సంక్రాంతి అంటేనే ముగ్గుల ముచ్చట్లు! వాకిట్లో హరివిల్లును తలపించే రంగవల్లులు! వాటిని చూసి పిల్లలూ పొలోమంటూ తయారవుతారు. పెద్దలు వాకిట్లో ముగ్గులు వేస్తుంటే.. చిన్నారులు ఇంటి గోడల్నే కాన్వాస్‌గా మలుచుకుంటారు. ‘క్రేయాన్స్’తో తమ క్రియేటివిటీని బయటపెడతారు. ఇంటిని రంగుల్లో ముంచేస్తారు. అలా.. గోడలు పాడుకాకుండా, పిల్లల్లో పెయింటింగ్‌పై ఆసక్తిని పెంచేలా సరికొత్త కలరింగ్ టీషర్టులను తయారుచేశారు. వీటిని చిన్నారులకు అందిస్తే చాలు.. ఈ టీషర్టులే కాన్వాస్‌గా, అందమైన బొమ్మలకు రంగులద్దుతారు. తమలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంటారు. పిల్లల్ని ముగ్గులోకి దించేస్తున్న కాన్వాస్ టీషర్ట్‌ల ముచ్చట్లు ఇవి..

రంగులు వేయడంలోనే పిల్లలు ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. తల్లిదండ్రులు కూడా.. వారికోసం కలరింగ్ బుక్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే, అల్లరి పిల్లలు మాత్రం పుస్తకాలను పక్కనపెట్టి.. గోడలు, మార్బుల్ ఫ్లోరింగ్పైనే తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తుంటారు. అందుకే.. చిన్నారులను ఆకర్షించేలా కలరింగ్ టీషర్టులు వస్తున్నాయి. చిన్నారులే రంగులు వేసుకునేలా రూపొందుతున్నాయి. టీషర్ట్తోపాటే కలర్ మార్కర్లు కూడా వస్తున్నాయి. పిల్లలకు బహుమతిగా అందించడానికి ఇవి బెస్ట్ ఆప్షన్. ఇంట్లో రెగ్యులర్‌గా వేసుకోవడానికి, పండుగలు, పుట్టినరోజు వేడుకలకూ అనుకూలంగా ఉంటాయి.

పిల్లలు ఇష్టపడేలా సరికొత్త కలరింగ్ టీషర్టులు మార్కెట్లలో సందడి చేస్తున్నాయి. 100 శాతం ప్రీమియం కాటన్‌తో, పిల్లల ఆసక్తికి తగ్గట్టుగా.. రకరకాల డిజైన్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ టీషర్టులను తమకు నచ్చిన రంగులతో నింపేసుకోవచ్చు. ఆ రంగులు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. మరికొన్ని మాత్రం.. వాషబుల్ మార్కర్లతో వస్తున్నాయి. అంటే, దుస్తుల్ని ఉతికినప్పుడు మురికితోపాటు రంగులు కూడా పోతాయి. మళ్లీ పెయింటింగ్‌కు సిద్ధంగా ఉంటాయి. ఈసారి విభిన్నమైన రంగులను ప్రయత్నించొచ్చు. అలా.. మళ్లీమళ్లీ రంగులు వేసుకోవచ్చు. ఈ రంగులు పూర్తిగా బయోడిగ్రేడబుల్. పిల్లల చర్మానికే కాదు.. పర్యావరణానికీ అనుకూలమైనవి.

కలరింగ్ టీషర్టులు పిల్లల్ని స్మార్ట్స్క్రీన్లకు దూరంగా ఉంచుతాయి. వారిలోని సృజనాత్మకతను బయటికి తీసుకొస్తాయి. రంగుల పుస్తకాలను పిల్లలు తొందరగా పూర్తిచేస్తారు. అదే, టీషర్టులపై పెయింట్ వేయాలంటే.. ఆయా బొమ్మలను పరిశీలించడానికి, ఆలోచనాత్మకంగా రంగులు వేయడానికి కాస్త ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. దాంతో, వారిలో ఓపిక పెరుగుతుంది. రంగులు వేయడం పూర్తయ్యేవరకు వదలరు. అలా.. పట్టుదల, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్నీ అందిపుచ్చుకుంటారు.
ప్రీస్కూల్ చిన్నారులైతే.. క్రేయాన్స్ పట్టుకోవడం, చేతులను సమన్వయం చేసుకోవడం, ముందుకు-వెనక్కి రాయడం అలవాటు చేసుకుంటారు. ఓపికగా రంగులు వేయడం వల్ల వారిలో సూక్ష్మదృష్టి పెరుగుతుంది. రంగు వేయడం ప్రారంభించే ముందే ఖాళీ దృశ్యాన్ని చూడటం వల్ల.. పిల్లల్లో ఊహాశక్తి కూడా పెరుగుతుంది. మరింకేం, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. ఒక్క టీషర్టుతో ఎన్నో ప్రయోజనాలు. ఒక్కసారి కొని చూడండి. ఆ తర్వాతే నమ్మండి!