ఆమె మైదానంలో కాలుపెడితే.. మూడు క్రీడల చాంపియన్. ఒడ్డున నిలబడి తీర్పు చెబితే తిరుగులేని అంపైర్. విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని గుర్తించడంలో కిటుకు తెలిసినఫిజికల్ డైరెక్టర్. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ కొత్త సావిత్రి.. ఆటలే ఆలంబనగా అనేకమంది విద్యార్థినుల జీవితాలు మార్చారు.
ఆమె రాకెట్ పడితే ప్రత్యర్థులకు చెమటలే. సింగిల్.. డబుల్స్.. మిక్స్డ్ డబుల్స్.. ఫార్మాట్ ఏదైనా సక్సెస్ మాత్రం కొత్త సావిత్రిదే. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు సావిత్రి. యాభై ఆరేండ్ల నడి వయసు ఆమెకు అవరోధమే కాదు. మూడు దశాబ్దాల క్రితం సింగరేణి మహిళా జూనియర్ కాలేజీలో ఉద్యోగంలో చేరిన సావిత్రి.. అక్కడే డిగ్రీ కాలేజీ పీడీగా ప్రమోషన్ పొందారు. తనకు బాల్యం నుంచీ ఆటలంటే ఇష్టం. మూడు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించారు.
షటిల్, బ్యాడ్మింటన్,
టెన్నిస్‌లో ఎన్నో పతకాలు సాధించారు. ఇతర దేశాల్లో కూడా సత్తా చాటారు. భర్త సుధాకర్‌రెడ్డి షటిల్ కోచ్ కావడం తనకు కలిసొచ్చిన అంశం. టర్కీ, డెన్మార్క్, దుబాయ్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా.. క్రీడాకారిణిగా సావిత్రి తిరగని దేశం లేదు. ఆడని మైదానం లేదు. తన సర్వీసులో.. ఏకంగా ఐదు వేల మంది విద్యార్థినులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించారు. ఆ జాబితాలో.. పాల్వంచ కస్తూర్బాగాంధీ కాలేజీ ప్రిన్సిపల్ తులసి కూడా ఉన్నారు.
తొలి లేడీ అంపైర్
జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు రిఫరీ ఉండాల్సిందే. వారినే అంపైర్ అనీ అంటాం. రిఫరీ ఎంపికకు ఓ పరీక్ష ఉంటుంది. సావిత్రి ఆ వడపోతలో ఉత్తీర్ణత సాధించి.. రాష్ట్రంలోనే తొలి మహిళా రిఫరీగా నియమితులయ్యారు. గత ఏడాది.. గోవాలో జరిగిన షటిల్ టోర్నమెంట్లో చాంపియన్‌షిప్ కూడా సాధించారు సావిత్రి. సింగరేణి కాలేజీ ఆట మైదానం ఉదయం, సాయంత్రం విద్యార్థులతో కళకళలాడుతూ ఉంటుందంటే.. అదంతా సావిత్రి చొరవే. ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి, సానబట్టి, రత్నాల్లా తయారు చేయడం ఆమె ప్రత్యేకత. ‘నాకు చాంపియన్‌షిప్ రావడం కంటే.. నా కాలేజీలో చదువుకున్న పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు రావడమే ఎక్కువ సంతోషంకలిగిస్తున్నది. ఈ రూపంలో ఎంతోమంది అమ్మాయిల జీవితాల్ని మార్చగలిగినందుకు సంతోషంగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచీ ఆటలంటే ఇష్టం. అందుకే మూడు ఆటల్లో చాంపియన్‌షిప్ సాధించాను’ అని చెబుతారు ఫిజికల్ డైరెక్టర్ సావిత్రి.
…? కాగితపు వెంకటేశ్వరరావు