. ఇక పిల్లల జీవితం రోజంతా బడి, ఆటలు, చదువుతోనే గడిచిపోతుంది. కాబట్టి, వారిమీద ఇతర వ్యాపకాల బరువు పెట్టకూడదు. పైగా తొలిరోజుల్లో అయితే వారిలో సాయంత్రానికి అలసిపోయిన చిహ్నాలు కనిపిస్తాయి. అందువల్ల తగినంత విశ్రాంతికి వీలు కల్పించాలి.
బాల్యం తొలిదశలో పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు, ఇతర పెద్దలను నవ్విస్తూ ఆనందాన్ని పంచుతారు. వాళ్లు బడికి వెళ్తున్న సమయంలో కొంచెం లోటుగా అనిపిస్తుంది. మనసు భారంగా మారిపోతుంది. పిల్లల పరిస్థితి కూడా అంతే! కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతారు కాబట్టి వాళ్లూ ఒకింత ఆందోళనకు గురవుతారు. అందువల్ల పెద్దవాళ్లు భావోద్వేగాలకు గురికాకూడదు. పిల్లలను సంతోషంగా బడికి పంపించాలి. మంచిగా చదువుకుని గొప్పగా ఎదగడానికి సహకరించాలి.