వ్యాయామం అనగానే.. చాలామంది మహిళలు నడక, యోగా, జుంబా, ఎరోబిక్స్ వైపే చూస్తుంటారు. అతికొద్ది మంది మాత్రమే కఠినమైన ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి.. యువతులే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే, 40-50 ఏళ్లలోపు మహిళలు కూడా.. బరువులు ఎత్తే వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, కండరాల శక్తి కోసం ‘రెసిస్టెన్స్ ట్రైనింగ్’ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
వయసు పెరిగేకొద్దీ మహిళల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. కండరాల ద్రవ్యరాశి తగ్గుతుంది. ఎముకలు బలహీనం అవుతాయి. జీవక్రియ మందగిస్తుంది. శక్తి స్థాయులూ తగ్గుతాయి. ఈ అనూహ్యమైన మార్పులతో అలసట, బరువు పెరగడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి.. మహిళలు ‘రెసిస్టెన్స్ ట్రైనింగ్’ తీసుకోవాలని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు.
డంబెల్స్ ఎత్తడం, పుష్ అప్స్ చేయడం, స్క్వాట్స్, ప్లాంక్స్ లాంటి వ్యాయామాలు.. మహిళల ఆరోగ్యానికి భరోసా ఇస్తాయని అంటున్నారు. కండలు పెంచడానికీ, బాడీబిల్డింగ్ కోసమే ఇలాంటి కఠినమైన వ్యాయామాలు చేస్తారని చాలామంది భావిస్తారు. అయితే, 40-50 ఏండ్ల మహిళల్లో వయసురీత్యా వచ్చే శారీరక సమస్యలను.. ‘రెసిస్టెన్స్ ట్రైనింగ్’ ద్వారా తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే, ఫిట్నెస్ ట్రైనర్ మార్గదర్శకత్వంలోనే ఎక్సర్సైజ్లు చేయాలని సూచిస్తున్నారు.